ఇంఫాల్ : భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న మణిపూర్‌లో మళ్లీ హింస రాజుకున్నది. గురువారం పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతోపాటు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. ఈ సంఘటనలో పలువురు గాయపడ్డారు. సెప్టెంబరు 16న ఆర్మీ డ్రెస్ ధరించడంతోపాటు అత్యాధునిక ఆయుధాలు కలిగిన ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వారిని విడుదల చేయాలన్న డిమాండ్‌తో లోయ ప్రాంతాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. సోమవారం అనధికారికంగా సమ్మెను పాటించారు. మంగళవారం నుంచి 48 గంటలపాటు లాక్‌డౌన్‌ను అమలు చేశారు. కాగా, గురువారం మధ్యాహ్నం మహిళలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఐదు జిల్లాల పరిధిలోని పోలీస్ స్టేషన్ల వద్ద భారీగా నిరసనకు దిగారు. అరెస్ట్ చేసిన ఐదుగురు వ్యక్తులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణ జరిగింది. ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. టియర్ గ్యాస్ షెల్స్‌ను పేల్చారు. ఈ నేపథ్యంలో పలువురు నిరసకారులు గాయపడ్డారు. పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారడంతో కర్ఫ్యూ వంటి ఆంక్షలు విధించారు.