- ఉదయం అల్పాహారం పులిహోరలో బొంత పురుగులు..
- నాణ్యత లేని భోజనం పెడుతున్నారని బాలికలు కంటతడి..
- అసంపూర్తిగా వార్డెన్ పర్యవేక్షణ..
- 30 మంది విద్యార్థులకు అస్వస్థత..
ఇబ్రాహీంపట్నం: మంచాల మండల కేంద్రంలోనీ బీసి గురుకుల పాఠశాలలో శనివారం ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. గురుకులంలోని విద్యార్థులకు పుడ్ పాయిజన్ అయ్యిందని ప్రచారం కావడంతో తల్లి దండ్రులు పిల్లలను చూడడానికి వచ్చారు. విషయం తెలుసుకున్న పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. వైద్యులతో పాటుగా, ఎస్సై రవి నాయక్ హుటాహుటిన పాఠశాలకు చేరకున్నారు. శనివారం ఉదయం అల్పాహారంలో బాగంగా హాస్టల్ లో పులిహోర వంట చేశారు. తిన్న మరుక్షణమే విద్యార్థులు అస్వస్థతకు గురై విరేచనాలు, వాంతులు, కడుపునొప్పి ప్రారంభమైంది. దీంతో పాఠశాల సిబ్బంది పిల్లలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే దాదాపు 30 మంది విద్యార్థినులలో 9 మంది విద్యార్థుల పరిస్థితి విషమించడంతో హస్తినాపురం ఏరియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జిల్లా వైద్యాధికారుల బృందం హాస్టల్ లో వైద్యశిబిరం ఏర్పాటు చేసి మిగతా విద్యార్థుల పరిస్థితి తెలుసుకున్నారు. ప్రతి రోజు నాణ్యత లేని భోజనం పెడుతున్నారని బాలికలు కంటతడి పెట్టారు. అన్నంలో రాళ్ళు , పురుగులు, బొంత పురుగులు, పప్పు, సాంబర్‌లో బొద్దింకలు వస్తున్నట్లు విద్యార్థులు తెలిపారు. ఈ విషయాన్ని వార్డెన్ సరిత దృష్టికి విద్యార్థులు తీసుకెళ్లగా అసలు పట్టించుకోవడం లేదని, కన్నీటి పర్యంతం అయ్యారు. హాస్టల్ లో మెనూ ప్రకారం బోజనాలు పెట్టడం లేదని వాపోయారు. ఉన్నత స్థాయి అధికారులు తమ హాస్టల్ వైపు కన్నెత్తి చూడడం లేదని అన్నారు. ఇప్పటికైనా విద్యశాఖ అధికారులు పాఠశాలలపై దృష్టి పెట్టి పర్యవేక్షించాలని ప్రజలు కోరుతున్నారు.