Wednesday, April 17, 2024

ఓటు మాట కాదు.. నోటు మూట..

తప్పక చదవండి
 • అభ్యర్థులు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు..!?
 • నాయకులందరిదీ ఇదే బాట..
 • అసెంబ్లీలో చోటు కోసం విచ్చలవిడిగా ఖర్చులు..
 • కోట్లాది రూపాయలను గుమ్మరిస్తున్న నాయకులు..
 • కోట్లు ఉంటేనే రాజకీయాలు.. చేయాలా..
 • తెలంగాణ రాజకీయాల్లో సామాన్యుల పరిస్థితి ఏంటి..
  హైదరాబాద్‌ : యువత రాజకీయాలకు రావాలి.. బడుగు వర్గాలు రాజకీయంగా ఎదగాలి.. నిరుపేదలు, సామాన్యులు ఎన్నికల్లో నిలబడాలి.. ఈ మాటలన్నీ నీటి మూటలే.. రాజకీయాల్లో చేరాలంటే కావాల్సింది నోటు మూటలే.. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇది మరోసారి స్పష్టమైనది.. కేవలం అసెంబ్లీ సీటు కోసమే నోటు వర్షం కురిపిస్తూ నాయకులు ముందడుగు వేస్తున్నారు. టికెట్‌ ఖరారు అవుతుందో లేదో తెలియదు.. ఒకవేళ ఖరారైనా గెలుస్తారు అన్న గ్యారెంటీ లేదు.. అయినా అప్పుడే పెట్టుబడులు మొదలయ్యాయి.. షేర్‌ మార్కెట్‌ తరహాలో వస్తే రానీ.. పోతే పోనీ అన్న రీతిలో నాయకులు ముందుకు సాగుతున్నారు. ఈ ఎఫెక్ట్‌ అంతా ఈ మధ్య కాలంలో మొదలైంది ఏమని తెలంగాణలో మునుగోడు, హుజురాబాద్‌, నాగార్జునసాగర్‌ నియోజక వర్గాల్లో ఉప ఎన్నికలు జరిగాయి.. అక్కడ పెద్ద ఎత్తున డబ్బు ప్రవాహం మొదలైంది. విచ్చలవిడిగా డబ్బుల పంపిణీ జరిగినట్టు మీడియాలో అనేక కథనాలు వెలువడ్డాయి. నియోజకవర్గంలో ఎంత చరిష్మా ఉన్నవారు అయినా ఖర్చు పెట్టంది గట్టు ఎక్కలేరు అన్న వాస్తవం గ్రహించక తప్పదు. తెలంగాణ వ్యాప్తంగా నియోజక వర్గాల్లో లో పరిస్థితిని ఒకసారి పరిశీలిస్తే..
  పథకాలతో బీఆర్‌ఎస్‌.. సాధారణంగా అధికారంలో ఉన్న వారికి పెద్దగా జేబుల్లోంచి ఖర్చు చేసే అవసరం ఉండదు.. ఆ పని ఏదో ప్రభుత్వమే చూసుకుంటుంది.. ప్రస్తుతం భారత రాష్ట్ర సమితిలో కూడా ఇదే కొనసాగుతోంది. ఎన్నికలు సమీపిస్తుండడంతో దళిత బంధు, బీసీ బందు, గృహలక్ష్మి, మైనార్టీలకు సాయం లాంటి పథకాలతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ దూసుకుపోతున్నారు. దీనితో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కలిసి వచ్చే అంశం. ఆపథకాలను లబ్ధిదారులకు అందజేస్తూ, ఇప్పటికే టికెట్‌ ఖరారు చేసుకున్న వారందరూ ప్రచారం దిశగా దోసుకుపోతున్నారు. మరోవైపు తెలంగాణ అసెంబ్లీ నియోజకవర్గాల్లో అసెంబ్లీలో పెండిరగ్లో ఉన్న పనులను చకచకా పూర్తిచేసి ఎన్నికలనాటికి పూర్తి స్థాయిలో సిద్ధం కావాలని ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఒక్కో నియోజకవర్గంలో పథకాల పేరిట ఖర్చు పెడుతున్న మొత్తం కోట్లల్లో ఉంది. దానికి తోడు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ప్రతి గడపను తాకుతుంది. అధికార పార్టీ కాబట్టి అంచనాలు కూడా అధికంగానే ఉంటాయి. అయితే ఎమ్మెల్యేలుకూడా చేతి తడవనిదే రాజకీయాల్లో డబ్బులు ఖర్చు పెట్టలేరు కదా..? ధనం మూలం ఇదం జగత్‌..!
  రేస్‌లో మేమేమీ తక్కువ కాదు కాంగ్రెస్‌.. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ కూడా రాష్ట్రంలో రేసులో లాగా దూసుకుపోతోంది కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేస్తాం అనుకున్న అభ్యర్థులు కూడా గ్రామాలలో తిరుగుతూ నిరుపేదలకు, ఇటీవల వర్షాలకు నష్టపోయిన వారికి వేల రూపాయల చొప్పున సహకారం అందిస్తూ లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. ఇక పార్టీ కార్యక్రమాల పేరిట టికెట్‌ వస్తుందన్న గంపెడాశతో ఆయా కార్యక్రమాలకు కూడా కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నట్టు ప్రజలు చెప్పుకుంటున్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పూర్తిస్థాయిలో సహకారం అందిస్తామని రైతులకు, నిరుపేదలకు భరోసా ఇస్తున్నారు. తమ పార్టీ డిక్లరేషన్ల రూపంలో ఇచ్చిన హామీలను గ్రామీణ స్థాయికి తీసుకువెళ్లే దిశగా అడుగులు వేస్తున్నారు. నిజానికి ఇంకా వారెవ్వరికీ టికెట్లు ఖరారు కాలేదు. అయితే ఒక్కో నియోజకవర్గంలో ఆశావాహులు చాలామంది ఉండడం ఎవరికి వారే టికెట్‌ తమకే దక్కుతుందని డబ్బులు మాత్రం పెద్ద ఎత్తుననే ఖర్చు చేస్తున్నారు. అయితే ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ నుండి ఎమ్మెల్యే దరఖాస్తులకు ఒక్కో నియోజకవర్గంలో పదుల సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే టికెట్‌ వచ్చే అవకాశాలు మాత్రం నియోజకవర్గానికి ఒక్కరికే ఉంటుంది అయినా ఆశ చావక ఆశావాహులు కోట్లల్లో డబ్బులు ఖర్చు చేస్తున్నారుఇప్పుడే ఇలా ఉంటే ఎన్నికల నాటికి ఇంకా ఎంత ఖర్చు చేయవలసి వస్తుందో అర్థం కాని పరిస్థితి.
  మేము సైతం బిజెపి.. భారతీయ జనతా పార్టీలో టికెట్‌ ఆశిస్తున్న అభ్యర్థులు ఒక్కో నియోజకవర్గం లో ఎక్కువగానే ఉన్నారని చెప్పక తప్పదు. వీరందరూ కూడా మేము సైతం అంటూ ఆరు నెలల ముందు నుంచే వివిధ కార్యక్రమాలు చేపడుతూ గ్రామాలలో తిరుగుతున్నారు. అంబలి పంపిణీ, ఉచిత మందుల పంపిణీ, ఉచితంగా డ్రైవింగ్‌ లైసెన్సులు, హెల్మెట్లు, చీరెలు సారెలు వంటి కార్యక్రమాలను ఇప్పటికే విజయవంతంగా నిర్వహిస్తున్నారు. కొత్తగా ఇప్పుడు మహిళలకు రాఖీ పండుగను పురస్కరించుకొని చీరలు పంపిణీ కార్యక్రమాన్ని గ్రామాలలో కొనసాగిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా వందల కోట్లకు పైగా ఖర్చు పెట్టారని పార్టీలో బాహాటంగా కొంతమంది కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో టికెట్‌ ఎవరికి వస్తుందో కూడా చెప్పలేని పరిస్థితి. అయినప్పటికీవిచ్చలవిడిగా ఖర్చు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.
  అమ్మో ఇదేం ఖర్చు.. ఎన్నికలు అంటేనే ఒక భారీ పెట్టుబడిగా మారిపోయింది. టికెట్‌ కోసం జరుగుతున్న పోటీలో ఎవరికి వారు జనంలో తమ పేరు ఉంచుకునేందుకు విపరీతంగా ఖర్చు చేస్తున్నారు. దీనివల్ల నిరుపేదలకు సామాన్యులకు ఎన్నికల ముందు నుంచే ఏదో ఒక లబ్ధి చేకూరుతుంది. ఇదంతా బాగానే ఉన్నా ఎన్నికల్లో నిలబడాలంటే ఇంత భారీగా ఖర్చు చేయాలా.. అన్న ప్రశ్న సాధారణ నాయకుల్లో ఉత్పన్నమవుతోంది. కొత్తగా రాజకీయాల్లోకి రావాలనుకునే వారు కూడా ఈ పరిస్థితిని చూసి భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు బీఎస్పి, సిపిఎం, సిపిఐ, తెలుగుదేశం పార్టీ, లోక్‌ సత్తా లాంటి పార్టీల నాయకులు ఇలాంటి నాయకుల మధ్యలో పోటీకి ఎలా వెళ్లాలి..? ఎన్నికలకు ఇంత ఖర్చు ఎక్కడి నుంచి తేవాలి.. అర్థం కాక సతమతమవుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలవాలంటే 100 కోట్లు ఖర్చు పెట్టాల్సిందే అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నియోజకవర్గంలో రెండు జాతీయ పార్టీలు ప్రస్తుత అధికార పార్టీ మాత్రమే ఆ దిశగా ప్రయత్నం చేయవచ్చు అని జనాలు గుసగుసలాడుతున్నారు. మరో వైపు యువ నాయకులు పోటీ కోసం తహతలాడుతున్నారు. పార్టీ టికెట్‌ ఇస్తే గెలిచి తమ సత్తా ఏంటో గెలిచి చూపిస్తామంటూ సవాళ్లు విసురుతున్నారు.ఈ నేపథ్యంలో నాయకులు ఎన్నికలవేళ దగ్గర పడడంతో ప్రతి కార్యక్రమాన్ని హంగు ఆర్భాటాలతో తెరకెక్కిస్తున్నారు . గోప్యంగా జరుపుకునే పండుగలను కూడా ఇప్పుడు గొప్పగా పది మందితో పంచుకునే స్థాయిలో చేసుకుంటున్నారు. బర్త్‌ డేలు మొదలు ఇంకా అనేక కార్యక్రమాలను విలాసవంతంగా చేసుకొని జనాలను చుట్టూ పోగేసుకుంటున్నారు. ఈసారి ఎన్నికల్లో డబ్బు ప్రవాహం ఆపాలంటే ఎన్నికల కమిషన్‌ అడ్డుకట్ట వేయాలి ప్రజాస్వామ్యంలో జరిగే ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి నోటుకు ఓటు ఆశలను గల్లంతు చేయాలి. ఈ మాట అంటే ఎవరికైనా కోపం రావచ్చు వాళ్లు సంపాదించడం లేదా ప్రజల తింటే తప్పేంటి ఊకదంపుడు ఉపన్యాసాలు ఎందుకని కూడా అనుకునేవారు ఉంటారు. కానీ ప్రజాస్వామ్యం మాత్రం ఖూనీ కాక తప్పదని గ్రహించండి. ఏమైనా ఎన్నికలకు వెళ్లాలంటే అభ్యర్థులు భారీ మూల్యం చెల్లించక తప్పదు..
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు