Monday, April 29, 2024

రేవంత్ రెడ్డి భవితవ్యం ఏమిటి..?

తప్పక చదవండి
  • తాజాగా తెరమీదకు ఓటుకు నోటు కేసు..
  • ఈ నెల 4న విచారణ చేపట్టనున్న సుప్రీం కోర్టు..
  • ఈ కేసుపై 2017 నుంచి న్యాయపోరాటం చేస్తున్న
    మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి..
  • దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న వ్యవహారం..
  • కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ గా తీసుకుంటుందా..?
  • రేవంత్ రెడ్డి కి మద్దతు తెల్పుతూ సర్దుకు పోతుందా..?
  • లోలోపల చంకలు గుద్దుకుంటున్న తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు..
  • రేవంత్ ను తప్పిస్తే పగ్గాలు చేపట్టాలని ఉవ్విల్లూరుతున్న వైనం..
  • టీడీపీ అధినేత చంద్రబాబు పేరు లేనట్టే..

( 2015 లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు వ్యవహారం ఒక రాజకీయ కుదుపును కలిగించిన విషయం విదితమే.. అయితే కాల క్రమేణా ఆ కేసు మరుగున పడిపోయింది అనుకున్నారందరూ.. అయితే ఈ కేసుపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మంగళగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి న్యాయపోరాటం చేస్తున్నారు.. తాజాగా ఆయన ఈ కేసులో ప్రధమ ముద్దాయిగా చేర్చాలని ఆయన సుప్రీం కోర్టుకు నివేదించారు.. ప్రస్తుతం ఈ కేసు ఫైల్ జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సుందరేష్ ధర్మాసనం దగ్గర చేరింది.. కాగా ఈ కేసు ఏమలుపు తిరుగుతుందో అన్న ఆసక్తి దేశమంతా నెలకొంది.. రేవంత్ రెడ్డి భవితవ్యంపై నీలి నీడలు కమ్ముకోబోతున్నాయా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు..)

హైదరాబాద్: ఆరేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించిన ఓటుకు నోటు కేసులో తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తాజాగా ఈ కేసులో చార్జిషీట్ దాఖలు చేసింది. ప్రధాన నిందితుడిగా రేవంత్ రెడ్డిని పేర్కొన్న ఈడీ… కేసులో మొదటిసారిగా టీడీపీ నేత వేం నరేందర్ రెడ్డి కుమారుడు కీర్తన్ రెడ్డిని కూడా నిందితుడిగా చేర్చడం గమనార్హం. వీరితో పాటు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్ తదితరులను నిందితులుగా చేర్చింది. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు పాత్రపై కూడా చార్జిషీటులో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఈడీ చేసిన ట్వీట్‌లో మాత్రం చంద్రబాబు పేరు కనిపించలేదు. చార్జిషీటులో పేరు ప్రస్తావించడానికి, నిందితుల జాబితాలో పేరును చేర్చడానికి చాలా తేడా ఉందని టీడీపీ వర్గాలు అంటున్నాయి. ఒకరకంగా చంద్రబాబుకు ఈడీ క్లీన్ చిట్ ఇచ్చినట్లేనని.. ఆయనకు ఇది బిగ్ రిలీఫ్ అని టీడీపీ మద్దతుదారులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -

ఈ కేసుకు సంబంధించి అప్పట్లో కలకలం రేపిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆడియో ఫుటేజీ, రేవంత్ రెడ్డి, స్టీఫెన్‌సన్‌కు డబ్బులు ఇస్తూ పట్టుబడ్డ వీడియో ఫుటేజీని చార్జిషీటుకు ఈడీ జతచేసినట్లు సమాచారం. అప్పట్లో రూ.50 లక్షలు స్టీఫెన్‌సన్‌కు ఇస్తూ రేవంత్ రెడ్డి పట్టుబడిన సంగతి తెలిసిందే. అయితే డీల్ ప్రకారం ఇస్తానన్న మిగతా డబ్బులు ఎక్కడినుంచి తీసుకురావాలనుకున్నారు అన్న దానిపై చార్జిషీట్‌లో ఈడీ వివరాలు పొందుపరిచినట్లు సమాచారం. ఈడీ చార్జిషీట్ దాఖలు చేసిన నేపథ్యంలో కోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది.

గతేడాది మార్చిలో ఇదే కేసుకు సంబంధించి ఏసీబీ కూడా చార్జిషీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కీలక ఆధారాలతో ఏసీబీ మొత్తం 960 పేజీలతో కూడిన చార్జిషీట్‌ను దాఖలు చేసింది. నిందితుల పాత్రపై ఇందులో కీలక ఆధారాలు పొందుపరిచింది. ఇదే కేసుకు సంబంధించి వెలుగుచూసిన ఆడియో టేపుల సంభాషణపై ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు కూడా గతేడాది కోర్టుకు చేరింది. ఈ కేసులో ఏసీబీ దర్యాప్తును సవాల్ చేస్తూ అప్పట్లో రేవంత్ రెడ్డి ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఓటుకు నోటు కేసు అవినీతి నిరోధక శాఖ పరిధిలోకి రాదని అందులో పేర్కొన్నారు. అయితే ఏసీబీ కోర్టు ఆ పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఈ కేసు అవినీతి నిరోధక శాఖ పరిధిలోకి వస్తుందని స్పష్టం చేసింది.

అటు ఏసీబీ దాఖలు చేసిన చార్జిషీట్‌పై విచారణ కొనసాగుతుండగానే ఇప్పుడు ఈడీ కూడా చార్జిషీట్ దాఖలు చేయడంతో ఈ కేసులో మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుబోతున్నాయో అన్నది ఆసక్తికరంగా మారింది. అప్పట్లో 2015 ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డికి క్రాస్ ఓటింగ్ వేసేందుకు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను డబ్బుతో ప్రలోభ పెట్టినట్లు రేవంత్ రెడ్డి, చంద్రబాబులపై ఆరోపణలున్నాయి. ఈ మేరకు రూ.3 కోట్లకు డీల్ మాట్లాడి మొదట రూ.50లక్షలు ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి నేరుగా ఆయన ఇంటికి వెళ్లారు. అయితే స్టీఫెన్‌సన్ దీనిపై అప్పటికే ఏసీబీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో పక్కా ప్లాన్‌తో రేవంత్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అయితే ఇదంతా తనపై కుట్రపూరితంగా జరిగిందని రేవంత్ ఆరోపిస్తూ వస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేరును చేర్చాలని వైఎస్సార్సీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే తెలంగాణ ఏసీబీ ఛార్జిషీట్‌లో 22 సార్లు చంద్రబాబు పేరు ప్రస్తావించింది. కాగా, అక్టోబరు 4న ఈ కేసును సుప్రీంకోర్టు విచారించనుంది.

అయితే ఇప్పుడు చెప్పుకోవలసిన వ్యక్తి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ రేవంత్ రెడ్డి.. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టారో అప్పటినుంచి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరుగులు తీయడం ప్రారంభించింది.. కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం పెల్లుబికింది.. నిజానికి తెలంగాణ కాంగ్రెస్ కి నూతన జవసత్వాలు తీసుకు రావడంలో రేవంత్ సక్సెస్ అయ్యాడనే చెప్పవచ్చు.. అన్ని వర్గాల వారిని కలుపుకు పోవడానికి రేవంత్ శాయశక్తులా కృషి చేసిన మాట వాస్తవం.. అయితే తెలుగుదేశం పార్టీనుంచి వచ్చిన రేవంత్ రెడ్డికి రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్పగించడం పట్ల కాంగ్రెస్ సీనియర్ నాయకులకు రుచించలేదు.. రేవంత్ రెడ్డికి అడుగడుగునా ఆటంకాలు సృష్టించడం మొదలుపెట్టారు.. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆయనపై విమర్శలు చేస్తూ వచ్చారు.. కానీ రేవంత్ వాటన్నిటినీ తట్టుకుని నిలబడి, కాంగ్రెస్ ఢిల్లీ పెద్దల దృష్టిలో మంచి మార్కులే కొట్టేశారు.. సొంత పార్టీలో ఏర్పడ్డ కుంపటిని ఆర్పడానికి ఆయన కృషి చేస్తూనే ఉన్నారు ఇప్పటికి కూడా.. అప్పట్లో ఓటుకు నోటు కేసులో ముద్దాయిగా పేర్కొన్న రేవంత్ రెడ్డిని రాష్ట్ర అధ్యక్షుడిగా ఎలా నియమిస్తారని వాదనకూడా తెరమీదకు తీసుకుని వచ్చారు సీనియర్స్.. కానీ అవేవీ పట్టించుకోకుండా అధిష్టానం రేవంత్ కి వెన్నుదన్నుగా నిలిచింది.. దాంతో రేవంత్ తనపని తాను చేసుకుని పోతూ దూసుకుని పోతూనే ఉన్నారు. రేవంత్ స్టామినా ఏమిటో అధిష్టానం గుర్తించడమే దీనికి ప్రధాన కారణం.. అయితే ఇప్పుడు తెలంగాణాలో సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఓటుకు నోటు కేసు తిరిగి తెరమీదకు రావడం రేవంత్ రెడ్డికి కాస్త ఇబ్బంది కలిగించే విషయంగానే భావించవచ్చు.. ఎందుకంటే కర్ణాటకలో విజయదుంధుబి మ్రోగించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో జండా పాతడానికి సిద్ధం అయ్యింది.. రాష్ట్రవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ కు అనుకూల పవనాలు వీచడం కూడా మొదలయ్యాయని చెప్పవచ్చు.. ఈ తరుణంలో ఓటుకు నోటు కేసు ఎలాంటి చేతును కలిగిస్తుందో..? అన్న సంశయం రేవంత్ అనుకూల వర్గంలో ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది.. ఈ నేపథ్యంలో సుప్రీం ధర్మాసనం ఈనెల 4 న దీనిపై విచారణ చేపట్టనున్న నేపథ్యంలో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. పరిస్థితులు అనుకూలించక రేవంత్ దోషిగా తేలితే రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఏమిటి అన్నది ప్రశ్నార్థకంగా మారింది.. మరి ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం వైఖరి ఏవిధంగా వుండబోతోంది.. అన్నది కూడా ఆసక్తిగా మారింది.. అధిష్టానం రేవంత్ ని దూరం పెడుతుందా..? లేక తేలిగ్గా తీసుకుని రేవంత్ కు వెన్నుదన్నుగా నిలుస్తుందా అన్నది వేచి చూడాలి.. ఒక నేరం మోపబడిన వ్యక్తికి సహకారం అందిస్తే రాష్ట్రంలోని కాంగ్రెస్ అభిమానులు ఏవిధంగా స్పందిస్తారు..? ఈనెల నాలుగు తరువాత సుప్రీం వెలువరించే తీర్పుపైనే తెలంగాణ కాంగ్రెస్ భవిష్యత్ ఆధారపడి వుండబోతోంది అన్నది రాజకీయ విశ్లేషకుల మాట.. ఒక వేళ అధిష్టానం రేవంత్ ని పక్కనబెడితే రాష్ట్రంలో కాంగ్రెస్ ను నడిపించే నాయకుడు ఎవరు..? రేవంత్ రెడ్డి లాంటి పవర్ ఫుల్ మాస్ లీడర్ వేరే ఎవరు ఉన్నారు..? అన్నది కూడా ఇప్పుడు జవాబులేని ప్రశ్నగా మారింది..పరిస్థితులు ఏవిధంగా మారనున్నాయో వేచి చూడాల్సిందే.. కాగా అధికార బీ.ఆర్.ఎస్. ఈ వ్యవహారాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో బిజీగా ఉన్నట్లు కనిపిస్తోంది..

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసును ఈ నెల 4న సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని ఎమ్మెల్సీ స్టీఫెన్‌ సన్‌ ను ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు ఉన్న ఒక వీడియో వెలుగులోకి రావడంతోపాటు… “మావాళ్లు బ్రీఫ్డ్ మీ” అనే వాయిస్ కూడా లీక్ అవ్వడంతో అప్పుడు ఇది తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. అయితే ఈ కేసును అప్పట్లో సీరియస్ గా తీసుకున్నట్లు కనిపించిన తెలంగాణ సర్కార్… బాబు హైదరాబాద్ విడిచి కరకట్టకు వచ్చేసిన అనంతరం లైట్ తీసుకున్నట్లు కామెంట్లు వినిపించాయి. అయితే మంగళగిరి ఎమెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాత్రం ఈ వ్యవహారంపై న్యాయపోరాటం చేస్తున్నారు. ఇందులో భాగంగా సుప్రీంకోర్టులో రెండు పిటిషన్‌ దాఖలు చేశారు. అందులో ఒకటి ఓటుకు నోటు కేసులో చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలని కాగా… ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్‌ ను 4వ తేదీన విచారణ చేపట్టనున్న జస్టిస్‌ ఎంఎం సుందరేశ్, జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌ లతో కూడిన ధర్మాసనం తెలిపిందని తెలుస్తుంది! కాగా… స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో బాబు క్వాష్ పిటిషన్ సుప్రీంకోర్టులో ఈ నెల 3న విచారణ జరగనున్న సంగతి తెలిసిందే! కనుక రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు అన్నది వాస్తవం.. కాలం చేయబోయే వింతలు, విశేషాలు తెలుసుకోవాలంటే ఇంకో నాలుగు రోజులు ఆగక తప్పదు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు