Wednesday, April 24, 2024

విద్య పేరుతో ఇంత వ్యాపారమా..?

తప్పక చదవండి
  • నల్లగొండ జిల్లా, నాగార్జునసాగర్ సెయింట్ జోసెఫ్స్ పాఠశాలలో ఎడ్యుకేషన్ సొసైటీల దందా..
  • నిజాలు రాస్తే.. “ఆదాబ్” పై బురదజల్లే ప్రయత్నం
  • సెయింట్ జోసెఫ్స్ పాఠశాల యాజమాన్యం పచ్చి అబద్దాలను నిజాలుగా ప్రచారం చేసుకుంటున్న వైనం
  • కల్పితాలను నిజం చేస్తూ.. నిజాన్ని అబద్ధం చేస్తున్నది ఎవరు?
  • 1973లో సెయింట్ జోసెఫ్స్ కాన్వెంట్ సొసైటీ రిజిస్టర్ అయితే.. 1965లోనే ప్రభుత్వ భూమి ఎలా కేటాయించారు?
  • సంబంధం లేని జీసస్ మేరీ జోసెఫ్ (జె.ఎమ్.జె) సొసైటీకి ఎయిడెడ్ గుర్తింపునిచ్చిన ఆర్.జే.డి
  • ఏది నిజం.? ఏది అబద్దం..?

విద్య అనే పవిత్రమైన రంగం వ్యాపారంగా మారుతున్నప్పుడు పత్రికలు, మీడియా వ్యవస్థలు అప్పుడప్పుడు ఆ సంస్థలను ప్రశ్నించడం, చురకలు పెట్టడం సహజమైనది. ఆ బాధ్యత మీడియాపై ఎంతగానో ఉంది. ఇందులో భాగంగానే “ఆదాబ్” ఫిబ్రవరి 14.వ తేదీన “నల్లగొండలో ఎయిడెడ్ స్కూళ్ళ దందా” అనే శీర్షికన ఒక వార్తను ప్రచురించింది. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ పట్టణంలోని సెయింట్ జోసెఫ్స్ అనే ఎయిడెడ్ పాఠశాల ప్రాంగణంలో వివిధ రకాలైన ఎడ్యుకేషన్ సొసైటీల పేరుతో ఇక్కడ విద్యను వ్యాపారంగా మార్చారని, ప్రభుత్వ భూమిలో నిబంధనలకు విరుద్ధంగా పక్కా భవనాలు, రెసిడెన్షియల్ ఇండ్లు నిర్మించుకున్నారని, మధ్యాహ్న భోజన పథకంలో కూడా అవకతవకలు జరిగిన ఆరోపణలు ఉన్నాయనే పలు అంశాలు సదరు వార్త యొక్క సారాంశం.

కల్పితాలను నిజం చేస్తూ.. నిజాన్ని అబద్ధం చేస్తున్నది ఎవరు?
“ఆదాబ్” రాసిన ఆ వార్తను ఖండిస్తూ సంబంధిత సెయింట్ జోసెఫ్స్ పాఠశాల యాజమాన్యం ఫిబ్రవరి 15న ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. దాన్ని ప్రెస్ మీట్ జరిగినట్లుగా ఒక ఫోటోను జతచేస్తూ, స్థానిక పత్రికల్లో వార్తలు రాయించారు. ఇక్కడ గమనించదగిన విషయం ఏమంటే! ప్రధాన పత్రికలు ఏవి కూడా వీళ్ళ ఖండన వార్తను ప్రచురించలేదు. ఎందుకంటే ఈ పాఠశాలలో జరిగే విద్యా వ్యాపార వ్యవహారాలపై అందరికీ పలు అనుమానాలు ఉన్నట్లు సమాచారం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఖండించడం తప్పేమీ కాదు. కానీ కల్పితాలను నిజం చేస్తూ.. నిజాన్ని అబద్ధంగా ప్రచారం చేసేందుకు సంబంధిత పాఠశాల యాజమాన్యం ప్రయత్నం చేస్తోంది. “మా తాతలు నేతులు త్రాగారు.. కావాలంటే మా మూతులు వాసన చూడండి..!” అనే సామెతలాగా ఉంది ఈ పాఠశాల యాజమాన్యం వారి వ్యవహారం. గతమెంతో ఘనం.. వర్తమానం అధ్వానం… ఇది ప్రస్తుత పరిస్థితి.

- Advertisement -

నిజాలు రాస్తే.. “ఆదాబ్” పై బురదజల్లే ప్రయత్నం..
వివరణ కోసం ప్రయత్నిస్తే, దాక్కుంటున్న వైనం!

“ఆదాబ్” రాసిన వార్తలో ఒకే పాఠశాల ప్రాంగణంలో పలు ఎడ్యుకేషనల్ సొసైటీల పేరుతో విద్యను వ్యాపారంగా మార్చారని విమర్శిస్తే., దీనిని ఖండిస్తూ అసంగతమైన అసత్య ఆరోపణలు “ఆదాబ్” ప్రచురించిందని, తమ వివరణ తీసుకోకుండానే వార్త రాసిందని పాఠశాల యాజమాన్యం సదరు ప్రెస్ నోట్ లో పేర్కొన్నారు. ఈ విషయంలో ఎవరైనా ఎప్పుడైనా తమను సంప్రదిస్తే, అందరి సందేహాలను నివృత్తి చేస్తామని పాఠశాల హెడ్మాస్టర్ అన్నమ్మ బహిరంగ ప్రకటన చేశారు. “ఆదాబ్” ప్రస్తుతం మూడు రోజులుగా వీళ్ళ వివరణ కోసం ప్రయత్నిస్తే, ఇటు నల్లగొండ జిల్లా డీఈఓ, అటు పాఠశాల హెడ్మాస్టర్ అన్నమ్మ ఇరువురు సైతం ఫోను ఎత్తి మాట్లాడకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. “ఆదాబ్” రాసింది అసత్యాలు అయినప్పుడు, నిజాలు చెప్పాలనుకున్న వాళ్ళు ఫోన్లు ఎత్తకుండా ఎందుకు దాక్కుంటున్నట్లు? పాఠశాల ఎయిడెడ్ టీచర్ అయిన హనుమకుమార్ ఒక్కరు మాత్రమే ఆయనకు తెలిసింది చెప్పారు.

అసలు ఏది నిజం.? ఏది అబద్దం..?
కాస్తంత ఆలస్యం అయినా “ఆదాబ్” పకడ్బందీ ఆధారాలు సేకరించి, అసలు నిజాలు ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేస్తోంది. వివరాల్లోకి వెళితే.. సెయింట్ జోసెఫ్స్ పాఠశాల యాజమాన్యం విడుదల చేసిన ప్రెస్ నోట్ రెండవ పేజీలో 1)సెయింట్ జోసెఫ్స్ కిండర్ గార్డెన్ (నర్సరీ, యుకేజీ ప్రైవేట్), 2)సెయింట్ జోసెఫ్స్ అప్పర్ ప్రైమరీ స్కూల్ (1నుండి 7వ.తరగతి ఇంగ్లీష్ మీడియం ఎయిడెడ్), 3)సెయింట్ జోసెఫ్ ప్రైమరీ స్కూల్ (1నుండి 5వ.తరగతి తెలుగు మీడియం ఎయిడెడ్), 4) సెయింట్ జోసెఫ్స్ హైస్కూల్ (6 నుండి 10వ.తరగతి తెలుగు మీడియం ఎయిడెడ్), 5)సెయింట్ జోసెఫ్స్ హైస్కూల్ (8 నుండి 10వ. తరగతి ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్) పైన పేర్కొన్న ఈ ఐదు పాఠశాలల్లో మూడు పాఠశాలలకు ప్రభుత్వ ఎయిడెడ్ ఉన్నదని స్పష్టం చేశారు. తమ పాఠశాల విషయములో ఎవరైనా, ఎప్పుడైనా తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చునని సదరు పాఠశాల హెడ్మాస్టర్ అన్నమ్మ పత్రికా ప్రకటనలో తెలియజేశారు.

ఈ క్రింద పేర్కొన్న “ఆదాబ్” సందేహాలను నివృత్తి చేయగలరని కోరుతున్నాం.. ‘జీసస్ మేరీ జోసెఫ్ (జె.ఎం.జె) సొసైటీ’ హైదరాబాద్ వారు 60 సంవత్సరముల క్రితం నాగార్జునసాగర్ లో “సెయింట్ జోసెఫ్స్ కాన్వెంట్ సొసైటీ” స్థాపించారని, ఈ సొసైటీ ఆధ్వర్యంలోనే ఈ ఐదు పాఠశాలలు నడుస్తున్నట్లు పేర్కొన్నారు.

“ఆదాబ్” మొదటి సందేహం.. ఒక రిజిస్టర్డ్ ఎడ్యుకేషనల్ సొసైటీ మరో సొసైటీని ఎలా స్థాపిస్తుంది? ఏ సొసైటీకి ఉండే ఎగ్జిక్యూటివ్ బాడీ దానికే పరిమితం కదా! దేనికదే ఒక ‘బైలా’ను కలిగి ఉంటుంది. సభ్యులు మారవచ్చు కానీ ఓ సొసైటీ మరో సొసైటీని ఎలా ఎస్టాబ్లిష్ చేస్తుంది?

రెండవ సందేహం.. పైన పేర్కొన్న ఐదు పాఠశాలలు మొత్తం ‘సెయింట్ జోసెఫ్స్ కాన్వెంట్ సొసైటీకి’ చెందినవే అయితే.. తేదీ.29-11-1993న రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ వారు ‘జీసస్ మేరీ జోసెఫ్ (జె.ఎమ్.జె) సొసైటీ’ ఆధ్వర్యంలో నడుస్తున్న నాగార్జున హిల్ కాలనీకి చెందిన సెయింట్ జోసెఫ్స్ హైస్కూల్ కు 6 నుండి 10వ తరగతి వరకు తెలుగు మీడియంనకు ప్రభుత్వ ఎయిడెడ్ గుర్తింపునిస్తూ, ఉత్తర్వులు జారీ చేశారు. (సంబంధిత ప్రొసీడింగ్స్ లేఖ నెం.20748/02/93, తేది.29/11/1993). ‘సెయింట్ జోసెఫ్స్ కాన్వెంట్ సొసైటీ’కి చెందాల్సిన గుర్తింపు జె.ఎమ్.జె సొసైటీ తరఫున ప్రభుత్వ ఎడెడ్ ఎందుకిచ్చారో పాఠశాల యాజమాన్యం వారే నివృత్తి చేయాలి?

మూడవ సందేహం.. ‘సెయింట్ జోసెఫ్స్ కాన్వెంట్ సొసైటీ’ అధికారికంగా 1973లో రిజిస్ట్రేషన్ అయ్యింది (సంబంధిత రిజిస్ట్రేషన్ నెంబర్. 292/1973, తేది.4/6/1973). మరి 1973లో రిజిస్ట్రేషన్ అయిన ఈ సొసైటీకి తేది.01-01-1965లో ప్రభుత్వం తాత్కాలిక పాఠశాల షెడ్ల ఏర్పాటు కొరకు నాగార్జునసాగర్ ఆయకట్టు ప్రభుత్వ భూమి 3.O2 ఎకరాలను 60 ఏళ్లకు లీజు పద్ధతిన కేటాయించింది (సదరు ప్రభుత్వ ఉత్తర్వు నెం. 384, తేది.01-01-1965). ఈ భూమికి లీజు సంవత్సరానికి రూ. 37/- చొప్పున అద్దె చెల్లించాల్సి ఉంటుంది. 1973లో రిజిస్ట్రేషన్ అయిన సొసైటీకి 1965లోనే భూమిని ఎలా కేటాయించారో అనే సందేహాన్ని సదరు పాఠశాల యాజమాన్యం వారే నివృత్తి చేయాలి. ‘పిల్ల పుట్టకముందే కుల్ల కుట్టించినట్లు’ ఉంది కదా! ఇక్కడ వ్యవహారం. మరిన్ని నిజాలను (సందేహాలను) వచ్చే సంచికలో ప్రచురించి, ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేద్దాం..

నేను సెయింట్ జోసెఫ్స్ ఎయిడెడ్ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను. ఫిబ్రవరి 14న మా పాఠశాల గురించి “ఆదాబ్” లో వచ్చిన వార్తపై ఖండన తెలిపేందుకు 15 తేదీన నేను, నాతోపాటు హెడ్మాస్టర్ అన్నమ్మ తదితరులము పత్రికా సమావేశం ఏర్పాటు చేశాం. ఆదాబ్ లో వచ్చిన వార్త సత్యదూరమైనదిగా ప్రకటించిన వారిలో నేను ఉన్నాను కాని, ఈ సొసైటీల స్థాపనలు, ఇందులో ఉన్న లొసుగుల గురించి నాకు తెలియదు. లోతుగా వివరాలు తెలియకుండానే అదాబ్ పత్రికపై బురదజల్లే ప్రయత్నం ఎందుకు చేశారని ప్రశ్నిస్తే, ఒక ఉపాద్యాయుడిగా పాల్గొన్నాను కానీ పాఠశాలకు చెందిన సాంకేతిక విషయాలు తనకు తెలియదని, హైదారాబాద్ లో ఉండే మా ఎడ్యుకేషన్ కౌన్సిలర్ శౌర్యులు గారికి ఫోన్ చేయాలని వివరణ ఇచ్చి, తాను జారుకునే ప్రయత్నం చేశారు.

– హనుమ కుమార్, సెయింట్ జోసెఫ్స్ పాఠశాల స్కూల్ అసిస్టెంట్

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు