- బెంగళూరులో ముగిసిన విపక్షాల రెండ్రోజుల సమావేశం
- ఢిల్లీ లో ఇండియా కూటమి సెక్రటేరియేట్ ఏర్పాటు..
- త్వరలో ముంబైలో మరోసారి భేటీ కానున్నట్లు వెల్లడి
- ఇది బీజేపీ, ప్రతిపక్షాల మధ్య యుద్ధం కాదన్న రాహుల్
- ప్రజల స్వాతంత్య్రం, స్వేచ్ఛ కోసం చేస్తోన్న యుద్ధమని వ్యాఖ్య
- ఇండియా గెలిచి… బీజేపీ ఓడిపోతుంది : మమత
బెంగుళూరు : కేంద్రంలో వరుసగా రెండుసార్లు గెలిచిన మోడీ సర్కారును మరోసారి అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు దేశంలోని ప్రతిపక్షాలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇప్పటికే ఒకసారి బిహార్ రాజధాని పాట్నాలో సమావేశం నిర్వహించిన ప్రతిపక్షాలు.. తాజాగా సోమ, మంగళవారాల్లో బెంగళూరులో సమావేశం అయ్యాయి. ఇందులో కీలక నిర్ణయాలు, ప్రకటనలు చేశారు. ఈ కూటమికి ఇప్పటికే ఇండియా (ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్) గా నామకరణం చేసినట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే వెల్లడిరచారు. రెండు రోజుల సమావేశంలో చర్చించిన వివరాలను.. భేటీ అనంతరం 26 పార్టీలకు చెందిన నేతలందరూ ఉమ్మడి ప్రెస్ మీట్ నిర్వహించి వెల్లడిరచారు.
కూటమికి ఇండియాగా నామకరణం చేసినట్లు పేర్కొన్న ఖర్గే.. ఇండియాకు అధ్యక్షుడు ఇతర నేతలకు సంబంధించిన పేర్లు, వివరాలను తదుపరి జరగనున్న ముంబై సమావేశంలో వెల్లడిస్తామని తెలిపారు. దీంతో పాటు 11 మంది సభ్యులతో కో ఆర్డినేషన్ కమిటీని కూడా ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. కమిటీ సభ్యులు, దానికి సంబంధించిన పూర్తి వివరాలు ముంబై సమావేశంలో చర్చించి ఆ తర్వాత వెల్లడిస్తామని చెప్పారు. ముంబైలో సమావేశం అయ్యే తేదీని కూడా త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నారు. అటు.. ఇండియాకు సంబంధించి ఎన్నికల క్యాంపెయిన్ మేనేజ్‌మెంట్ కోసం దేశ రాజధాని ఢల్లీిలోక ఒక సెక్రటేరియట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఖర్గే వెల్లడిరచారు.
రెండు రోజుల భేటీ తర్వాత విపక్ష పార్టీలకు చెందిన నేతలంతా జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. మొదట పాట్నాలో ఒకరోజు.. ప్రస్తుతం బెంగళూరులో రెండు రోజుల పాటు జరిగిన సమావేశాలు చాలా ఫలప్రదంగా సాగినట్లు నేతలు వెల్లడిరచారు. ఇప్పటివరకు జరిగిన చర్చల్లో చాలా సానుకూల విషయాలు చర్చకు వచ్చాయని తెలిపారు. దేశంలో మోడీ సర్కార్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలు.. అనుసరిస్తున్న విధానాలు దేశాన్ని నాశనం చేసేలా, వ్యవస్థలను నిర్వీర్యం చేసేలా ఉన్నాయని మండిపడ్డారు. వాటి అన్నింటిపై ఐక్యంగా పోరాడి.. వచ్చే 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సర్కార్‌ను గద్దె దించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వస్తున్నాయని తెలిపారు.
ప్రధాని పదవిపై కాంగ్రెస్ పార్టీకి ఆసక్తి లేదు : వెల్లడిరచిన ఖర్గే
ప్రతిపక్ష పార్టీల సమావేశంలో ప్రధాన మంత్రి పదవిపై కాంగ్రెస్ పార్టీకి ఆసక్తి లేదని ఆ పార్టీ అధ్యక్షుడు ప్రకటించారు. భారత దేశ ఆత్మ, రాజ్యాంగం, లౌకికవాదం, సాంఘిక న్యాయం, ప్రజాస్వామ్యాలను పరిరక్షించడంపై మాత్రమే తమ పార్టీకి మక్కువ ఉందన్నారు. రాష్ట్ర స్థాయిలో తమ మధ్య విభేదాలు ఉన్నాయన్నారు. అవి అధిగమించలేనంత పెద్ద విభేదాలు కావని, ప్రజలను కాపాడటం కోసం వాటిని పక్కన పెట్టవచ్చునని చెప్పారు. ప్రజలు ద్రవ్యోల్బణంతో బాధపడుతున్నారన్నారు. నిరుద్యోగంతో బాధ పడుతున్న యువత కోసం, హక్కుల అణచివేతకు గురవుతున్న పేదలు, దళితులు, గిరిజనులు, మైనారిటీల కోసం వాటిని వదిలిపెట్టవచ్చునని చెప్పారు.
బీజేపీకి భయం పట్టుకుంది : విపక్ష కూటమి
ఈ సమావేశానికి హాజరైన 26 పార్టీలకు తగినంత రాజకీయ బలం ఉందని విపక్ష కూటమి నేతలు చెబుతున్నారు. 11 రాష్ట్రాల్లో ఈ పార్టీలు అధికారంలో ఉన్నాయన్నారు. కూటముల ప్రాధాన్యాన్ని వివరించారు. బీజేపీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో 303 స్థానాలను దక్కించుకుందని, ఈ స్థానాలను ఆ పార్టీ తనంతట తాను గెలుచుకోలేదని ఖర్గే ప్రకటించారు. బీజేపీ తన మిత్ర పక్షాల ఓట్లను పొంది, అధికారంలోకి వచ్చి, ఆ తర్వాత ఆ మిత్ర పక్షాలను వదిలేసిందని చెప్పారు. ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర నేతలు రాష్ట్రాల్లో తిరుగుతూ, పాత మిత్రులతో సత్సంబంధాల కోసం ప్రయత్నిస్తున్నారన్నాని ఎద్దేవా చేశారు.
తప్పక చదవండి
-Advertisement-