అమరావతి : కేంద్ర సాహిత్య పురస్కారానికి ఎంపికైన రచయిత తల్లావజ్జల పతంజలి శాస్త్రికి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ఆయన రాసిన ’రామేశ్వరం కాకులు…’ అనే కథా సంపుటానికి ఈ పురస్కారం దక్కడం ముదావహమన్నారు. రచయితగానే కాకుండా పర్యావరణవేత్తగా సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారని అన్నారు. కొల్లేరు సరస్సు పరిరక్షణ కోసం న్యాయ పోరాటం చేశారని తెలిపారు. చిత్తడి నేలలను కాపాడాలని దశాబ్దాలుగా పోరాడుతున్నారన్నారు. పతంజలి శాస్త్రి రాసే వ్యాసాలు పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను తెలియచేస్తాయన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఆయన చేసే పోరాటానికి రాజకీయాలకు అతీతంగా అందరూ మద్దతుగా నిలవాలని పవన్ కళ్యాణ్ కోరారు.