Friday, May 17, 2024

అత్యవసరమైతేనే బయటకు రావాలి

తప్పక చదవండి
  • భాగ్యనగరంలో భారీ వర్షం..
  • లోతట్టు ప్రాంతాలన్ని జలమయం
  • ఎక్కడికక్కడ నిలిచిపోయిన ట్రాఫిక్..
  • మరో రెండు రోజులు ఇదే పరిస్థితి..
  • హెచ్చరించిన అధికారులు..

హైదరాబాద్ : హైదరాబాద్‌ నగరంపై వరుణుడు మరోసారి తన ప్రతాపం చూపించాడు. గురువారం మధ్యాహ్నం వరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం కాస్త సాయంత్రం సమయంలో ఒక్కసారిగా మారిపోయింది. మేఘావృతం కాకుండానే కుండపోతగా వర్షం కుమ్మరించింది. ఉన్నట్టుండి కురిసిన భారీ కుండపోత వర్షంతో.. నగరంలోని రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎదుటి వ్యక్తి కనిపించనంతగా వర్షం కురియటంతో.. రోడ్లపై ఎక్కికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. సరిగ్గా.. ఆఫీసుల నుంచి ఉద్యోగులు బయటికి వచ్చే సమయంలోనే ఉన్నట్టుండి వర్షం కురియటంతో.. ద్విచక్రవాహనదారులంతా నిండా తడిసిపోవాల్సి వచ్చింది. భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగిపడి.. కరెంట్ సరఫరా నిలిచిపోయింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, లక్డీకాపూల్, నాంపల్లి, ట్యాంక్‌బండ్, అమీర్‌పేట్, ఎస్సార్‌నగర్, బేగంపేట, మెహిదీపట్నం, సికింద్రాబాద్, ఎల్బీనగర్, దిల్ సుఖ్ నగర్, మియాపూర్, కూకట్ పల్లి, లింగపల్లి తదితర ప్రాంతాల్లో జోరు వాన పడింది. ఎదుటి వాహనాలు కూడా కనపడనంత స్థాయిలో వర్షం కురియటంతో.. పలు జంక్షన్‌లో నీళ్లు నిలిచి వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. నీళ్లు నిలిచినచోట.. చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలంటూ హెచ్చరికలు జారీ చేశారు.

అయితే.. బంగాళాఖాతంలో కొనసాగుతోన్న అల్ప పీడ ప్రభావంతో.. తెలంగాణలో రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు, రేపు ఉత్తర తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, వరంగల్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, హన్మకొండ, ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తాయని సూచించింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు