- హెటిరో అధినేత, ఎంపీ పార్థసారథికి విలువైన భూములు
- సాయిసింధు, క్యాన్సర్ ఆస్పత్రుల భూమి లీజు రద్దు
- హైటెక్ సిటీ సమీపంలో చౌకంగా 15 ఎకరాలు
- గత ప్రభుత్వ కేటాయింపులను రద్దు చేసిన సర్కార్
- గత హైకోర్టు సూచనల మేరకు నిర్ణయం
హైదరాబాద్ : హెటిరో అధినేత, బీఆర్‌ఎస్ ఎంపి పార్థసారథిరెడ్డికి సంబంధించిన సంస్థలకు కేటాయించిన భూములపై తెలంగాణ ప్రభుత్వం మంగళవారం సంచలన నిర్ణయం తీసుకుంది. బీఆర్‌ఎస్ ఎంపీ పార్థసారధి రెడ్డికి తెలంగాణ ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. హెటెరో సంస్థల అధిపతిగా ఉన్న ఆయనకు ఆస్పత్రి నిర్మాణానికి అంటూ పదిహేను ఎకరాల అత్యంత ఖరీదైన భూమిని 30 ఏళ్ల లీజుకు గత ప్రభుత్వం కేటాయించింది. ఈ లీజు ఒప్పందాన్ని రద్దు చేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానమేట్‌లో సాయిసింధూ ఫౌండేషన్‌కు 15 ఎకరాలు కేటాయింపు చేస్తూ విడుదల చేసిన జీవో 140ను నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం.. సాయి సింధు ఫౌండేషన్, క్యాన్సర్, ఇతర ప్రాణాంతక వ్యాధుల కోసం హాస్పిటల్ నిర్మాణం, లాభాపేక్ష లేకుండా 30 సంవత్సరాల కాలానికి లీజు ప్రాతిపదికన భూమి కేటాయించింది. సర్వే నంబర్ 41/14/2లోని భూమికి ఏడాదికి రూ. 1,47,743 లీజు మొత్తాన్ని సాయిసింధూ ఫౌండేషన్ చెల్లించేలా నిర్ణయించింది. హైటెక్‌సిటీకి కూతవేటు దూరంలో ఉన్న 15 ఎకరాల భూమిని గత సర్కారు తమ ఎంపీకి కారు చౌకగా కట్టబెట్టింది. రూ.4 వేల కోట్ల విలువైన భూమిని.. ఏడాదికి ఎకరానికి రూ.2 లక్షల చొప్పున.. మొత్తం రూ.30 లక్షలు చెల్లించేలా లీజుకు ఇచ్చింది. అంతేకాదు.. బీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు పార్థసారథిరెడ్డి ట్రస్టీగా ఉన్న సాయిసింధు ఫౌండేషన్‌కు ఎన్నికలకు ముందు గోప్యంగా జారీ చేసిన జీవో ద్వారా ఈ భూమిని ధారాదత్తం చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. నిజానికి ఇది రెండో సారి ఈ భూమి కేటాయించడం. అంతకు ముందు ఓ సారి కేటాయిస్తే హైకోర్టు రద్దు చేసింది. తెలంగాణ ప్రభుత్వం 2018లో 15 ఎకరాలు కేటాయించింది. క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణం కోసం ఖానామెట్ లో భూమిని కేటాయిస్తూ జీవో జారీ చేసింది. అయితే, సాయి సింధు ఫౌండేషన్ కి భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోని సవాల్ చేస్తూ రైట్ టు సొసైటీ సభ్యులు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. అయితే, ప్రభుత్వం నిర్ణయంపై కొంతమంది హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారించిన కోర్టు జీవోను కొట్టివేసింది. భూకేటాయింపుల్లో ప్రభుత్వ విధివిధానాలకు అనుగుణంగా ఉండేలా పున:పరిశీలన చేయాలంటూ ప్రభుత్వానికి సూచించింది. అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఇంత తక్కువకు అద్దెకు ఇవ్వడంపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ లెక్కన రాష్ట్ర ఖజానాకు దాదాపు రూ.5వేల 344 కోట్ల గండి పడుతుందని తెలిపింది. ఇంత ఖరీదైన భూమిని ఏకపక్షంగా ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం అనేక అనుమానాలకు తావిస్తోందని హైకోర్టు సీరియస్ అయ్యింది. హైకోర్టు రద్దు చేయడంతో.. ఎన్నికలకు ముందు మరోసారి సీక్రెట్‌గా భూమిని కేటాయించారు. అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం కోర్టు తీర్పును ఏమాత్రం పట్టించుకోలేదు. పార్థసారథిరెడ్డి ట్రస్టుకు లీజును కట్టబెట్టేందుకే మొగ్గుచూపింది. మరోమారు లీజు నిబంధనలను సవరించింది. 2023 సెప్టెంబరు 25న జీవో-140 ద్వారా సాయిసింధు ఫౌండేషన్‌కు విలువైన భూమిని కట్టబెడుతూ ఉత్తర్వులు జారీ చేసింది. నిజానికి ఏడాదికి రూ.50 కోట్ల మేర లీజు చెల్లించాలని, ప్రతి ఐదేళ్లకోసారి లీజుమొత్తాన్ని 10శాతం మేర పెంచాలని సర్కారు జారీ చేసిన నిబంధనలు చెబుతున్నా.. ‘విచక్షణ అధికారం’ పేరుతో బీఆర్‌ఎస్ సర్కారు ఏడాదికి ఎకరాకు రూ.2 లక్షల చొప్పున.. 15.4 ఎకరాలకు రూ.30 లక్షలు చెల్లించేలా లీజుకు ఇస్తున్నట్లు జీవో-140లో స్పష్టం చేసింది. ఇప్పుడీ భూమి కేటాయింపును రేవంత్ సర్కార్ రద్దు చేసింది.