Saturday, April 27, 2024

ఎన్నికల ముందు పూలే గుర్తుకు వచ్చారా

తప్పక చదవండి
  • పదేళ్ల పాలనలో ఆ మహనీయుడిని మరిచారా
  • కవిత డిమాండ్‌పై మంత్రి శ్రీధర్‌ బాబు విమర్శలు

హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో మహనీయులు జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత చేస్తున్న రాజకీయ డిమాండ్‌పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. పదేళ్లుగా లేని విషయం ఇప్పుడే ..అధికారం పోగానే గుర్తుకు వచ్చిందా అని మండిపడుతున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఇప్పటికే కవితకు ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఈ అంశంపై ఇటీవల స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ను కలిసి కవిత వినతిపత్రం కూడా అందజేశారు. అయితే కవిత ప్రతిపాదనపై కాంగ్రెస్‌ నేతలు ధ్వజమెత్తుతున్నారు. జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాలని ఇప్పుడు గుర్తొచ్చిందా?.. పదేళ్లు మీ ప్రభుత్వంలో ఉండి ఏం చేశారంటూ హస్తం నేతలు మండిపడుతున్నారు. తాజాగా ఇదే అంశంపై మంత్రి శ్రీధర్‌ బాబు మాట్లాడుతూ.. కవితపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో జ్యోతిబాపూలే విగ్రహం ఏర్పాటు విషయం 10 ఏళ్ల వాళ్ల ప్రభుత్వంలో కవితకు ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. అప్పుడు ఎవరు అడ్డుకున్నారో ప్రజలకు స్పష్టం చేయాలన్నారు. అప్పటి సీఎం అడ్డుకున్నారా లేక స్పీకర్‌ అడ్డుకున్నారా అనేది స్పష్టం చేయాలన్నారు. జ్యోతిబాపూలే జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించిందే కాంగ్రెస్‌ అని చెప్పుకొచ్చారు. మహనీయులను స్మరించుకోవడంలో కాంగ్రెస్‌కు ఎవరూ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. పార్లమెంట్‌ ఎన్నికలు వస్తున్నాయనే ఆలోచనతో రాజకీయంగా లబ్ది పొందేందుకే జ్యోతిబాపూలే అంశం తెరపైకి తీసుకువచ్చారని మండిపడ్డారు. అసెంబ్లీ పరిసరాలు పూర్తిగా స్పీకర్‌, మండలి చైర్మన్‌ అధీనంలోనే ఉంటాయన్నారు. మండలి చైర్మన్‌ వారి పార్టీ మనిషే కదా అని అన్నారు. గవర్నర్‌ తీసుకునే నిర్ణయాలను వక్రభాష్యం పలకడం కేటీఆర్‌కు సమంజసం కాదన్నారు. ఎమ్మెల్సీల అంశం కోర్టులో కేసు నడుస్తోందని తెలిపారు. న్యాయస్థానానికి కూడా వక్ర భాష్యం పలుకుతారా అని నిలదీశారు. అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు అనేది కేబినెట్‌లో చర్చించి ప్రకటిస్తామని మంత్రి శ్రీధర్‌ బాబు వెల్లడించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు