Thursday, February 29, 2024

హస్తందే అధికారం..?

తప్పక చదవండి
  • సందడి చేస్తున్న ఎగ్జిట్‌ పోల్స్‌
  • అధికార బీఆర్‌ఎస్‌కు రెండో స్థానం?
  • అధికారానికి చేరువగా కాంగ్రెస్‌
  • అన్ని సర్వే సంస్థల్లోనూ ఇదే వెల్లడి
  • తెలంగాణలో అనూహ్య ఫలితాలు
  • కామారెడ్డిలో కేసీఆర్‌ ఓటమి తప్పదన్న అంచనాలు
  • గజ్వేల్‌లో పోటాపోటీ మెజార్టీతో గెలుస్తారని వెల్లడి
  • కొల్లాపూర్‌లో వణుకు పుట్టించిన బర్రెలక్క

హైదరాబాద్‌ : తెలంగాణలో హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు రాబోతున్నట్లు పలు సర్వే సంస్థలు వెల్లడించాయ్. దాదాపు అన్ని ఎగ్జిట్‌ పోల్స్‌లో .. కాంగ్రెస్‌కు మెజార్టీ వచ్చే అవకాశం ఉందని తేల్చాయి. అధికార బీఆర్‌ఎస్‌ రెండో స్థానానికి పరిమితం కావడంతో పాటు, కామారెడ్డిలో కేసీఆర్‌ ఓడిపోతున్నట్లుగా తేల్చాయి. కొంచెం అటుఇటుగా అన్ని సంస్థలు కాంగ్రెస్‌కు సానుకూలత ఉన్నట్లు సర్వే ఫలితాలను వెల్లడిరచాయి. ఇండియా టివి, ఎబిపి, సిఎన్‌ఎన్‌, జన్‌కీ బాత్‌, పల్స్‌ టుడే వంటి సంస్థలు సర్వే చేపట్టాయి. అదే సమయంలో హంగ్‌ అసెంబ్లీ అంచనాలను కూడా తోసిపుచ్చలేమని ఏబీపీ సీఓటర్‌ నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్‌లో స్పష్టమయింది. కాంగ్రెస్‌ పార్టీకి 49 నుంచి 65 సీట్ల వరకూ వచ్చే అవకాశం ఉందని తేలింది. అదే సమయంలో భారత రాష్ట్ర సమితికి 38 నుంచి 54 సీట్లు వచ్చే అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ కూటమికి మూడు నుంచి 13 సీట్లు వస్తాయని ఎగ్జిట్‌ పోల్స్‌ తేల్చాయి. ఇతరులు 5 నుంచి 9 స్తానాల్లో గెలుస్తారు. ఇతరుల్లో మజ్లిస్‌ పార్టీ కూడా ఉంది. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా ప్రకారం కాంగ్రెస్‌ పార్టీకి 40.7 శాతం ఓట్లు వస్తాయి. అంటే గత ఎన్నికలతో ఓటింగ్‌ పర్సంటేజీ దాదాపుగా 12.4 శాతం పెరుగుతుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి కేవలం 28.3 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. భారత రాష్ట్ర సమితికి ఏకంగా 8.1 శాతం ఓట్లు తగ్గబోతున్నాయి. ఆ పార్టీకి 38.8 శాతం వరకూ ఓట్లు వచ్చే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీకి 46.9 శాతం ఓట్లు వచ్చాయి. భారతీయ జనతా పార్టీ ఓట్ల శాతం పరంగా భారీగా లబ్ది పొందుతోంది. గత ఎన్నికల్లో కేవలం ఏడు శాతం ఓట్లే ఆ పార్టీకి వచ్చాయి. కనీ ఈ సారి మాత్రం ఏకంగా 17శాతం ఓట్లు వస్తాయని ఎగ్జిట్‌ పోల్స్‌ లో వెల్లడయింది. ఏకంగా 9 శాతం ఓట్లు బీజేపీకి పెరుగుతాయి. ఇతర పార్టీలకు వచ్చే ఓట్ల శాతం ఈ సారి బాగా తగ్గిపోయింది. గత ఎన్నికల్లో ఇతరులకు 17.8 శాతం ఓట్లు రాగా ఈ సారి ఆ శాతం కేవలం 4.5 శాతానికి పడిపోతుందని తేలింది. మార్జినల్స్‌ ఇవ్వకుండా ఖచ్చితంగా సీట్ల ప్రొజెక్షన్‌ అంచనా వేయాలంటే.. హంగ్‌ వస్తుందని ఏబీపీ సీఓటర్‌ ఎగ్జిట్‌ పోల్‌ చెబుతుంది. అయితే కాంగ్రెస్‌ పార్టీ సాధారణ మెజార్టీకి చాలా దగ్గరగా వస్తుంది. కాంగ్రెస్‌ పార్టీకి 57 సీట్ల వరకూ వచ్చే అవకాశం ఉంది. గత ఎన్నికలతో పోలిస్తే 38 సీట్లు ఎక్కువ. బీఆర్‌ఎస్‌ పార్టీ 42 సీట్లను కోల్పోయి 46 దగ్గర స్థిరపడుతుంది. బీజేపీ ఒకటి నుంచి ఎనిమది స్థానాలకు పెరుగుతుంది. అదర్స్‌ కు ఏడు సీట్లే వస్తాయి. ఆ ఏడూ మజ్లిస్‌ కే వచ్చే చాన్స్‌ ఉంది. తెలంగాణ రాషట్‌ర సమితి ప్రభుత్వం పదేళ్లుగా అధికారంలో ఉంది. ఈ సందర్భంగా అధికార వ్యతిరేకత ఉందని ఎగ్జిట్‌ పోల్స్‌ లో వెల్లడయింది. ఈ అధికార వ్యతిరేకత తీవ్రంగా ఉంటే కాంగ్రెస్‌ పార్టీకి 67 నుంచి 79 సీట్ల వరకూ లభించే అవకాశం ఉంది. బీఆర్‌ఎస్‌ పరిస్థితి 29 నుంచి 41 సీట్లకు పరిమితమవ్వొచ్చు. బీజేపీకి నాలుగు నుంచి ఎనిమిది సీట్లు, ఇతరులకు మూడు నుంచి ఏడు సీట్లు వరకూ వస్తాయి. అంటే అధికార వ్యతిరేకత బాగా ఉంటే.. కాంగ్రెస్‌ పార్టీకి ఊహించనంత మెజార్టీ వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం తమకు ప్రజల్లో సానుకూలత ఉందని నమ్మకంతో ఉంది. ఎగ్జిట్‌ పోల్స్‌ లో అలాంటి వాతావరణ కనిపించకపోయినా.. ఓటర్లు చివరి క్షణంలో మనసు మార్చుకుని ఉంటే.. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ సర్కార్‌ మరోసారి ఏర్పడుతుంది. కానీ.. అదీ అత్తెసరు మెజార్టీ లేదా హంగ్‌ ద్వారా మాత్రమే. ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలత ఉన్నప్పటికీ కాంగ్రెస్‌ పార్టీకి 40 నుంచి 52 స్థానాలు వస్తాయి. బీఆర్‌ఎస్‌ పార్టీకి 54 నుంచి 66 స్థానాలు వస్తాయని అంచనా. బీజేపీకి ఏడు నుంచి 11 సీట్లు లభిస్తాయి. ఇదిలావుంటే తెలంగాణ ఎన్నికల ఎగ్జిట్‌ పోల్స్‌.. బీఆర్‌ఎస్‌ శ్రేణుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఏకంగా బీఆర్‌ఎస్‌ బాస్‌ సీఎం కేసీఆర్‌?కే ఓటమి తప్పదని ఆరా మస్తాన్‌ సర్వే వెల్లడిరచింది. కేసీఆర్‌ ఎంతో ప్రతిష్టాత్మతంగా తీసుకున్న కామారెడ్డి నియోజకవర్గంలో ఓటమి తప్పదని సర్వేలో వెళ్లడైంది. అలాగే కాంగ్రెస్‌ నేత రేవంత్‌ రెడ్డి ఓడిపోయే అవకాశాలు ఉన్నాయని ఈ సర్వే వెల్లడిరచింది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి వెంటకరమణా రెడ్డి గెలిచే అవకాశం ఉందని తెలిసింది. మరోవైపు గజ్వేల్‌లో కేసీఆర్‌ స్వల్ప మెజారిటీతో గెలుపొందుతారని ఆరా మస్తాన్‌ సర్వే సంస్థ తెలపడంతో బీఆర్‌ఎస్‌ పార్టీలో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్‌, సాయంత్రం 5 గంటలకు ముగిసింది. 119 నియోజకవర్గాలకు గాను మొత్తం 2,290 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కొల్లాపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా కర్నె శిరీష అలియాస్‌ బర్రెలక్క పోటీ చేశారు. అయితే బర్రెలక్క భవితవ్యంపై ఎగ్జిట్‌ పోల్స్‌ ఏం చేప్తున్నాయి?. బర్రెలక్క గెలుస్తుందా అనే అంశంపై ఆరా మస్తాన్‌ సర్వే వివరాలను వెల్లడిరచింది. బర్రెలక్కకు 15 వేల ఓట్లు రావచ్చని ఆరా మస్తాన్‌ సర్వే పేర్కొంది. అయితే ఈమె గెలవకపోయినా గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్‌ ఉందని స్పష్టం చేసింది. కాంగ్రెస్‌ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు గెలిచే అవకాశం ఉందని ఆరా సర్వే వెల్లడిరచింది. కర్నె శిరీష అలియాస్‌ బర్రెలక్క పెద్దకొత్తపల్లి మండలం మరికల్‌ గ్రామంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మర్రికల్‌ గ్రామంలోని బూత్‌ నెంబర్‌ 12లో ఆమె ఓటు వేశారు. హైకోర్టు ఆదేశాలతో బర్రెలక్కకు ఈసీ సెక్యూరిటీ కూడా ఇచ్చింది. ఆ సెక్యూరిటీతోనే ఆమె పోలింగ్‌ కేంద్రం వద్దకు వచ్చి ఓటు వేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బర్రెలక్క.. ప్రతి ఒక్కరూ ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ఓటు వేసేందుకు అందరూ పోలింగ్‌ కేంద్రాలకు రావాలని కోరారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు