- కల్వకుంట్ల హిమాన్షుకు విద్యార్థుల నుంచి రిక్వెస్టులు
- తమ స్కూల్‌ను కూడా దత్తత తీసుకోవాలంటూ విన్నపం
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు
హైదరాబాద్, 14 జులై ( ఆదాబ్ హైదరాబాద్ ) :
“హిమాన్షు అన్నా.. మా స్కూల్‌లో వాష్ రూమ్స్ సరిగ్గా లేవు.. మాకు బెంచీలు బాలేవు.. ఇక కంప్యూటర్లు లేనే లేవు. మంచి స్కూల్ డ్రెస్సులు, కరాటే, డ్యాన్స్ క్లాసులు కావాలి.. ఇవన్నీ మాకు కావాలి.. ప్లీజ్ హిమాన్షు అన్నా.. మా స్కూల్‌ని దత్తత తీసుకొండి.” అంటూ కొందరు చిన్నారులు కల్వకుంట్ల హిమాన్షు రావును దీనంగా వేడుకుంటున్నారు. ఎందుకంటే.. హైదరాబాద్ శివార్లలో కేశవనగర్‌లోని అత్యంత దీనస్థితిలో ఉన్న సర్కారు బడిని.. సుమారు కోటి రూపాయలు ఖర్చు చేసి కార్పొరేట్ స్కూల్‌లా మార్చేసి.. అందరి దృష్టిని ఆకర్షించారు. ఎంతో మంది చేత ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రభుత్వం ఇన్నేళ్లుగా చేయలేని పనిని.. తాను చేసి చూపించాడని ప్రత్యర్థి పార్టీల నేతలు కూడా కొనియాడుతున్నారు. దీంతో.. రాష్ట్రంలోని మిగతా సర్కారు బడుల పిల్లలు.. హిమాన్షుకు వీడియోలు తీసి రిక్వెస్టుల మీద రిక్వెస్టులు పంపిస్తున్నారు. హిమాన్షు దత్తత తీసుకుంటే.. తమ పాఠశాల కూడా కేశవనగర్ స్కూల్‌లా అందంగా తయారవుతుందని వాళ్ల ఆశ కాబోలు.
అందులో భాగంగానే.. హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్, దత్తనగర్‌లోని పాఠశాల విద్యార్థులు వినూత్న నిరసన తెలిపారు. మన ఊరు – మన బడి అనే కార్యక్రమం ద్వారా తమ స్కూల్‌ను అభివృద్ధి చేస్తామంటూ.. ఇప్పటివరకు కనీసం ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించకుండా కాలయాపన చేస్తోన్న ప్రభుత్వంపై తమకు ఏమాత్రం నమ్మకం లేదంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. నగర శివారులోని కేశవనగర్ పాఠశాలను దత్తత తీసుకుని కార్పొరేట్ స్కూల్‌లా మార్చినట్టుగా.. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న తమ పాఠశాలను కూడా దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలంటూ హిమాన్షుకు రిక్వెస్ట్ చేశారు. హిమాన్షు ఫొటోతో ఉన్న ఫ్లకార్డులు పట్టుకుని వాళ్లకు ఏఏ పనులు కావాలో దానిపై రాసి.. ప్రదర్శించారు చిన్నారు. కాగా.. ఇప్పుడు ఈ పిల్లలకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కేవలం వీళ్లు మాత్రమే కాదు.. రాష్ట్రంలో దయనీయంగా ఉన్న సర్కారు బడుల విద్యార్థులు కూడా హిమాన్షుకు రిక్వెస్ట్ చేస్తున్నారు.
కాగా.. రంగారెడ్డి జిల్లా కేశవనగర్ సర్కార్ స్కూల్‌ను దత్తత తీసుకున్న హిమాన్షు తన స్నేహితుల ద్వారా సేకరించిన కోటి రూపాయల ఫండ్‌తో ఆకర్షణీయంగా అభివృద్ధి చేశారు. అయితే.. ఈ స్కూల్ ప్రారంభోత్సం సందర్భంగా.. హిమాన్షు చేసిన ప్రసంగం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ స్పీచ్‌లో.. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో కనీసం మౌలిక వసతులు కూడా లేవని.. విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని.. కేశవనగర్ స్కూల్ విద్యార్థుల పరిస్థితి చూసి తనకు ఏడుపు వచ్చిందంటూ.. ఓ రేంజ్‌లో ఇరగదీశారు. కానీ.. ఈ స్పీచ్ పరోక్షంగా తన తాత ప్రభుత్వంలోని వైఫల్యాలను ఎత్తి చూపినట్టు ఉందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. ఈ క్రమంలో.. పిల్లల నుంచి వస్తున్న రిక్వెస్టులు ఆసక్తికరంగా మారాయి.