Tuesday, May 21, 2024

స్త్రీల ప్రాతినిధ్యం లేని ‘స్త్రీనిధి’

తప్పక చదవండి
  • పేదరిక నిర్మూలన కోసం ఏర్పాటైన ‘స్త్రీ నిధి’ అగ్రవర్ణ రిటైర్డ్ అధికారుల చేతిలో బంధీ..
  • రిటైర్డ్ అధికారి విద్యాసాగర్ “రెడ్డి” లాబీయింగ్ ను కాపాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం!
  • రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు విరుద్ధంగా 12 ఏళ్ళుగా విద్యాసాగర్ రెడ్డి కొనసాగింపు..
  • రిటైర్డ్ అధికారులకు రిహాబిలిటేషన్ సెంటర్ గా మారిన ‘స్త్రీ నిధి’
  • మంత్రి సీతక్క మౌనం ‘స్త్రీనిధి’కి పెను ప్రమాదం..
  • స్త్రీల ప్రాతినిధ్యమే లేని తెలంగాణ ‘స్త్రీనిధి’పై “ఆదాబ్” ప్రత్యేక కథనం..

పెరుమాళ్ళ నర్సింహారావు, ‘ఆదాబ్ హైదరాబాద్’ ప్రత్యేక ప్రతినిధి

సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల్లో పొదుపు చేస్తున్న మహిళలు గ్రామ సంఘాలుగా ఏర్పాటై, మండల సమైఖ్య, ఆపైన జిల్లా సమైక్యలుగా నిర్మాణం జరిగి, అన్ని జిల్లా మహిళా సమైక్య సభ్యుల నుండి స్త్రీలే ‘స్త్రీ నిధి’కి పాలకమండలిని ఏర్పాటు చేసుకుంటారు. అధ్యక్షులుగా, ఉపాధ్యక్షులుగా, కోశాధికారిగా ఇలా మొత్తం 19 మంది బోర్డ్ డైరెక్టర్లుగా నియమించబడతారు. ఈ ప్రక్రియ మొత్తం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల మేరకు ఏర్పాటైన ‘క్రెడిట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్’ అని పిలువబడే ఈ సంస్థకు ఎన్నుకోబడిన ఈ 19 మంది మహిళ డైరెక్టర్లే శాసనకర్తలు. వీళ్లు తీర్మానించిందే శాసనం, వీళ్ళ నిర్ణయమే ఫైనల్. కానీ ఇక్కడ అది అమలు జరగడం లేదు. ఈ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్ గా 12 ఏళ్లుగా తిష్ట వేసి కూర్చున్న రిటైర్డ్ అధికారి విద్యాసాగర్ రెడ్డి ‘స్త్రీ నిధి’ని తన చెప్పు చేతల్లో పెట్టుకున్నారు. మహిళా డైరెక్టర్లను తాను రచించిన తీర్మానాలపై సంతకాలు పెట్టడానికి మాత్రమే పరిమితం చేసిన వైనం ఇక్కడ నెలకొంది.

- Advertisement -

2021-22 స్త్రీనిధి అధికారిక లెక్కల ప్రకారం రూ.312 కోట్ల 81 లక్షలు ఇందులో మహిళల వాటాదనం ఉండగా, రూ.43 కోట్ల 52 లక్షలు రాష్ట్ర ప్రభుత్వ వాటాధనాన్ని ఇందులో కలిపింది. నిరుపేద మహిళల అభ్యున్నతి, ఆర్థిక స్వాలంబన కోసమే ఏర్పాటైనట్లు చెప్పుకుంటున్న స్త్రీ నిధి పూర్తిగా ఇప్పుడైతే అగ్రవర్ణ రిటైర్డ్ అధికారుల చేతుల్లో బందీగా మారింది. కేవలం మహిళా పాలకమండలి సభ్యుల అధికార ఆదేశాలతో నడవాల్సిన ఈ ‘స్త్రీ నిధి’ ఒక రిటైర్డ్ అధికారి అయిన విద్యాసాగర్ రెడ్డి చేతిలో హస్తగతం అయింది. పూర్తిగా ఆయన కనుసన్నల్లోనే ఈ సంస్థ నడుస్తోంది.

రిటైర్డ్ అధికారులకు రిహాబిలిటేషన్ సెంటర్ గా మారిన దుస్థితి..
తెలంగాణ స్త్రీనిధికి ప్రస్తుతం మేనేజింగ్ డైరెక్టర్ గా కొనసాగుతున్న విద్యాసాగర్ రెడ్డి 2009లో నాబార్డు సంస్థలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా వీఆర్ఎస్ తీసుకొని, సెర్ప్ లో కన్సల్టెంట్ గా చేరారు. అక్కడ మొదలైన ఈయన ప్రస్థానం వక్రమార్గాల ద్వారా 2011 నుండి ఇప్పటివరకు ఈ సంస్థకు ఎం.డిగా కుర్చీని వదిలిపెట్టకుండా, పాలనలో ఉన్న ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకుంటూ, గడిచిన 12 ఏళ్లుగా స్త్రీనిధిని తన హాస్తగతం చేసుకున్నాడనే ఆరోపణలు కోకొల్లలు.

సహకార చట్టం -1964 మరియు రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు విరుద్ధంగా విద్యాసాగర్ రెడ్డి కొనసాగింపు..
సహకార చట్టం -1964 రూల్ నం.28 ప్రకారం ఏదైనా సొసైటీలో సి.ఇ.వో మరియు వేతన అధికారులు 58 సంవత్సరాలకు మించి సర్వీసులో ఉండకూడదు అనే నిబంధన వున్న కూడా దానిని తుంగలో తొక్కి తెలంగాణ స్త్రీ నీధిలో వున్న 9 మంది రిటైర్డ్ ఉద్యోగులు 61 సంవత్సరాలకు పైబడిన వారే వుండడం కొసమెరుపు. 25 జూన్ 2021న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన కో-ఆపరేటివ్ బ్యాంకుల మేనేజింగ్ డైరెక్టర్లు, సిఈఓల నియమావళికి చెందిన నిబంధనలను పరిశీలిస్తే, స్త్రీనిధి విద్యాసాగర్ రెడ్డిని ఒక్క నిమిషం కూడా ఈ సంస్థకు ఎండిగా కొనసాగించడానికి వీలులేదు. (సంబంధిత ఆర్బిఐ విడుదల చేసిన నిబంధన లేఖ నెం.ఆర్.బి.ఐ/2021-22/60, డి.ఓ.ఆర్.జి.ఓ.వి.ఆర్.ఈ.సి.25/12.10.000/2021-22, తేది.25-06-2021).

రిటైర్డ్ అయిన వాళ్లు మేనేజింగ్ డైరెక్టర్ గా సంబంధిత సంస్థలో ఐదేళ్ల కంటే ఎక్కువ కాలం కొనసాగరాదని రిజర్వ్ బ్యాంక్ జారీచేసిన సర్కులర్ లో స్పష్టంగా పేర్కొంది. గతంలో ఐదేళ్లు పనిచేసిన ఎం.డినే మళ్లీ తిరిగి అదే సంస్థలో కొనసాగించాల్సి వస్తే, ఖచ్చితంగా మధ్యలో మూడు సంవత్సరాల కూలింగ్ పీరియడ్ ఉండాల్సిందేనని ఆర్బిఐ నిబంధనలో పేర్కొంది. సదరు ఆ 3 సంవత్సరాల కూలింగ్ పీరియడ్ లో అట్టి సంస్థ జరిపే బ్యాంకింగ్ వ్యవహారాలలో సంబంధిత ఎం.డి ఎలాంటి జోక్యం చేసుకోరాదు. గరిష్ట పరిమితి 15 సంవత్సరాలు అనుకుంటే, ప్రతీ 5 సంవత్సరాలకు మధ్యలో 3 సంవత్సరాలు కూలింగ్ పీరియడ్ ఉండి తీరాల్సిందేనని ఆర్బిఐ స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. విద్యాసాగర్ రెడ్డి విషయంలో నాటి 2011 నుండి మొదలు నేడున్న కాంగ్రెస్ ప్రభుత్వం వరకు ఈ కూలింగ్ పీరియడ్ విషయాన్ని పట్టించుకోకుండా, గరిష్ట పరిమితి కాలం 15 సంవత్సరాలు అనే దానినే పరిగణలోకి తీసుకున్నట్లు స్పష్టం అవుతుంది. ఇది పూర్తిగా రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు విరుద్ధమైనటువంటి విషయం. రిజర్వ్ బ్యాంక్ నిబంధనలను తుంగలో తొక్కి, అన్ని పరిమితులను అధిగమించి సీక్రెట్ జీవోలతో కాలం గడుపుతున్న విద్యాసాగర్ రెడ్డినే ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం కూడ కొనసాగించడం శోచనీయం, అర్ధరహితం. స్త్రీనిధిలో విద్యాసాగర్ రెడ్డితో పాటు మరో 8 మంది డిప్యూటీ జనరల్ మేనేజర్లుగా చలామణి అవుతున్న వీళ్ళందరూ కూడా రిటైర్డ్ అయిన వారే కావడం, అంతకు మించి వీళ్లంతా అగ్రవర్ణ అధికారులుగా ఇక్కడ కొనసాగడం సెర్ప్ స్ఫూర్తికి విరుద్ధం. స్త్రీనిధి అనే ఈ సంస్థ రిటైర్డ్ అధికారులకు రిహాబిలిటేషన్ సెంటర్ గా మారిందనే వాదన వినబడుతోంది.

విద్యాసాగర్ “రెడ్డి” లాబీయింగ్ ను కాపాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం..
సహకార చట్టం -1964 మరియు ఆర్బిఐ నిబంధనలను పాతరేసి స్త్రీనిధికి సుదీర్ఘ కాలంగా మేనేజింగ్ డైరెక్టర్ గా పాతుకుపోయిన విద్యాసాగర్ రెడ్డికి తమ్ముడైన జి.చంద్రశేఖర్ రెడ్డి అనే ఐ.ఎఫ్.ఎస్ అధికారి ప్రస్తుతం రేవంత్ రెడ్డి సీఎంఓలో పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. ఈయన లాబీయింగ్ వల్లనే తన అన్నపై పత్రికల్లో ఎన్ని వార్తలు వస్తున్నా, సహకార చట్టం, రిజర్వు బ్యాంక్ నిభందనలు ఎన్ని ఉన్నా, ప్రభుత్వం ఆయనపై చర్యలు తీసుకోలేకపోతున్నందుకు తెరవెనుక చక్రం తిప్పుతున్న ఈయనే కారణమని అందరూ చెప్పుకుంటున్నారు. అటు అన్న విద్యాసాగర్ రెడ్డి, ఇటు తమ్ముడు చంద్రశేఖర్ “రెడ్డి” లాబీయింగ్ నకు కాంగ్రెస్ ప్రభుత్వం తలొగ్గిందనే విమర్శలు వినపడుతున్నాయి.

మంత్రి సీతక్క మౌనం.. ‘స్త్రీనిధి’కి పెను ప్రమాదం..!
ప్రస్తుతం ఈ శాఖ మంత్రి సీతక్క పరిధిలో ఉన్నది. రిటైర్డ్ అధికారి జి.విద్యాసాగర్ రెడ్డి స్త్రీనిధిలో సుదీర్ఘకాలంగా ఎండిగా ఉన్న విషయం, స్త్రీనిధి సొమ్మును గత ప్రభుత్వ హయాంలో ఎర్రబెల్లి దయాకర్ రావు నియోజకవర్గంలో ఏ విధంగా దుబారా చేసింది అనే విషయాలు ఇప్పటికే సీతక్క దృష్టికి చేరినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో సీతక్క జనవరి నెలలో సమీక్ష నిర్వహించి డిపార్ట్మెంట్ విచారణ కమిటీ ఏర్పాటు చేశామని ప్రకటించగా, స్త్రీ నిధి అవకతవకలపై తప్పక చర్యలు ఉంటాయని అందరూ భావించారు. కానీ విచారణకు ఆదేశించి 2 నెలలు గడిచినప్పటికి నేటికీ స్త్రీ నిధి మేనేజింగ్ డైరెక్టర్గా జి.విద్యాసాగర్ రెడ్డినే కొనసాగిస్తూ, ఎలాంటి చర్యలు లేకుండా ప్రభుత్వం సైలెంట్ గానే ఉన్నది. అలాగే రాష్ట్రంలో వివిధ శాఖల్లో పని చేస్తున్న1049 మంది రిటైర్డ్ అధికారుల తొలగింపు విషయంలో ఇంకా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. సీతక్క లాంటి ప్రజాస్వామ్య వాదులు కూడా ఇలాగే మౌనం వహిస్తే.. స్త్రీ నిధి భవిష్యత్తులో పెను ప్రమాదంలోకి నెట్టబడుతుందని అందరు భావిస్తున్నారు.

స్త్రీనిధిలో 19 మంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లుగా ఉన్న మహిళా ప్రతినిధులతో సీతక్క ఒకసారి చర్చించగలిగితే, స్త్రీనిధిలో జరుగుతున్న అవినీతి బాగోతం మొత్తం బయటికి వచ్చే అవకాశం లేకపోలేదు. సహకార చట్టం -1964 మరియు రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం సర్వ అధికారాలు కలిగిన సదరు మహిళా డైరెక్టర్లు ఇక్కడ కేవలం విద్యాసాగర్ రెడ్డి పిలిచినప్పుడు రావడం, ఆయన ఎక్కడ సంతకాలు చేయమంటే అక్కడ చేయడం తప్ప, విద్యాసాగర్ రెడ్డి ఏర్పాటు చేసుకున్న ఈ దర్బార్ లో ఒక్కరు కూడా ఎదురు ప్రశ్నించలేని దుస్థితి నెలకొందని వారంతా కుమిలిపోతున్నారు. సీతక్కా..! మరి మీరే కాపాడాలి ఈ స్త్రీ నిధిని.

మరిన్ని సంచలన విషయాలు వచ్చే సంచికలో..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు