Monday, June 17, 2024

ప్రగతి నివేదన సభ సక్సెస్సా!

తప్పక చదవండి
 • మెడికల్‌ కళాశాల, బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం, ఎస్పీ కార్యాలయం, వెజ్‌, నాన్‌ వెజ్‌ మార్కెట్‌ కలెక్టర్‌ కార్యాలయం ప్రారంభం ..
 • గులాబిమయంగా మారిన సూర్యాపేట జిల్లా..
 • ముగ్గురు ఎమ్మెల్యేలను గెలిపించాలన్న సీఎం..
 • ఆశ్చర్యానికి గురైన ప్రజలు, సభ ప్రాంగణం మీదున్నమంత్రులు, ఎమ్మెల్యేలు..
 • సీఎం స్పీచ్‌లో కనిపించని ఉత్సాహం..కొత్తగా హామీలు ఏమీ ఇవ్వలే..
 • నిరుత్సాహంతో వెను తిరిగిన జిల్లా ప్రజలు..
 • జీవో నెంబర్‌ 46 తొలగించాలంటూ
  నిరుద్యోగుల ప్లకార్డుల ప్రదర్శన..
 • ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 స్థానాలు గెలిపించాలి.
 • ప్రగతి నివేదన సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌..

సూర్యాపేట : సీఎం కేసీఆర్‌ ఆదివారం సూర్యాపేట జిల్లాలో పలు జిల్లా కార్యాలయాలను స్థానిక ఎమ్మెల్యే మంత్రి జగదీష్‌ రెడ్డి తో కలిసి ప్రారంభించారు.. హైదరాబాద్‌ బేగంపేట నుండి సూర్యాపేట జిల్లాకి హెలి కాఫ్టర్‌ లో చేరుకున్న ఆయన, ముందుగా 20 ఎకరాల విస్తీర్ణంలో రూ. 156 కోట్ల తో నిర్మించిన మెడికల్‌ కలశాలను ప్రారంభించారు. అక్కడి నుండి మినీ ట్యాంక్‌ బండ్‌ మీదగా మహా ప్రస్థానం ముందర నుండి ఇంటి గ్రేటెడ్‌ వెజ్‌, నాన్‌ వెజ్‌ సమీకృత మార్కెట్‌ (మూడు కోట్ల 18 లక్షలు)ను (3.10 పి.ఎం) ప్రారంభించి, మార్కెట్‌ మొత్తాన్ని కలియ తిరుగుతూ రైతులు ఏర్పాటు చేసిన కూరగాయల షాపులను పరిశీలిస్తూ కూరగాయల వ్యాపారస్తులతో మాట్లాడారు.

అక్కడి నుండి నల్ల చెరువు సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన భారతీయ రాష్ట్ర సమితి జిల్లా కార్యాలయాన్ని (3.35 గం..లకు) ప్రారంభించారు. పక్కనే ఉన్న జిల్లా పోలీస్‌ కార్యాలయం (20 ఎకరాల్లో రూ. 38.50 కోట్లు) చేరుకొని ముందుగా పోలీస్‌ ల గౌరవ వదనం స్వీకరించి.. కార్యాలయ భవనం ప్రారంభించి (4.48 గం.. లకు ), జిల్లా ఎస్పీ ఛాంబర్‌ లో ఎస్పి రాజేంద్ర ప్రసాద్‌ ని కుర్చీలో కూర్చోబెట్టి ఆశీర్వచనం చేసి శుభాకాంక్షలు తెలిపారు. అక్కడి నుండి జిల్లా సమీకృత కలెక్టర్‌ కార్యాలయం ప్రారంభించి (4.10) అక్కడ ఏర్పాటు చేసిన పూజలో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావును ఆయన ఛాంబర్‌ లో కుర్చీలో కూర్చోబెట్టి ఆశీర్వచనం చేసి, శుభాకాంక్షలు తెలిపారు. అక్కడే ప్రధాన సమావేశ మందిరంలో ఉద్యోగులతో సీఎం ముచ్చటించారు. అనంతరం స్టేట్‌ ఛాంబర్‌ లో తేనీటి విందులో పాల్గొన్నారు. అనంతరం ఈనాడు కార్యాలయం ఎదురుగా ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన సభలో (5.14 గం..లకు ) పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడుతూ ..
రైతు రుణమాఫీ చేయాలని మంత్రి జగదీష్‌ రెడ్డి పట్టు పడ్డాడు. ప్రతి గ్రామ పంచాయితీకి పది లక్షలు, మున్సిపాలిటీకి రూ. 25కోట్ల మంజూరు చేస్తానని, రూ. 25 కోట్లతో సూర్యాపేటకు కలాభారతి మంజూరు చేసి, మొత్తం రూ. 50కోట్లు మంజూరు చేస్తూ ఒకటి, రెండు రోజుల్లో జీఓ ఇస్తా అన్నారు. అలాగే జిల్లాకి మహిళా స్పోర్ట్స్‌ స్టేడియం మంజూరు చేస్తా అని, సూర్యాపేట జిల్లాకు మొత్తం రూ. 50 కోట్లు మంజూరు చేస్తున్న అని హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణాలో అమలవుతున్న పథకాలు అమలు చేసిందా అని ప్రశ్నించారు. గోదావరి నీళ్లు మన తలాపుకు వచ్చినయని, 24 గంటల కరెంటు రైతుల పాలిటీ వరంగా మారిందన్నారు. ఇప్పటి రైతు భీమా, అప్పటి అపత్‌ బందు గుర్తు తెచ్చుకోండి అని, ధరణి తీసేస్తే రైతు బంధు, రైతు భీమా ఎట్లా వస్తది అని ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించాలని కోరారు. అవినీతిని తగ్గించడానికి, రైతుకు పారదర్శ సేవ చేసేందుకే ధరణి పెట్టమని సమస్యలన్నీ తీరాయి అన్నారు. ధరణితో జిల్లా కలెక్టర్‌, ఆర్దీఓ, ఎంఆర్‌ఓ ఎవరికి అధికారం లేదని ఆ అధికారం రైతన్నలకే ఇచ్చామని వెల్లడిరచారు. అన్ని కులాల ప్రజలను అక్కున చేర్చుకునేందుకే ఈ పథకాలు అమలు చేస్తున్నామని, ప్రజలకు సాగు నీరు, తాగు నీరు ప్రాథమిక హక్కుగా ఫ్రీ గా అందిస్తున్నాం అన్నారు. యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ ముప్పై వేల కోట్లతో నల్గొండ జిల్లాలో పెట్టాం అని తెలిపారు.

- Advertisement -

గతంలో కంటే ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 కు 12 స్థానాలు గెలిపించాలని, మూడో సారి అధికారం లోకి వస్తాం ధీమా వ్యక్తం చేశారు. రూ.37.000 కోట్లతో రైతు రుణమాపీ చేస్తున్నాం అని, రైతులకు రైతు బీమా అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అన్నారు. ఇప్పటి వరకు మూడు కోట్ల టన్నుల వడ్లు తెలంగాణ పండిస్తుందని, కోటి టన్నుల ధాన్యం బయటి వాళ్లకు అమ్ముతున్నాం అంటూ చెప్పుకొచ్చారు. అలాగే సూర్యాపేట జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలను గెలిపించాలని సీఎం కేసీఆర్‌ అనడంతో, స్టేజిమీద ఉన్న తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌ మూడు కాదు నాలుగు చెప్పడంతో నాలుగు ఎమ్మెల్యే స్థానాలను అత్యధిక మెజార్టీ గెలిపించాలని సీఎం కోరారు. ముఖ్యమంత్రి అలా మాట్లాడటంతో ఒక్కసారిగా సభకి వచ్చిన ప్రజలు, కార్యకర్తలతో పాటు స్టేజిపై ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు ఏమాత్రం కొత్తదనం లేదని కొత్త పథకాలు, హామీలు జిల్లా ప్రజలకు వరాలు కురిపిస్తారని ఎంతో ఆశగా ఎదురు చూసిన ప్రజలకు నిరాశే మిగిలింది.
మంత్రి జగదీష్‌ రెడ్డి మాట్లాడుతూ..
ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం 60 ఏండ్లలో చెయ్యాల్సిన అభివృద్ధి ని కేవలం ఆరు ఏండ్లలోనే చేశారని రాష్ట్ర విద్యుత్‌ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్‌ రెడ్డి కొనియాడారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలుపుకున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌ దని అందుకు ఆయనకు సూర్యపేట జిల్లా ఋణపడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. సూర్యపేటను జిల్లాగా ఏర్పాటు చేయడమే కాకుండా, అద్భుతమైన భవనాలు నిర్మించి పాలనను ప్రజలకు పాలనను చేరువ చేసిన ఘనత ముమ్మాటికి ముఖ్యమంత్రిదేనన్నారు. కాకతీయుల కాలం నుండి నిజాంపాలన చివరి వరకు ఉమ్మడి నల్లగొండ జిల్లా పాడి పంటలతో సస్యశ్యామలంగా ఉండేదని, కాంగ్రెస్‌ పార్టీ హైదరాబాద్‌ రాష్ట్రాన్ని ఆంద్రప్రదేశ్‌ లో కలపడంతో సమైక్య పాలనలో 600 ఏండ్లు వెనక్కి పోయిందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. వారు చేసిన పాపాలతో అన్నం పెట్టే రైతు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆయన మండిపడ్డారు. వారి నిర్వాకం తోటే భూగర్భ జలాలుఅడుగంటడంతో బయటకు వచ్చిన ఫ్లోరిన్‌ భూతం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో లక్షలాది మందిని కబళించిందని ఆయన ఆరోపించారు. అంతే గాకుండా చేనేత కార్మికులు ఆకలి చావులు, ఆత్మహత్యలకు పాల్పడుతుంటే తట్టుకోలేక ఉద్యమ కాలంలోనే జోలె పట్టి వసూలు చేసిన మొత్తలతో నేతన్నలను ఆదుకున్న మహానేత కేసీఆర్‌ అని ఆయన కొనియాడారు. సూర్యపేట, తుంగతుర్తి, హుజుర్నగర్‌, మునుగోడు వంటి ప్రాంతాలలో జరిగిన రాజకీయ ఘర్షణలతో రక్తసిక్తం అయ్యాయని ఆయన చెప్పారు. అటువంటి ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇప్పుడు యావత్‌ భారత దేశానికే అన్నం పెట్టే ప్రాంతంగా ఎడిగిందన్నారు. అందుకు స్వరాష్ట్రంలో సూపరిపాలనను అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకుంటున్న నిర్ణయాలే కారణమన్నారు. సూర్యపేట ప్రాంతం ఐదు దశాబ్దాలుగా పోచంపాడు జలాల కోసం నిరీక్షించి ఆశలు వదులు కున్నారన్నారు. దివంగత కమ్యూనిస్టు నేత భీమిరెడ్డి నరసింహా రెడ్డి పోరాడి పోరాడి నిస్సహాయులు అయ్యారన్నారు. అటువంటి తరుణంలో ఏర్పడ్డ తెలంగాణా రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన మూడేండ్లలో ప్రపంచమే ఆశ్చర్యం చెందేలా కాళేశ్వరం పూర్తి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూర్యపేటను సస్యశ్యామలం చేశారన్నారు. కాళేశ్వరం జలాలతో మొట్ట మొదట లబ్దిపొందింది సూర్యపేట జిల్లాయే నన్నారు. ఆ జలాలు పారుతున్నందునే నాలుగు లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి ఉన్న సూర్యపేట జిల్లా వరుసగా నాలుగేళ్ళ నుండి 40 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి చేసే స్థాయికి చేరిందన్నారు. రైతాంగానికి ఆత్మవిశ్వాసం కలిపించడంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ను మించిన నేత మరొకరు ఉండరన్నారు. జిల్లా కేంద్రంలో మెడికల్‌ కళాశాల ఏర్పాటు చేసి సామాన్యుడికి అధునాతన వైద్యం అందుబాటులో ఉండేలా చేసింది ముఖ్యమంత్రి కేసీఆర్‌ యే నన్నారు. ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌, సమీకృత ప్రభుత్వా కార్యాలయాల భవన సముదాయాలు, పోలీస్‌ కార్యాలయ భవనాల నిర్మాణాలతో సూర్యపేట నాడు ఎట్లా ఉండే.. నేడు ఎట్లా మారింది.. అందుకు అధినేత అందించిన తోడ్పాటు కారణమన్నారు.
ప్లకార్డులతో నిరుద్యోగుల నిరసన..
ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడుతుండగా.. నిరుద్యోగులు కొంతమంది జీవో నెంబర్‌ 46ను రద్దుచేసి, టి.ఎస్‌.పి.ఎస్‌.సి.ని తొలగించాలని, గ్రామీణ జిల్లాలో నిరుద్యోగులకు న్యాయం చేయాలని, 2015 – 2018 ప్రకారం నియామకాలు జరపాలని ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో వారిని గమనించిన సీఎం దాని గురించి కూడా మాట్లాడతానని చెప్పడంతో ప్లకార్డులను తొలగించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు