- మెరుగైన పోర్టల్ అందుబాటులోకి తెస్తాం
- బీఆర్‌ఎస్ నేతలు ధరణితో భూ దందాలు
- దళితులకు భూములను బీఆర్‌ఎస్ లాక్కుంటోంది
- పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శలు
హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ధరణిని రద్దు చేసి.. మెరుగైన పోర్టల్ అందుబాటులోకి తెస్తామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ నేతలు ధరణితో.. భూ దందాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకే ఓటు వేసి గెలిపించాలని రేవంత్ విజ్ఞప్తి చేశారు. ఉట్నూరులో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో రేవంత్ ప్రసంగించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణిని రద్దుచేసి.. దాని స్థానంలో మెరుగైన పోర్టల్ తీసుకొస్తామని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ నేతలు ధరణిని తెచ్చి.. భూ దందాలకు పాల్పడుతున్నారని రేవంత్ ఆరోపించారు. రాష్ట్రంలో ధరణి లేకపోతే.. రైతుబంధు రాదని కేసీఆర్ మాయమాటలు చెబుతున్నారని రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2018లో రైతుబంధు వచ్చిందని, 2020లో ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చిందన్నారు. 2018 నుంచి 2020 వరకు.. ధరణి లేకుండానే రైతుబంధు నిధులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు, దళితులకు భూములను ఇచ్చిందన్నారు. కానీ బీఆర్‌ఎస్ ప్రభుత్వం ధరణి తెచ్చి భూములను లాక్కుంటోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ హయాంలో ఆదిలాబాద్ జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టును ప్రతిపాదించామని రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం కడెం ప్రాజెక్టు నిర్వహణను చేయలేకపోతోందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ప్రత్యేక నిధులను కేటాయిస్తామన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులను నిండా ముంచుతోందని రేవంత్ ధ్వజమెత్తారు. ఆదివాసీలను, లంబాడీలను కాపాడే పార్టీ.. కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్నారు. ఇరు తెగల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరిస్తామన్నారు. సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ హామీలను.. అధికారంలోకి రాగానే అమలు చేస్తామన్నారు. ఖానాపూర్ సభలో ప్రధాని నరేంద్రమోడీపై.. రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన.. సంబంధిత బాధ్యులపై కేంద్రం చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. మేడిగడ్డ డ్యాంను పరిశీలించేందుకు వెళ్లాలని.. మోడీని కోరినట్లు పేర్కొన్నారు. కానీ మోడీ మాత్రం నిన్న సభకు వచ్చి వెళ్లిపోయారన్నారు. రాష్ట్రంలో బీజేపీకి 100 సీట్లలో డిపాజిట్లే రావు.. బీసీ సీఎంను ఎలా చేస్తారని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో బీసీ వ్యక్తిని సీఎం ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. కోట్లు ఉన్నవాళ్లు ఎన్ని నోట్లు ఇచ్చినా తీసుకొని.. ఓటు మాత్రం కాంగ్రెస్ పార్టీకే వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ధరణిని రద్దు చేసి.. మెరుగైన పోర్టల్ అందుబాటులోకి తెస్తాము. బీఆర్‌ఎస్ నేతలు ధరణితో.. భూ దందాలకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో ధరణి లేకపోతే.. రైతుబంధు రాదని కేసీఆర్ మాయమాటలు చెబుతున్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ధరణి తెచ్చి భూములను లాక్కుంటోందని అన్నారు.