- తలసాని పుట్టిన రోజు వేడుకల్లో ఘటన
- బొకే అందించలేదంటూ గన్ మెన్ పై ఆగ్రహం
- మంత్రి తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు
తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్ అలీ తన గన్ మెన్ పై చేయిచేసుకున్నారు. తలసాని పుట్టిన రోజు వేడుకలకు హాజరైన మహమూద్ అలీ.. బొకే ఎక్కడంటూ గన్ మెన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో సహనం కోల్పోయి గన్ మెన్ చెంప చెళ్లుమనిపించారు. దీంతో షాక్ అయిన సదరు గన్ మెన్ మంత్రిని అలాగే చూస్తుండిపోయారు. ఆపై వెనక ఉన్న వ్యక్తుల దగ్గరి నుంచి బొకే తీసుకుని మంత్రికి అందించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
హోంమంత్రి మహమూద్ అలీ తీరుపై నెటిజన్లు తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హోంమంత్రి మహమూద్ అలీ హాజరయ్యారు. మంత్రి తలసానిని ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు చెప్పారు. ఆయనకు అందించేందుకు తెచ్చిన బొకే కనబడలేదు.. బొకే ఏదంటూ గన్ మెన్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన మహమూద్ అలీ, గన్ మెన్ ను దగ్గరకు పిలిచి చెంపపై కొట్టారు. ఇది చూసిన మంత్రి తలసాని హోంమంత్రికి సర్దిచెబుతుండడం వీడియోలో కనిపించింది. వెనక ఉన్న వారు అందించిన బొకేను తీసుకుని గన్ మెన్ దానిని హోంమంత్రికి ఇచ్చారు. కాగా, హోంమంత్రి తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తన రక్షణ బాధ్యతలు చూసే సిబ్బంది పట్ల హోంమంత్రి మహమూద్ అలీ ప్రవర్తించిన తీరు బాలేదని నెటిజన్లు మండిపడుతున్నారు.