- అధికారులతో జిల్లా కలెక్టర్ సీ. నారాయణరెడ్డి
- మామిడి పంట సాగుపై కలెక్టరేట్‌లో రైతులతో అవగాహన సదస్సు
వికారాబాద్ జిల్లా : ఉద్యాన పంటలు సాగు చేస్తూ రైతులు అధిక లాభాలు పొందే విధంగా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి తెలిపారు.శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం, ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో మామిడి సాగు పై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ముందుగా జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ బి.నీరజ ప్రభాకర్, శాస్త్రవేత్తలు, అధికా రులతో జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ… ఉద్యానవన పంటల సాగులో సైంటిస్టుల, అధికారుల సలహా సూచనలు తీసుకుంటూ పంటల దిగుబడులను పెంచుకుంటూ లాభాల బాటలో కొనసాగాలన్నారు. వికారాబాద్ ప్రాంతం అన్ని పంటలను సాగు చేసేందుకు అనుకూల వాతావరణం ఉందని రైతులు ఉద్యాన పంటలు సాగు చేస్తూ ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యానవన పంటల సాగుకై ప్రాధాన్యత ఇస్తుందని, ఇప్పటికే జిల్లాలో కృషి విజ్ఞాన కేంద్రం స్థాపిం చేందుకు భూమి సేకరణకు సిద్ధమవుతుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. భవిష్యత్తులో వికారాబాద్ జిల్లా అభివృద్ధికి ఎంతో అవకాశం ఉందని ఉద్యానవన పంటలో భాగంగా కూరగా యలు, పండ్లు, పూల తోటల సాగుకు రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఇప్పటికే జిల్లాలో 13వేల ఎకరాల విస్తీర్ణంలో మామిడి సాగు జరుగుతుందని తెలిపారు. ఉద్యానవన పంటల సాగుకై జిల్లా యంత్రాగం పూర్తి సహకారం ఉంటుందని కలెక్టర్ తెలిపారు. అనంతగిరి రైతు ఉత్పత్తి సంస్థను ఏర్పాటు చేసి మామిడి పండ్లను దేశ, విదేశాలకు కూడా ఎగుమతి చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.
జిల్లాలో కూరగాయల సాగుకు కృషి చేయాలి : వైస్ ఛాన్స్‌లర్ నీరజ ప్రభాకర్
ఉద్యానవన పంటలతో పాటు జిల్లాలో కూరగాయల సాగుకు హలో అధికారులు, రైతులు కృషి చేయాలని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యానవన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ బి. నిరజా ప్రభాకర్ సూచించారు. హైదరాబాద్ కు అతి సమీపంలో ఉన్న వికారాబాద్ జిల్లాలో కూరగాయలు, పూలు, పండ్ల సాగు విస్తీర్ణం పెంచాలని ఆమె తెలిపారు. అదేవిధంగా అంతర్ పంటల సాగుకు రైతులను ప్రోత్సహించాలని ఆమె సూచించారు. యువ రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఉద్యానవన సాగుకు ముందుకు వెళ్లాలని సూచించారు. ఉత్తర భారతదేశానికి, ఇతర దేశాలకు ఎగుమతి చేసే విధంగా పంటల సాగును పెంచే దిశగా ఉండాలని తెలిపారు. రైతుల బిడ్డలుగా ఉండి వారసత్వంగా వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆమె సూచించారు. తక్కువ వనరులతో ఎక్కువ లాభం పొందే ఉద్యానవన పంటలను సాగు చేస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆమె అన్నారు. పంటలు వేసే క్రమంలో ఒకే పంటను ఎక్కువ మోతాదులో వేయకుండా దఫా దఫాలుగా వేయాలని ఆమె సూచించారు. ఈ అవగాహన కార్యక్రమంలో ఉద్యాన మరియు పట్టు పరిశ్రమల శాఖ సంచాలకులు భగవాన్ , అపెడ ఏజిఎం ఆర్.పి. నాయుడు, ఉపసంచాలకులు మధుసుదన్, ఎఫ్ పి ఓ డైరెక్టర్ సుబ్బారెడ్డి, ఏ ఆర్ ఫామ్ ఎండి మమ్మద్ రఫీ, ఉద్యానవన శాఖ అధికారులు కమల, వైజయంతి, అర్చన, విజయ్ కుమార్ లతో పాటు బ్యాడ్మింటన్ జాతీయ క్రీడాకారిణి గుత్తా జ్వాలా, అధికారులు రైతులు పాల్గొన్నారు.