Friday, May 17, 2024

తెలంగాణలో రేపే సింగరేణి ఎన్నికలు

తప్పక చదవండి
  • ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్‌
  • 11 ఏరియాల్లో 84 పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు

కొత్తగూడెం : తెలంగాణలో సింగరేణి ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. బుధవారం జరిగే ఎన్నికల్లో భాగంగా ఏర్పాట్లు చేశారు. సింగరేణి ప్రాంతంలోని 11 ఏరియాల్లో 84 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రహస్య బ్యాలెట్‌ పద్ధతిలో ఎన్నికలు జరుగుతాయి. 13 కార్మిక సంఘాలు పోటీ పడుతున్న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో… 39వేల మంది బొగ్గుగని కార్మికులు ఓటు హక్కు వినియోగించుకో నున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. 650 మంది ఎన్నికల్లో విధుల్లో పాల్గొంటుంటే, 460 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. పోలింగ్‌ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు ఉంటుంది. 2021 అక్టోబరులో ఎన్నికలు జరగాల్సి ఉన్నా, ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం మొగ్గు చూపలేదు. సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ కోర్టును ఆశ్రయించడంతో ఎన్నికలు జరుగుతున్నాయి. అక్టోబర్‌ 30న పోలింగ్‌ జరగాల్సి ఉన్నా, అసెంబ్లీ ఎన్నికల కారణంగా వాయిదా పడిరది. ఈనెల 27న పోలింగ్‌ నిర్వహించాల్సిందేనని హైకోర్టు ఆదేశించడంతో ప్రస్తుతం ఎన్నికలు జగనున్నాయి. సింగరేణి పరిధిలో 24 భూగర్భ, 18 ఓపెన్‌ కాస్ట్‌ గనులు ఉన్నాయి. 1998 నుంచి కార్మిక సంఘం ఎన్నికలు జరుగుతున్నాయి. గుర్తింపు సంఘం కాలపరిమితి నాలుగు సంవత్సరాలు. సింగరేణి గుర్తింపు సంఘాల ఎన్నికల్లో 13 యూనియన్లు పోటీ పడుతున్నా, కాంగ్రెస్‌, సీపీఐ, బీఆర్‌ఎస్‌ అనుబంధ యూనియన్ల మధ్యే ఉండనుంది. బీఆర్‌ఎస్‌ అనుబంధ సంఘమైన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పోటీ చేయొద్దని కేసీఆర్‌ ఆదేశించారు. దీంతో ప్రచారం కూడా ఆశించిన స్థాయిలో చేయలేదు. గుర్తింపు సంఘానికి ముగ్గురు ముఖ్య నేతలు రాజీనామా చేశారు. తెలంగాణ ఉద్యమం సమయంలో సింగరేణిలో టీజీబీకేఎస్‌ బలపడిరది. 2012, 2017 కార్మిక సంఘం ఎన్నికల్లో విజయం సాధించింది. 2017లో ఏకంగా టీజీబీకేఎస్‌ తొమ్మిది ఏరియాల్లో సత్తా చాటింది. ఏఐటీయూసీ అనుబంధ సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ మందమర్రి, భూపాలపల్లి ఏరియ్లాలోనే గెలుపొందింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించడంతో, ఈ ఎన్నికలపై ఆసక్తి పెంచింది. గత ఎన్నికల్లో పోటీ చేయని ఐఎన్‌టీయూసీ, మెజారిటీ ఏరియాలను గెలుపొందడానికి వ్యూహాలు అమలుచేస్తోంది. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యవహరిస్తున్నారు. ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షుడిగా కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు ఉన్నారు. ప్రస్తుతం సింగరేణి ఎన్నికలు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. సింగరేణి కార్మికులకు కాంగ్రెస్‌ పార్టీ వరాల జల్లు కురిపించింది. కార్మికులకు ఇంటి స్థలం, రూ.20 లక్షల వడ్డీ లేని రుణం ఇస్తామని ప్రకటించింది. కార్మికుల సమస్యల పరిష్కారానికి హైపవర్‌ కమిటీ వేస్తామని హామీ ఇచ్చింది. కారుణ్య నియామకాలు చేపడతామని, సింగరేణి దినోత్సవాన్ని సెలవుగా ప్రకటిస్తామని హామీ ఇచ్చింది. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని, కార్మికుల వైద్యానికి సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తామని చెప్పింది. మహిళా కార్మికులు గని బయటే పని చేసే అవకాశం, కార్మికుల న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరిస్తామని వరాలిచ్చింది అధికార కాంగ్రెస్‌ పార్టీ. సింగరేణి గనులు ఉన్న ప్రాంతాల్లో ఒక్క చోట తప్ప అన్ని చోట్లా కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలే విజయం సాధించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు