Wednesday, May 15, 2024

అక్రమార్కుల జేబుల్లోకి సమగ్ర శిక్ష నిధులు..!

తప్పక చదవండి
  • బోగస్ యుటిలైజేషన్ సర్టిఫికేట్ లు పెట్టి నిధులు కాజేసిన వైనం
  • ప్రేక్షక పాత్రులుగా పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు
  • సమగ్ర శిక్ష అభియాన్ లక్ష్యానికి మంగళం
  • 2016 నుంచి 2022 వరకు కేటాయించబడిన నిధుల మొత్తం రూ.6,739 కోట్లు
  • పెద్ద ఎత్తున దుర్వినియోగమైన ఫండ్స్
  • సమగ్రంగా విచారిస్తే వందల కోట్ల స్కాం బట్టబయలు

ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర శిక్ష అభియాన్ నిధులు గత ప్రభుత్వ హయంలో పక్కాదారి పట్టేశాయి. ఉన్నతాధికారుల అండ.. క్షేత్ర స్థాయి సిబ్బంది విచ్చలవిడితనంలో ఈ ఫండ్స్ భారీగా మిస్ యూజ్ అయ్యాయి. విద్యా వ్యవస్థ బలోపేతం, పాఠశాలల్లో అదనపు గదులు, మెరుగైన వసతుల కోసం కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల కాంబినేషన్ లో ప్రతీ ఏటా సమగ్ర శిక్ష అభియాన్ ద్వారా పెద్ద ఎత్తున విద్యాశాఖకు నిధులు విడుదల అవుతుంటాయి. అందులో భాగంగానే 2016 నుంచి 2022 అకాడమిక్ ఇయర్స్ వరకు సమగ్ర శిక్ష అభియాన్ ద్వారా తెలంగాణకు రూ.6,739.32 కోట్ల నిధులు విడుదలయ్యాయి. ఇందులో కేంద్రం 60 శాతం వాటాగా ఫండ్స్ ను రిలీజ్ చేయగా.. గత బీఆర్ఎస్ సర్కార్ 40 శాతం ఇచ్చేంది.

అయితే ఇలా వచ్చిన నిధులను బాలబాలికల ప్రయోజనాల కోసం వినియోగించినట్లు అధికారులు లెక్కల్లో చూపించారు. కానీ, వారు రికార్డులకు చూపించిన లెక్కలు.. వాస్తవాలకు ఎక్కడ పొంతన లేకపోవడం గమనార్హం. ఇదే విషయంపై ఆదాబ్ హైదరాబాద్ తనదైన శైలిలో నజర్ పెట్టింది. వాస్తవానికి లెక్కల్లో నిజం ఎంతుంది..? ఎక్కడెక్కడ ఏఏ కార్యక్రమాలకు నిధులను వినియోగించారు…? సమగ్ర శిక్ష అభియాన్ ద్వారా ప్రవేశ పెట్టిన పథకాలు సక్రమంగానే అమలు చేశారా..? లేదా..? అనే విషయాలను నిర్ధారణ చేసుకోవడం కోసం.. ఆదాబ్ హైదరాబాద్ ప్రతినిధులు సంవత్సరాల వారీగా ఆ డేటాను ఇవ్వాల్సిందిగా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ / సంచాలకులుతో పాటు అడిషనల్ స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ రమేష్,స్టేట్ ఫైనాన్స్ కంట్రోలర్ వెంకన్నలను సమాచారం ఇవ్వాలని కోరడం జరిగింది. కానీ, ఇప్పటి వరకు వారి దగ్గర నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడం గమనార్హం.

- Advertisement -

ఈనేపథ్యంలోనే ఈ వ్యవహారాన్ని లోతుగా పరిశీలిస్తే.. సమగ్ర శిక్ష అభియాన్ ద్వారా వచ్చిన నిధులు పెద్ద ఎత్తున దారి మళ్లినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనర్ స్థాయిలో ఉన్న అధికారి విద్యార్థుల ప్రయోజనార్థం కాకుండా కొంతమంది ఉన్నత స్థాయి అధికారులు అండతో నిధులు పక్కదారి పట్టించినట్లు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లాలో అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాల లేకుండానే, ఆ పాఠశాల కోసం నిధులు కేటాయించి, వాటిని పక్కదారి పట్టించారు. ఈ రోజు వరకు కూడా రంగారెడ్డి జిల్లాలో అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాల లేదు. కానీ, అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాల కొనసాగుతున్నట్లు ఆ పాఠశాలకు నిధులు కేటాయించారు అంటే, పాఠశాల విద్యావ్యవస్థ ఎంత అద్వానంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఈ నిధులను జిల్లాలోని అవినీతి అధికారులే పక్కగా పథకం ప్రకారం కాజేసినట్లు సమాచారం.

ఇదే విషయంపై ఆర్టీఐ ద్వారా సమాచారం కోరగా.. అధికారులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో అసలు దొంగతనం బయటపడడం విశేషం. హైదరాబాద్ జిల్లాలో అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలకు 2017- 18 విద్యా సంవత్సరానికి గాను రూ.52,78,000లు 2018-19 విద్యా సంవత్సరానికి రూ.49,60,000లు కేటాయించారు. 2019 – 20 విద్యా సంవత్సరానికి 46,72,000 కేటాయించారు. ఈ మూడు సంవత్సరాలకు గాను సుమారు రూ.1 కోటి 49.10 లక్షలు కేటాయింపులు జరిగాయి. అలాగే 2020-21 విద్యా సంవత్సరానికి గాను రూ.4,24,000 నిధులు కేటాయింపులు జరిగాయి. అయితే గడచిన ఈ 3 సంవత్సరాల నిధుల గురించి లెక్కలు చెప్పడంలో మాత్రం అధికారులు దారుణంగా విఫలమవడం గమనార్హం.

మరోవైపు సంవత్సరానికి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల నుండి అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలకు దాదాపు రూ.40 లక్షల పై చిలుకు వెచ్చిస్తే.. అప్పటి హైదరాబాద్ జిల్లా డీఈవో ఆ నిధులు దారి మళ్లించారనే ఆరోపణలున్నాయి. ఇదే కాకుండా ఇన్స్పైర్ ప్రోగ్రాంకి కేటాయించిన నిధులు బోగస్ బిల్లులు పెట్టి ఆ నిధులను మాయం చేసినట్లు సమాచారం. అంతేకాక భవిత సెంటర్లకు కేటాయించిన నిధులను సైతం గోల్ మాల్ చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ జిల్లాలో విద్యార్థులకు స్పోర్ట్స్ నిర్వహించడానికి కేటాయించిన రూ.35 లక్షల నిధులను విద్యాశాఖలోని కొందరు అవినీతి అధికారులు కుమ్ముకై దిగమింగినట్లు సమాచారం. ఇదే తంతు తెలంగాణ రాష్టంలోని అన్ని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో జరగడం విస్మయం కలిగిస్తుంది.

అయితే ఇంత భారీ ఎత్తున సమగ్ర శిక్ష అభియాన్ ద్వారా వచ్చిన నిధులను కొందరు అవినీతి అధికారులు దిగమింగుతుంటే కమిషనర్ మాత్రం ప్రేక్షక పాత్ర వహించడం గమనార్హం. ఇక నిధుల మళ్లింపులో ప్రధాన పాత్ర పోషించిన అప్పటి హైదరాబాద్ జిల్లా డీఈఓ, అప్పటి స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, కమిషనర్ విజయ్ కుమార్, అప్పటి అడిషనల్ స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ లకు కమిషనర్ అండగా నిలుస్తున్నారనే ఆరోపలున్నాయి. ఇదే విషయమై స్కూల్ ఎడ్యుకేషన్ ప్రస్తుత కమిషనర్ ను వివరణ కోరగా..ఆమె అస్సలు స్పందించకపోవడం చిత్రంగా ఉంది. దీన్ని బట్టే తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సమగ్ర శిక్ష అభియాన్ కు సంబంధించిన నిదుల్లో గోల్ మాల్ జరిగినట్లు అర్థమవుతోంది. తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలో జరిగిన సమగ్ర శిక్ష నిధుల దుర్వినియోగంపై పూర్తి ఆధారాలతో మరో కథనం ద్వారా మీ ముందుకు రానుంది.. ఆదాబ్ హైదరాబాద్.. మా అస్త్రం.. అవినీతిపై అస్త్రం.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు