Tuesday, October 3, 2023

మాటలకందని మహా విషాదం..

తప్పక చదవండి
  • అతలాకుతలమైన లిబియా దేశం..
  • 20 వేలకు చేరువలో మృతుల సంఖ్య..
  • పదివేలకు పైనే ప్రజలు గల్లంతు..
  • తుఫాన్, ఆకస్మిక వరదలతో జల ప్రళయం..
  • డ్యామ్‌లు తెగిపోవడంతో వరదలో మునిగిన నగరం..
  • డెడ్ బాడీలను తగులబెట్టే స్థలం కూడా దొరకడం లేదు..
  • ఎటుచూసినా శవాల కుప్పలే : ఆవేదనవ్యక్తం చేసిన అధికారులు..

లిబియా : డేనియల్‌ తుఫాను సృష్టించిన జలప్రళయంతో ఆఫ్రికా దేశం లిబియా అతలాకుతలమైంది. వరదల ధాటికి వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా జలప్రళయంలో మరణించిన వారి సంఖ్య 20,000 వరకు ఉంటుందని అక్కడి అధికారులు అంచనా వేస్తున్నారు. పదివేలకు పైనే ప్రజలు గల్లంతయ్యారు. కొందరి ఆచూకీ ఇప్పటికీ తెలియరాలేదు. ఈ మేరకు అరేబియా టెలివిజన్‌తో డెర్నా మేయర్‌ అబ్దుల్‌మేనమ్ మాట్లాడుతూ.. ఈ విపత్తు కారణంగా నగరంలో మరణాల సంఖ్య 18,000 నుండి 20,000 వరకు ఉంటుందని అంచన వేస్తున్నట్లు వెల్లడించారు. బీచ్ ఒడ్డున ఎక్కడ చూసినా శవాలు చెల్లాచెదురుగా పడి కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని చూస్తుంటే ఎంతో బాధగా ఉందని పేర్కొ్న్నారు. శవాలను తగుల బెట్టడానికి కూడా స్థలం లేక సామూహిక ఖననం చేస్తున్నట్లు వెల్లడించారు. వరద సంభవించిన సమయంలో చాలా మంది నిద్రలోనే జల సమాధి అయిపోయారని తెలిపారు.

మరోవైపు డెర్నా నగరంలో రహదారులు కొట్టుకపోవడంతో సహాయక కార్యక్రమాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గాయపడిన వారికి చికిత్స అందించడంలోనూ తీవ్ర ఆలస్యం చోటుచేసుకుంటోంది. అదేవిధంగా ఈ విపత్కర పరిస్థితుల్లో లిబియాకు ఈజిప్ట్‌, అల్జీరియా, టునీసియా, తుర్కియే, యూఏఈ సహాయక బృందాలను, ఔషధాలను పంపాయి. మరోవైపు విపత్తులో అతలాకుతలమైన లిబియాలో సహాయక కార్యక్రమాల కోసం అత్యవసర నిధులు పంపుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ పేర్కొన్నారు. డేనియల్‌ తుఫాన్‌ ఆదివారం రాత్రి లిబియా తీర ప్రాంతాన్ని తాకింది. కొన్ని గంటల వ్యవధిలోనే తుఫాన్‌ తీవ్ర రూపం దాల్చింది. దీంతో ఆకస్మిక వరదలు సంభవించాయి. వరదల తాకిడికి రెండు డ్యాములు కొట్టుకుపోయాయంటే జల విలయం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. డ్యాములు ధ్వంసం కాగా అక్కడ్నుంచి పోటెత్తిన వరద నీటిలో అనేకమంది మధ్యధరా సముద్రంలోకి కొట్టుకుపోయారని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. ముఖ్యంగా తూర్పు లిబియాలోని డెర్నా పట్టణం ఈ వరదలకు ఊడ్చిపెట్టుకుపోయింది. ఆ నగరంలో పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. అక్కడ వీధుల్లో, అపార్టుమెంట్లు సహా రోడ్లపై ఎక్కడ చూసినా శవాలు గుట్టలుగుట్టలుగా పడి ఉన్నాయి. ఈ వరద ప్రవాహానికి ప్రజలు ఎక్కడికక్కడ కొట్టుకుపోయారు. దీంతో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు