Friday, October 11, 2024
spot_img

దేవుని మాన్యానికి శఠగోపం..!(హక్కులు లేకున్నా.. భూ బదలాయింపు.. హైకోర్ట్ ఆదేశాలు బేఖాతర్)

తప్పక చదవండి
  • రూ.3 వేల కోట్ల స్కాం,1,148 ఎకరాల భూమి మాయం
  • ఎండోమెంట్ చట్టాలను తుంగలో తొక్కిన వైనం
  • డివిజన్ బెంచ్ తీర్పును కాదని.. సింగిల్ బెంచ్ ముందు మళ్లీ రిట్ పిటిషన్
  • విషయం తెలిసి చివాట్లు పెట్టిన హైకోర్టు
  • శ్రీ సీతారామచంద్ర స్వామి ల్యాండ్స్ పై టీఎస్ఐఐసీ, ఎండో మెంట్ అధికారుల చిత్ర, విచిత్రాలు
  • కేటీఆర్, జయేష్ రంజన్, టీఎస్ఐఐసీ ఎండీ ఈ.వెంకట నర్సింహారెడ్డి, దేవాదాయ-ధర్మాదాయ శాఖ కమిషనర్ వి.అనిల్ కుమార్ పాత్ర..!?
  • కొత్త సర్కార్ దృష్టి సారిస్తే మొత్తం స్కాం బయటపడే ఛాన్స్..

హైదరాబాద్ : భూ దొంగలకు మనం, దైవం అనే తేడా ఉండేట్లు లేదు..! అనుకున్నంత సంపద వస్తుండడంతో.. దేవుడికే శఠగోపం పెట్టేశారు. వ్యవస్థలను మ్యానేజ్ చేసి, వాటిని తమ జేబు సంస్థలుగా వాడుకొని భగవంతుడికే నామాలు పెట్టారు. ఆ దేవుడి పేరున ఉన్న ల్యాండ్ ను అప్పనంగా కొట్టేసి వేల కోట్ల రూపాయాలను వెనకేసుకున్నారు. ఇందుకోసం ఎండోమెంట్ చట్టాలను తుంగలో తొక్కి యధేచ్ఛగా యవ్వారాలను కానిచ్చేశారు. నవ్విపొదురుగాక నాకేంటి సిగ్గన్నట్లు ఏ మాత్రం ఇజ్జత్ లేకుండా వందల ఎకరాల దేవుని మాన్యాన్ని అక్రమంగా టీఎస్ఐఐసీకి బదలాయించి సుమారు రూ.3 వేల కోట్లు తప్పుడు పద్ధతుల్లో దండుకోవడం శోచనీయం. బీఆర్ఎస్ సర్కార్, యువరాజు ఐటీ మంత్రిగా ఉన్న టైంలో జరిగిన ఈ వేల కోట్ల స్కాంపై ఆదాబ్ ప్రత్యేక కథనం.

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల సీతారాంపూర్ గ్రామం సర్వే నెంబర్స్ 1663 నుంచి 1673లలో శ్రీ సీతారామచంద్ర స్వామివారికి వందల ఎకరాల భూమి ఉండేది. అనేక మంది దాతలు చాన్నాళ్ల క్రితమే ఆలయ అభివృద్ధి, దూప, దీప, నైవేధ్య అవసరాల కోసం ఈభూమిని దానం చేయడం జరిగింది. ఈ భూములే సీతారామచంద్ర స్వామి వారి ఆలయ అవసరాలు కూడా తీర్చేవి. అయితే ఈ భూములపై 2006లో అప్పటి రాష్ట్ర సర్కార్ కర్ర పెత్తనం చేసేందుకు ప్రయత్నించి భంగపడింది. ఈ భూములకు సంబంధించి 2006లో హైకోర్టులో రిట్ ఫిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ పిటిషన్ ను విచారించిన అప్పటి హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం కేసును దేవాలయ భూములను ఇతర అవసరాల కోసం వినియోగించరాదని ఆదేశాలు జారీ చేసింది. దీంతో అప్పటి సర్కార్ నోట్లో పచ్చి వెలగకాయ పడినట్లు కావడంతో సీతారామచంద్ర స్వామి వారి భూముల జోలికెళ్లకుండా గప్ చుప్ అయిపోయింది.

- Advertisement -

బీఆర్ఎస్ సర్కార్ హయంలో ఆలయ భూముల అక్రమ బదలాయింపు
ఇక గత ప్రభుత్వాలు హైకోర్టు ఆదేశాలతో సీతారామచంద్ర స్వామివారి భూముల జోలికి వెళ్లకపోగా.. బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆలయ భూములను అప్పనంగా కొట్టేసే ప్రయత్నానికి శ్రీకారం చుట్టేయడం గమనార్హం. అందులో భాగంగానే ఆలయానికి సంబంధించిన 1148.12 ఎకరాల భూమిని ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కి అప్పగించేలా ఆదేశాలు జారీ చేయాలని టీఎస్ఐఐసీ హైకోర్టు సింగిల్ బెంచ్ ముందు 2020లో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ పిటిషన్ పరిశీలించిన న్యాయస్థానం 2006లో ఇదే వ్యవహారంపై ద్వి సభ్య ధర్మాసనం తీర్పు వెలువరించిందని.. అందువల్ల తాము ఈ విషయంలో ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. అవసరమైతే పిటిషన్ దారులు సీజే ధర్మాసనం ముందుకు వెళ్లాలని సూచించింది. అలా కాకుండా భూసేకరణకు ప్రయత్నిస్తే అది కోర్టు ధిక్కారంగా భావిస్తామని తెలియజేసింది.

కోర్టు ఆదేశాలు బేఖాతర్ చేసి భూ బదలాయింపు

మరోవైపు 2006లో డివిజన్ బెంచ్ సీతారామచంద్రస్వామి వారి భూములను టీఎస్ఐఐసీ భూసేకరణ చేయొద్దని ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ.. వాటిని ఖాతర్ చేయకుండా ల్యాండ్ ఆక్విజేషన్ కు పూనుకోవడం గమనార్హం. అందులో భాగంగానే టీఎస్ఐఐసీ దేవాలయానికి సంబంధించిన మొత్తం భూమిని సేకరించి అందులో ఉన్న సాగుదారులు, ఆక్రమణదారులకు పరిహారం చెల్లించడం విస్మయం కల్గిస్తోంది. ఇందుకుగాను ఎకరాకు రూ.21 లక్షల చొప్పున పరిహారంగా నిర్ణయించి అందులో సగం సాగు, ఆక్రమణదారులకు ఇంకో సగం ఆలయ నిర్వాహకులకు చెల్లించడం విశేషం. ఇక టీఎస్ఐఐసీ స్వాధీనం చేసుకున్న 1,148.12 ఎకరాల భూమిని ఎలక్ట్రిక్ వెహికల్ పార్క్ వారికి బదలాయించే ప్రక్రియను చేపట్టడడం గమనార్హం. అయితే అత్యంత ఖరీదైన ఈ భూమి విలువ సుమారు బహిరంగ మార్కెట్ లో రూ.3,000 కోట్లు పలుకుతుందని అంచనా. ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే.. భూమి సేకరణ చేసుకోవడానికి ఇప్పటి వరకు ఎలాంటి కోర్ట్ ఉత్తర్వులు లేవు. భూ సేకరణ చేయడం చట్ట విరుద్ధం.

ఇంతటి విలువైన ల్యాండ్ ను హైకోర్టు ఆదేశాలను సైతం పక్కన పెట్టి టీఎస్ఐఐసీ స్వాధీనం చేసుకొని పరాధీనం చేసేందుకు యత్నించడం శోచనీయం. ఈ మొత్తం స్కాం బీఆర్ఎస్ సర్కార్ లోని పెద్దల సహకారంతోనే జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అప్పటి ఐటీ మినిస్టర్ కేటీఆర్, ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్, టీఎస్ఐఐసీ ఎండీ ఈ. వెంకట నర్సింహారెడ్డి, దేవాదాయ-ధర్మాదాయ శాఖ కమిషనర్ వి.అనిల్ కుమార్ కనుసన్నల్లో ఈ తంతు జరిగిందనే వాదనలున్నాయి. అందువల్ల ఈ మొత్తం స్కాం బయటకు రావాలంటే కొత్తగా కొలువు దీరిన కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తేనే బాగుంటుందనే అభిప్రాయం పలువురి నుంచి వ్యక్తమవుతోంది. ఈ తంతులో ఎవరెవరికి ఎంతెంత వాటాలు ముట్టాయో పూర్తి ఆధారాలతో మరో కథనంలో మీ ముందుకు తేనుంది ఆదాబ్ హైదరాబాద్.. మా అక్షరం.. అవినీతి పై అస్త్రం.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు