Friday, May 17, 2024

తెలంగాణ ఎన్నికలపై అస్పష్టత

తప్పక చదవండి
  • జమిలితో షెడ్యూల్‌ మారుతుందా అన్న చర్చ
  • స్పష్టమైన సంకేతాలు ఇవ్వలేక పోతున్న ఇసి

హైదరాబాద్‌ : షెడ్యూల్‌ ప్రకారం డిసెంబర్‌లో రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగాల్సి ఉంది. జమిలి అన్న ఊహాగానాలతో అసలు సకాలంలో ఎన్నికలు జరుగుతాయా లేదా అన్న చర్చ సాగుతోంది. జమిలి ఉంటుందా లేక..తెలంగాణలో షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయా అన్నది ఎవ్వరూ స్పష్టం చేయడం లేదు. షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని భావించిన టీఆర్‌ఎస్‌ 115 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను ప్రకటించింది. ఆ తర్వాతే రకరకాల గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్‌, బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించాయి. కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసేందుకు దాదాపు వెయ్యి మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. బీజేపీ నుంచి పోటీకి ఆరు వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అయితే ఇసి మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతోంది. రాష్ట్రంలో ఎన్నికలకు ఇప్పటికే ఈసీ ఏర్పాట్లు మొదలుపెట్టింది. జమిలితో సంబంధం లేకుండా అక్టోబర్‌ నెలలో ఎన్నికల షెడ్యూల్‌ వచ్చే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం బృందం అక్టోబర్‌ 3వ తేదీ నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనుంది. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ సంసిద్ధతను సమీక్షించడంతోపాటు రాజకీయ పార్టీలతో సమావేశం కానుంది. అక్టోబర్‌ 3వ తేదీన జాతీయ, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు రాజకీయ పార్టీల నేతలతో సమావేశమై ఎన్నికల నిర్వహణాపరమైన అంశాలపై చర్చించనుంది. మరోవైపు, ఎక్సైజ్‌, ఆదాయపన్ను, జీఎస్టీ, రవాణా, తదితర నిఘా విభాగాల అధికారులు, బ్యాంకర్లతో కూడా సమావేశం కానుంది. ఈ సందర్భంగా డబ్బు, మద్యం, ఉచిత కానుకల ప్రవాహాన్ని కట్టడి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తుంది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, కేంద్ర, రాష్ట్ర పోలీస్‌ బలగాల నోడల్‌ అధికారులతో సమావేశమై భద్రతా పరమైన ప్రణాళిక, ఏర్పాట్లపై సమీక్షించనుంది. ఇక జిల్లాలవారీగా ఎన్నికల ప్రణాళిక ఏర్పాట్లపై సమీక్షించనుంది. మూడో రోజు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు సీఎస్‌, డీజీపీ, తదితర అధికారులతో సమావేశమై ఎన్నికల ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల సంఘం బృందం సమీక్షించనుంది. ఆ తర్వాత అధికారులు ఓటర్ల అవగాహనా కార్యక్రమాలపైనా అధికారులు దృష్టి సారించనున్నారు. ఓటర్ల జాబితా, పౌరుల భాగస్వామ్యానికి సంబంధించి ప్రచారం నిర్వహిస్తున్న ప్రముఖులు, దివ్యాంగ ఓటర్లు, యువ ఓటర్లతో ఈసీ బృందం సమావేశం కానుంది. దీంతో వీలైనంత త్వరగా అభ్యర్థులను ఫైల్‌ చేయాలనే ఆలోచనలో కాంగ్రెస్‌ ఉంది. దీని వల్ల ప్రచారం చేసుకోవడానికి ఎక్కువ సమయం ఉంటుందని, అభ్యర్థులు కూడా ప్రజల్లోకి ఇప్పటి నుంచే వెళ్లడం ద్వారా సానుకూలత లభిస్తుందని భావిస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్‌ ప్రకారం డిసెంబర్‌ లోనే జరిగే అవకాశం ఉంది. ఈ మేరకు ఈసీ కూడా కార్యకలాపాలు వేగవంతం చేసింది. మొన్నటి వరకు జమిలీ ఎన్నికలు జరుగుతాయని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. దీంతొ కొంత గందరగోళం ఏర్పడిరది. మంత్రి కేటీఆర్‌ ఏప్రిల్‌ లేదా మేలో జమిలీ ఎన్నికలే జరగొచ్చని చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. దీనికి కౌంటర్‌ గా బీజేపీ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు. ఇంతలోనే జమిలీ ఎన్నికల కోసం మాజీ రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో కేంద్రం కమిటీ వేసింది. కమిటీ తొలి సమావేశం సైతం జరిగింది. దీంతో ఎన్నికలు షెడ్యూల్‌ ప్రకారం కాకుండా ఏప్రిల్‌ లో పార్లమెంటు ఎన్నికలతోపాటు జరుగుతాయనే చర్చ మొదలైంది. ఆ తర్వాత కేంద్రం మహిళా బిల్లును ప్రవేశపెట్టడంతో రిజర్వేషన్లు ఖరారు చేశాక ఎన్నికలు నిర్వహిస్తారని, ఈ క్రమంలో ఆరునెలల వరకు జాప్యం జరగొచ్చనే మరో చర్చ తెరమీదకు వచ్చింది. దీనికి కేంద్రం వెంటనే తెరదించింది. 2027 తర్వాతే మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయని తెలిపింది.కొంత మేర స్లీప్‌ మోడ్‌ లోకి వెళ్లిన పార్టీలు మళ్లీ యాక్టివ్‌ అయ్యాయి. అభ్యర్థులను ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యాయి. అటకెక్కించిన దరఖాస్తులను పరిశీలించే పనిలో నిమగ్నమయ్యాయి. వారం పది రోజుల్లో తొలి జాబితాలను విడుల చేసేందుకు రెడీ అవుతున్నాయి. డిసెంబర్‌ లో ఎన్నికలు నిర్వహించాలంటే అక్టోబర్‌ లో నోటిఫికేషన్‌ రిలీజ్‌ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఎన్నికల కమిషన్‌ సైతం ఏర్పాట్లు చేస్తున్నది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు