Monday, April 29, 2024

తమిళ సినీరంగంలో విషాదం

తప్పక చదవండి
  • నటుడు విజయకాంత్‌ మరణం
  • సంతాపం ప్రకటించిన మోడీ, కమల్‌, ఎన్టీఆర్‌

చెన్నై : తమిళ నటుడు, డీఎండీకే అధినేత కెప్టెన్‌ విజయకాంత్‌ కన్నుమూశారు. శ్వాస సంబంధిత సమస్యతో చెన్నైలోని మియోట్‌ దవాఖానలో చేరారు. పరీక్షల్లో ఆయనకు కొవిడ్‌ నిర్దారణ అయింది. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించినప్పటికీ లాభం లేకుండా పోయింది. పరిస్థితి విషమించడంతో విజయకాంత్‌ తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు తమిళనాడు ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రకటించారు. 71 ఏండ్ల విజయకాంత్‌ ఏడాది కాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. గత నెల 18న జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలతో చెన్నైలోని మియోట్‌ దవాఖానలో చేరారు. చికిత్స అనంతరం కోలుకుని డిసెంబర్‌ 11న ఇంటికి చేరుకున్నారు. అయితే అప్పుడే ఆయన మరణించారనే వార్తలు నెట్టింట షికారు చేశాయి. అయితే ఆ వదంతులను ఆయన సతీమణి ప్రేమలత కొట్టిపారేశారు. అయితే రెండు వారాలు గడువకముందే ఆయన కొవిడ్‌ బారినపడటం, మరోసారి శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తడంతో గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. తమిళ సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన విజయకాంత్‌.. ఆ తర్వాత ఆయన రాజకీయాల్లో సైతం అడుగుపెట్టారు. 2005లో డీఎండీకే పార్టీని స్థాపించారు. విజయకాంత్‌ మృతి పట్ల తమిళనాడు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. విజయకాంత్‌ తమిళ సినిమా లెజెండ్‌. ఆయన నటన లక్షల మంది హృదయాలను తాకింది. రాజకీయ నాయకుడిగా తమిళనాడు రాజకీయాల్లో శాశ్వత ప్రభావాన్ని చూపించారు విజయకాంత్‌. ప్రజా సేవలో ఉంటూ, వారి సమస్యలపై చాలా ఏళ్లుగా పోరాడారు. తమిళనాడు రాజకీయాల్లో ఆయన లేనిలోటు తీరనిదని ప్రధాని మోడీ అన్నారు.నా సోదరుడు విజయకాంత్‌ మరణవార్త తీవ్ర విషాదాన్ని నింపిందని కమల్‌ హాసన్‌ అన్నారు. తమిళనాడు రాజకీయాల్లో ఆయనది ప్రత్యేకమైన స్థానం. సినీ, రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసిన విప్లవ కళాకారుడు ఆయన. తమిళ సినీ, రాజకీయ రంగాల్లో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. విజయకాంత్‌గారి మరణ వార్త చాలా బాధాకరం అని సినిమా, రాజకీమ రంగాల్లో ఆయనొక పవర్‌హౌస్‌ అంటూ ఎన్టీఆర్‌ పేర్కొన్నారు. ఒక మంచి నటుడితో పాటు మనసున్న రాజకీయనాయకుడిని సినీ పరిశ్రమ కోల్పోయింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని అన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు