Thursday, May 16, 2024

బైబై గణేశా..!

తప్పక చదవండి

గంగమ్మ ఒడికి చేరుకున్న గణనాథులు

  • ఖైరతాబాద్‌ మహా గణేషుడి నిమజ్జనం పూర్తి
  • కిక్కిరిసిపోయిన ట్యాంక్‌బండ్‌ పరిసరాలు
  • పులకించిపోయిన భక్తజన సందోహం
  • డీజే పాటలకు డ్యాన్సులు చేసిన పోలీసులు
  • పోలీసుల పహరా, సీసీి కెమెరా కనుసన్నల్లో నిమజ్జనం
  • భారీ స్థాయిలో బాలాపూర్‌ లడ్డూ వేలం
  • రూ.27 లక్షలకు తుర్కయాంజల్‌కు చెందిన దాసరి దయానంద్‌ రెడ్డి గణనాథుని లడ్డు కైవసం

హైదరాబాద్‌ : ఖైరతాబాద్‌ శ్రీ దశ మహా విద్యాగణపతి నిమజ్జనం కార్యక్రమం పూర్తయింది. నవరాత్రుల పాటు భక్తుల ప్రత్యేక పూజలందుకున్న గౌరీ తనయుడు గంగమ్మ ఒడికి చేరాడు. 63 అడుగుల ఎత్తు, 40 టన్నుల బరువున్న ఈ విగ్రహ నిమజ్జనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సరిగ్గా 1.30 గంటలకు నిమజ్జనం పూర్తయింది. మహా గణపతి నిమజ్జన ప్రక్రియను వీక్షించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. హుస్సేన్‌ సాగర్‌ పరిసర ప్రాంతాలు గణపతి బప్పా మోరియా నినాదాలతో హోరెత్తిపోయాయి. మహా గణపతి నిమజ్జనాన్ని చూసి భక్తులు పులకించిపోయారు. ఎన్టీఆర్‌ మార్గ్‌ క్రేన్‌ నంబర్‌ 4 వద్ద గణనాథుడికి చివరి పూజలు నిర్వహించి నిమజ్జనం చేశారు. గణనాథుడికి భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు. అంతకు ముందు ఖైరతాబాద్‌ మహా గణేషుడి శోభాయాత్ర అట్టహాసంగా, కన్నుల పండుగలా సాగింది. ఉదయం 6.30 గంటలకే గణపతి శోభాయాత్ర ప్రారంభించారు. గణపతి శోభాయాత్ర టెలిఫోన్‌ భవన్‌, సచివాలయం మీదుగా సాగింది. అనంతరం ఎన్టీఆర్‌ మార్గ్‌, ట్యాంక్‌ బండ్‌కు చేరుకుంది. ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన క్రేన్‌ నెంబర్‌ 4 దగ్గర పూజల అనంతరం ఖైరతాబాద్‌ బడా గణేశ్‌ నిమజ్జనం జరిగింది. గతంలో ఖైరతాబాద్‌ గణేష్‌ నిమజ్జనం చివర్లో జరిగేది. కానీ ఈసారి మాత్రం ముందుగానే నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా నిమజ్జనం పూర్తి చేశారు.
హైదరాబాద్‌ వ్యాప్తంగా గణేష్‌ శోభాయాత్ర కొనసాగుతోంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో లక్షకు పైగా విగ్రహాల నిమజ్జనం జరగనుంది. హైదరాబాద్‌ వ్యాప్తంగా వస్తున్న బొజ్జ గణపయ్యలతో ట్యాంక్‌బండ్‌, నెక్లెస్‌రోడ్డు సందడిగా మారాయి. నిమజ్జనాన్ని తిలకించేందుకు లక్షల సంఖ్యలో భక్తుల తరలివస్తున్నారు. ‘గణపతి బప్పా మోరియా’, ‘జై బోలో గణేశ్‌ మహరాజ్‌’ నినాదాలతో ట్యాంక్‌బండ్‌ పరిసరాలు మార్మోగుతున్నాయి. ట్యాంక్‌ బండ్‌పై ఎటు చూసినా జనసంద్రమే.. ఇసుకేస్తే రాలనంత జనంతో ట్యాంక్‌ బండ్‌ పరిసరాలు కిటకిటలాడాయి. ఖైరతాబాద్‌ గణేశ్‌ ఎదుట భక్తులతో పాటు.. పోలీసులు కూడా తీన్మార్‌ స్టెప్పులకు డ్యాన్స్‌ వేసి అందరినీ ఆకట్టుకున్నారు.
ఇక రాష్ట్రంలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న బాలాపూర్‌ లడ్డూ మరోసారి రికార్డు స్థాయి ధర పలికింది. గత రికార్డులను బ్రేక్‌చేస్తూ వేలం పాటలో రూ.27 లక్షలకు తుర్కయాంజల్‌కు చెందిన దాసరి దయానంద్‌ రెడ్డి గణనాథుని ప్రసాదాన్ని దక్కించుకున్నారు. ఇది గతేడాదికంటే రూ.2 లక్షల 40 వేలు అధికం కావడం విశేషం. 2022లో రూ.24.60 లక్షలకు వంగేటి లక్ష్మారెడ్డి సొంతం చేసుకున్నారు. బాలాపూర్‌ గణేశుడి ఊరేగింపు తర్వాత గ్రామంలోని బొడ్రాయి వద్ద వేలం పాట నిర్వహించారు. ఇందులో మొత్తం 36 మంది వేలంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి పాల్గొన్నారు. లడ్డూవేలం తిలకించేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. కాగా, వేలంపాటలో లడ్డు గెలుపొందినవారు స్థానికులైతే మరుసటి ఏడాది, స్థానికేతరులైతే అప్పటికప్పుడు డబ్బు చెల్లించేలా నిబంధన విధించారు. 1980లో బాలాపూర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి ఏర్పాటయింది. 1994లో లడ్డూ వేలం ప్రారంభమైంది. తొలి ఏడాది రూ.450కి లడ్డూ పాటలో దక్కించుకోగా 2017లో రూ.15 లక్షలు దాటింది. తొలిసారిగా 2020లో కరోనా కారణంగా బాలాపూర్‌ లడ్డూ వేలంపాట రద్దయింది. గ్రామాభివృద్ధి కోసం మొదలుపెట్టిన బాలాపూర్‌ లడ్డూ వేలం పాట గణనాథుడి కటాక్షంతో నిర్విఘ్నంగా కొనసాగుతున్నది. లడ్డూ దక్కించుకున్న వారి ఇంట్లో సిరిసంపదలతోపాటు వ్యాపార పరంగా బాగా కలిసి వస్తుండటంతో ప్రతి ఏటా ఇక్కడ తీవ్రమైన పోటీ నెలకొంటున్నది.
లడ్డూ వేలం

- Advertisement -

విజేతలు 1994లో కొలను మోహన్‌రెడ్డి రూ.450
1995లో కొలను మోహన్‌రెడ్డి రూ.4,500 1996లో కొలను కృష్ణారెడ్డి రూ.18 వేలు
1997లో కొలను కృష్ణారెడ్డి రూ.28 వేలు 1998లో కొలన్‌ మోహన్‌ రెడ్డి లడ్డూ రూ.51 వేలు
1999 కళ్లెం ప్రతాప్‌ రెడ్డి రూ.65 వేలు 2000 కొలన్‌ అంజిరెడ్డి రూ.66 వేలు
2001 జీ. రఘనందన్‌ రెడ్డి రూ.85 వేలు 2002లో కందాడ మాధవరెడ్డి రూ.1,05,000
2003లో చిగిరినాథ బాల్‌ రెడ్డి రూ.1,55,000 2004లో కొలన్‌ మోహన్‌ రెడ్డి రూ.2,01,000
2005లో ఇబ్రహీ శేఖర్‌ రూ.2,08,000 2006లో చిగురింత తిరుపతి రెడ్డి రూ.3 లక్షలు
2007లో జీ రఘనాథమ్‌ చారి రూ.4,15000 2008లో కొలన్‌ మోహన్‌ రెడ్డి రూ.5,07,000
2009లో సరిత రూ.5,10,000 2010లో కొడాలి శ్రీదర్‌ బాబు రూ.5,35,000
2011లో కొలన్‌ బ్రదర్స్‌ రూ.5,45,000 2012లో పన్నాల గోవర్ధన్‌ రెడ్డి రూ.7,50,000
2013లో తీగల కృష్ణారెడ్డిరూ.9,26,000 2014లో సింగిరెడ్డి జైహింద్‌ రెడ్డి రూ.9,50,000
2015లో కొలన్‌ మధన్‌ మోహన్‌ రెడ్డి రూ.10,32,000 2016లో స్కైలాబ్‌ రెడ్డి రూ.14,65,000
2017లో నాగం తిరుపతి రెడ్డి రూ.15 లక్షల 60 వేలు 2018లో తేరేటి శ్రీనివాస్‌ గుప్తా రూ.16,60,000
2019లో కొలను రామిరెడ్డి రూ.17 లక్షల 60 వేలు 2020లో కరోనా కారణంగా లడ్డూ వేలం పాట రద్దు 2021లో మర్రి శశాంక్‌ రెడ్డి, ఏపీ ఎమ్మెల్సీ రమేశ్‌ యాదవ్‌ రూ.18.90 లక్షలు
2022లో వంగేటి లక్ష్మారెడ్డి రూ.24,60,000 2023లో దాసరి దయానంద్‌ రెడ్డి రూ. 27 లక్షలు

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు