Saturday, June 15, 2024

బాస్కెట్‌బాల్‌ విజేత పాలమూరు..

తప్పక చదవండి

రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కప్‌ క్రీడా పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. పోటీల రెండో రోజైన జిల్లా స్థాయి టోర్నీల్లో క్రీడా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, సాట్స్‌ చైర్మన్‌ ఆంజనేయగౌడ్‌ పాల్గొన్నారు. మంగళవారం జరిగిన బాస్కెట్‌బాల్‌ పోటీల బాలుర విభాగంలో మహబూబ్‌నగర్‌ అర్బన్‌ మండలం విజేతగా నిలువగా, నవాబుపేట రన్నరప్‌ దక్కించుకుంది. బాలికల విభాగంలో మహబూబ్‌నగర్‌ అర్బన్‌, రూరల్‌ మండలాలు టాప్‌-2లో నిలిచాయి. బాలుర, బాలికల హ్యాండ్‌బాల్‌లో మహబూబ్‌నగర్‌ మండలం ట్రోఫీలు కైవసం చేసుకుంది. బ్యాడ్మింటన్‌లో రహీం, సయ్యద్‌, జిషాన్‌ ఆకట్టుకున్నారు. విజేతలకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ బహుమతులు అందజేశారు. సీఎం కేసీఆర్‌ సారథ్యంలో రాష్ట్రంలో క్రీడలకు పెద్దపీట వేస్తున్నామన్నారు. రాష్ట్ర స్థాయిలో విజేతలుగా నిలిచే వారికి స్పోర్ట్స్‌ కోటా కింద భవిష్యత్తులో రిజర్వేషన్లు కల్పించే అవకాశాన్ని పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్‌ స్టేడియంలో ఆరు బ్యాడ్మింటన్‌, 3 బాస్కెట్‌బాల్‌ కోర్టులు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. మరోవైపు నల్లగొండ జిల్లా కేంద్రం మేకల అభినవ్‌ స్టేడియంలో జరుగుతున్న సీఎం కప్‌ పోటీలకు సాట్స్‌ చైర్మన్‌ ఆంజనేయగౌడ్‌ హాజరయ్యారు. గత 30 ఏండ్లలో ఇదే అతి పెద్ద క్రీడా సంబురమని అన్నారు. సీఎం కప్‌ క్రీడా పోటీలకు అద్భుత స్పందన వస్తుందని తెలిపారు. జిల్లా స్థాయి పోటీల్లో దాదాపు లక్షన్నర మంది యువతియువకులు పాల్గొంటున్నారని వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో 16వేల క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ సైదిరెడ్డి పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో వివిధ క్రీడా పోటీల్లో విజేతలకు ఆంజనేయగౌడ్‌ ట్రోఫీలు ప్రదానం చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు