Thursday, September 12, 2024
spot_img

రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పాలన

తప్పక చదవండి
  • నిరంకుశ ప్రభుత్వాలకు తావులేదు
  • గత పదేళ్లలో రాజ్యాంగ విలువలకు తిలోదకాలు
  • ప్రస్తత ప్రజాపాలనలో ప్రజలకు చేరువగా ప్రభుత్వం
  • పథకాల అమలు.. హామీలు నెరవేర్చే క్రమంలో నిర్ణయాలు
  • టీపీపీఎస్సీ ప్రక్షాళనతో నిరుద్యోగులకు మంచి రోజులు
  • గణతంత్ర వేడుకల్లో గవర్నర్‌ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌ : గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ గవర్నర్‌ తమిళి సై సౌందర రాజన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలను ఎత్తి చూపారు. ’పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రంలో రాజ్యాంగ విలువలు విధ్వంసానికి గురయ్యాయన్నారు. ప్రజా ప్రభుత్వంలో వాటిని నిర్మించుకుంటున్నాం. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పాలన సాగించినప్పుడే ప్రజాస్వామ్యం ఫరిడవిల్లుతుందన్నారు. సంక్షేమ, అభివృద్ధి ఫలాలు ప్రతి పేదవాడికి అందుతాయి. ఏకపక్ష నిర్ణయాలు, నియంత పోకడలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని వ్యాఖ్యానించారు. కొత్తగా ఏర్పడిన ప్రజా ప్రభుత్వం సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు లభించాలనే లక్ష్యంతో పని చేస్తోందని’ తమిళి సై సౌందర రాజన్‌ సందేశం ఇచ్చారు. గత పదేళ్లలో తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలో ఉంది. గవర్నర్‌ తమిళి సై సౌందర రాజన్‌, అప్పటి సీఎం కేసీఆర్‌ మధ్య పడలేదు. ఈ విషయాన్ని తన ప్రసంగంలో ప్రధానంగా ప్రస్తావించారు. పబ్లిక్‌ గార్డెన్‌లో జరిగిన వేడుకల్లో ఆమె జెండా ఆవిష్కరించి గౌరవవందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా పాలకులు వ్యవహరించిన సమయంలో ప్రజల తీర్పుల ద్వారా అధికారాన్ని నియంత్రించే శక్తి రాజ్యాంగం ఇచ్చింది. రాజ్యాంగ స్ఫూర్తితో, రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలో పాలన రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా జరినప్పుడు, ఆ పాలనకు చరమగీతం పాడే అవకాశం ప్రజలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు. గత 10 ఏళ్లలో పాలకులు రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా, నియంతృత్వ ధోరణితో వ్యవహరించారు. అది సహించని తెలంగాణ సమాజం ఇటీవల జరిగిన ఎన్నికల్లో తమ తీర్పు ద్వారా బుద్ది చెప్పింది. ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది. అహంకారం, నియంతృత్వం చెల్లదని ఈ తీర్పుతో స్పష్టమైంది. ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా కార్యాచరణ ప్రారంభమైంది. గత పాలకుల నిర్లక్ష్యంతో ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నంగా మారింది. వ్యవస్థలు గాడి తప్పియి. అన్నింటినీ సరిదిద్దుకుంటూ ముందుకు వెళుతున్నాం. ప్రజా ప్రభుత్వ తొలి ప్రాధాన్యత ప్రజా సంక్షేమమే. ప్రజల ఉద్యమ ఆకాంక్షలే ప్రభుత్వ ప్రాధాన్యం. ప్రతి అర్హుడికి సంక్షేమ ఫలాలు అందించడం ప్రభుత్వ బాధ్యతని గవర్నర్‌ అన్నారు. గత పదేళ్ల పాలకుల వైఫల్యంతో యువతకు ఉపాధి, ఉద్యోగాల విషయంలో నిర్లక్ష్యం జరిగింది. యువత విషయంలో గత ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించింది. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన పక్రియ జరుగుతోంది. పక్రియ పూర్తి కాగానే ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ పక్రియ ప్రారంభం అవుతుంది. ఈ విషయంలో యువత ఎలాంటి అనుమానాలు, అపోహలకు గురికావద్దు. రైతుల విషయంలో తమ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంది. వరంగల్‌ డిక్లరేషన్‌ అమలుకు కార్యచరణతోపాటు, 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ అందిస్తున్నాం. రైతు భరోసా పథకాన్ని సంపూర్ణంగా అమలు చేయడానికి కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే చిన్న సన్నకారు రైతుల ఖాతాలలో రైతు భరోసా నిధులు జమ చేయడం జరిగింది. రూ.2 లక్షల రుణమాఫీకి సంబంధించి బ్యాంకులతో సంప్రదింపులు జరుగుతున్నామని అన్నారు. గత ప్రభుత్వం ఏనాడు సామాన్యు లకు అందుబాటులో లేదు. కష్టమొస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి మొన్నటి వరకు ఉండేది. పేదల కన్నీళ్లు తుడిచే నాధుడు లేని పాలన గతంలో చూశాం. ఇప్పుడు రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలనలో ఉంది. ప్రజా సమస్యలు ఆలకించేందుకు మంత్రులు అందుబాటులో ఉన్నారు. సచివాలయంలోకి సామాన్యుడు వచ్చి ముఖ్యమంత్రిని, మంత్రులను కలిసి సమస్యలు చెప్పుకునే స్వేచ్ఛ వచ్చింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణమైన పాలన మొదలైంది. ప్రజల హక్కులను, స్వేచ్ఛను గౌరవించే పాలన తెలంగాణ రాష్ట్రంలో ఉందని చెప్పేందుకు గర్విస్తున్నాను. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ స్పూర్తితో ప్రజా పాలన అడుగులు వేస్తోంది అని’ తన గవర్నర్‌ తమిళి సై సౌందర రాజన్‌ ప్రసంగించారు. బిన్న జాతులు, మతాలు, కులాల సమాహారంగా ఉన్న దేశంలో అందరినీ ఐక్యం చేసి, భారతజాతిగా నిలబెట్టిన ఘనత మన రాజ్యాంగానికి దక్కుతుంది. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ఒక లిఖిత రాజ్యాంగం రాసుకుని 74 ఏళ్లు దిగ్విజయంగా ఆ రాజ్యాంగ మార్గదర్శకత్వంలో దేశం ముందుకు సాగడం నిజంగా ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం అన్నారు. ఏ ప్రభుత్వమైనా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పాలన సాగించినప్పుడే ప్రజాస్వామ్య, సంక్షేమ, అభివృద్ధి ఫలాలు ప్రతి పేదవాడికి అందుతాయి. ఏకపక్ష నిర్ణయాలు, నియంత పోకడలు ఎప్పుడూ ప్రజాస్వామ్యానికి శోభనివ్వవు. కొత్తగా ఏర్పడిన ప్రజా ప్రభుత్వం ఈ స్పృహతో పని మొదలు పెట్టింది. సమాజంలోని అన్నీ వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కాలన్న లక్ష్యంతో పని చేస్తోందని అన్నారు. ప్రజా ప్రభుత్వం కొలువుదీరిన క్షణం నుంచి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే కార్యాచరణ మొదలైంది. ఆరు గ్యారెంటీలలో రెండు గ్యారెంటీలు ఇప్పటికే అమలులోకి వచ్చిన విషయం మీకు తెలుసు. దీనిలో భాగంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పధకంలో ఇప్పటి వరకు 11 కోట్ల పైబడి మహిళా సోదరీ మణులు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఉపయోగించుకోవడం ఎంతో సంతోషకరం. మిగిలిన గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేసి ప్రజల ముఖాల్లో ఆనందం చూడాలన్నది ప్రభుత్వ లక్ష్యం. గత పాలకుల నిర్వాకంతో ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నంగా మారినా, వ్యవస్థలు గాడి తప్పినా అన్నింటినీ సంస్కరించకుంటూ, సరిదిద్దుకుంటూ ముందుకు వెళుతున్నాం. తెలంగాణ అభివృద్ధిలో ప్రపంచంతో పోటీ పడేలా, సంక్షేమంలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించేలా రేవంత్‌ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పట్టుదలతో ముందుకు సాగుతోందన్నారు. ప్రజా ప్రభుత్వ తొలి ప్రాధాన్యత ప్రజా సంక్షేమమే. ప్రజల ఉద్యమ ఆకాంక్షలే ఈ ప్రభుత్వ ప్రాధాన్యాలు. ప్రతి అర్హుడికి సంక్షేమ ఫలాలు అందించడం ప్రభుత్వ బాధ్యత. అందుకే డిసెంబర్‌ 28 నుండి జనవరి 6 వరకు ప్రజల నుండి పథకాల కోసం దరఖాస్తులు స్వీకరించాం.ఈ కార్యక్రమంలో 1,25,84,383 దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి. వీటిలో ఐదు గ్యారెంటీలకు సంబంధించి 1,05,91,636 దరఖాస్తులు కాగా, ఇతర అభ్యర్థనలకు సంబంధించి 19,92,747 దరఖాస్తులు అందాయి. ఈ దరఖాస్తులను ప్రస్తుతం శాఖల వారిగా క్రోడీకరించి, కంప్యూటరీకరించి వాటి పరిష్కారానికి కార్యచరణ ప్రణాళిక రూపొందుతోందన్నారు. పెట్టుబడుల సాధన కోసం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సారథ్యంలోని బృందం దావోస్‌ లో జరిగిన వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సుకు హాజరు కావడం, గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.40,232 కోట్ల మేర పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకోవడం తెలంగాణ పురోగమనానికి సంకేతం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని, వారి బృందాన్ని అభినందిస్తున్నాను. ఈ ప్రయత్నం రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధికి… తద్వారా ఉపాధి అవకాశాల కల్పనకు ఉపకరిస్తుందని విశ్వసిస్తున్నాను. మహాత్మ జ్యోతి రావు పూలే ప్రజా భవన్‌ లో ప్రతి మంగళ, శుక్రవారాలు ప్రజావాణి పేరుతో ప్రజా సమస్యలు వినేందుకు మంత్రులు అందుబాటులో ఉంటున్నారు. సచివాలయంలో సామాన్యుడు సైతం వచ్చి ముఖ్యమంత్రిని, మంత్రులను కలిసి సమస్యలు చెప్పుకునే స్వేచ్ఛ వచ్చింది. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ స్పూర్తితో పేద, బడుగు, బలహీన వర్గాలు, గిజనులు, మైనారిటీ వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ప్రజా పాలన అడుగులు వేస్తోంది. ఇదే స్పూర్తితో ఇక ముందు కూడా పాలన సాగాలని, అభివృద్ధిలో తెలంగాణ అత్యున్నత శిఖరాలకు చేరాలని… సంక్షేమంతో ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలని మనసారా కోరుకుంటున్నాను. అంటూ అంబేద్కర్‌ చెప్పిన కొటేషన్‌తో తన ప్రసంగాన్ని గవర్నర్‌ ముగించారు. పరేడ్‌ గ్రౌండ్స్‌లో కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు