Friday, May 17, 2024

రాహుల్‌ వార్నింగ్‌తో కాంగ్రెస్‌లో మార్పు వచ్చేనా

తప్పక చదవండి
  • రేవంత్‌ పనితీరు పట్ల సంతృప్తిగా ఉన్న అదిష్టానం
  • అధికార పార్టీపై ఎప్పటికప్పుడు ఎదురుదాడి
  • రాహుల్‌ హెచ్చిరికల తరవాత దారికొస్తున్న నేతలు

హైదరాబాద్‌, రాహుల్‌ తాజా సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు గట్టి వార్నింగ్‌ ఇచ్చినట్లే. ఓరకంగా చెప్పాలంటే కాంగ్రెస్‌ నేతలు కలసికట్టుగా నడుచుకోవాలని, లేకుంటే దారి చూసుకోవాలని సుతిమెత్తగానే హెచ్చరించారు. తెలంగాణ నేతలతో వ్యూహ కమిటీ సమావేశంలో చేసిన హెచ్చరికలు ఇక వారికి శిరోధార్యం కావాలి. ఎందుకంటే ఆలూలూదు చూలూ లేదు..అన్నట్లుగా ఎవరికి వారు తామే సిఎం అన్న లెవల్లో అంతర్గత కుమ్ములాటలకు దిగడం, పరస్పర విమర్శలు చేసుకోవడం పరిపాటిగా మారింది. ఇకపోత తొలిసారిగా ఓ యువనాయకుడిని, సమర్థుడిని కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా నియమించింది. రేవంత్‌ రెడ్డిని పిసిసి అధ్యక్షుడిగా చేయడంతో కాంగ్రెస్‌లో సహజంగానే ఉన్న విభేదాలు బయటపడ్డాయి. అయితే కాంగ్రెస్‌ తీరులో మార్పు స్పష్టంగా గోచరిస్తున్నది. నిజానికి కాంగ్రెస్‌లో ఎవరికి వారు తామే పిసిసికి అర్హులమని, అవకాశమస్తే తామే సిఎంగా కూడా అర్హులమని చెప్పుకునే వారి జాబితా చాంతాడంత ఉంటుంది. జాబితే రాస్తూ పోతే ఎవరు కూడా మిగలక పోయినా ఆశ్చర్య పడనక్కర లేదు. తెలంగాణలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో రేవంత్‌ను కాంగ్రెస్‌ అధిష్టానం పిసిసి చీఫ్‌గా నియమించిన తరవాత కాంగ్రెస్‌లో ఉత్తేజం వచ్చింది. దూకుడు వచ్చింది. దూకుడు కార్యక్రమాలతో మళ్లీ కాంగ్రెస్‌లో ఆశలు కూడా పెరిగాయి. తాము అధికారానికి చేరువ అవుతున్నామన్న భావనా ఇప్పుడే పెరిగింది. ఇదే విషయాన్ని రాహుల్‌ కూడా పరోక్షంగా చెప్పారు. రేవంత్‌ నాయకత్వంలో సజావుగా సాగాలని సూచించారు. నిజానికి రేవంత్‌ మాత్రమే ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఆశలు కల్పించారు. యువతలో ఉత్సాహాన్ని నింపే యంగ్‌ లీడర్‌గా అవతరించారు. అధికార బిఆర్‌ఎస్‌ను వివిధ సందర్భాల్లో నిలదీసే వ్యక్తిగా నిలిచారు. రేవంత్‌ రెడ్డిని నియమిస్తూ కాంగ్రెస్‌ అధిష్టానం నిర్ణయం తీసుకున్నదే తడవుగా కొందరు వ్యతిరేక స్వరాలు వినిపించారు. ఇది ముందునుంచీ ఊహిస్తున్నదే. అలాగే రేవంత్‌ రెడ్డిని ఎంపిక చేయడంపై ఆ పార్టీలోకి కొందరు నేతలు ఇప్పటికీ గుర్రుగా ఉన్నారు. వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తికి పీసీసీ పదవి ఎలా ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కాంగ్రెస్‌ను వీడిన నేతలను వెనక్కి రప్పించే కార్యక్రమాలను రేవంత్‌ ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే పొంగులేటి, జూపల్లిలో పార్టీలో చేరేందుకు వచ్చారు. మున్ముందు మరిన్ని చేరికలు ఉంటాయన్న సంకేతాన్ని రేవంత్‌ ఇస్తున్నారు. మరోవైపు బిఆర్‌ఎస్‌ విధానాలపై కాంగ్రెస్‌ దూకుడుగానే సాగుతోంది. ఇటీవల ధరణికావచ్చు, ధాన్యం సేకరణ కావచ్చు, పోడు సమస్యలు కావచ్చు పిసిసి పిలుపుతో విజయవంతం అవుతున్నాయి. అయితే దీనిని కూడా సీనియర్‌ నేతలు తట్టుకోలేక పోతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఢల్లాిలో రాహుల్‌ మీటింగ్‌లో నేతలకు గట్టి హెచ్చరికలు చేసారు. బహిరంగ విమర్శలు చేసేవారిని ఉపేక్షించబోమని కూడా రాహుల్‌ ప్రకటించారు. పార్టీ వేదికలపైన మాత్రమే చర్చించుకోవాలని, పత్రికలకు ఎక్కరాదని హెచ్చరిక చేశారు. దీంతో ఎంపి కోమటిరెడ్డి, జగ్గారెడ్డిల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. దీనికితోడు రేవంత్‌ కార్యక్రమాలపై ఎఐసిసి కూడా సంతృప్తిగానే ఉన్నట్లు సమాచారం వస్తోంది. కోమటి రెడ్డి సోదరుడు రాజగోపాల్‌ రెడ్డి కూడా తిరిగి కాంగ్రెస్‌లోకి వస్తారణ్న ప్రచారం ఉంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు