Friday, May 3, 2024

తెలంగాణ పందెం కోళ్లకు గిరాకీ

తప్పక చదవండి
  • ఆంధ్రాలో అమ్మకంతో లాభాలు

ఖమ్మం : సంక్రాంతి బరిలో తెలంగాణ కోళ్లు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇక్కడి కోళ్లకు గిరాకీ ఉండడంతో కోళ్లను పెంచిన వారు దండిగా సంపాదిస్తున్నారు. నల్లగొండ,వరంగల్‌,ఖమ్మం తదితర ప్రాంతాల నుంచి పందెంకోళ్లను కొనుక్కుని పోతున్నారు. అనేక కుటుంబాల వారు సుమారు 30 ఏళ్ల నుంచి ఇక్కడ పందెం కోళ్లను పెంచుతున్నారు. గతంలో స్థానికులు ఇక్కడ పందేలు ఆడేవారని, పోలీసుల దాడులు పెరగడంతోపాటు ఆర్థికంగా నష్టపోతుండడంతో వాటిని పక్కనపెట్టేశారు. ఒక్కో కోడి రూ.2,500 నుంచి రూ.10వేల వరకు ధర పలుకుతుందని పెంపకందారులు చెబుతున్నారు. వీటిల్లో పెట్టమర, నెమలి, కాకి డేగ, డేగ, రసంగి, పింగళి, పర్ల, పచ్చకాకి వంటి అనేక రకాల పందెం కోళ్లు ఉండగా ఇందులో ఎక్కువగా కాకి డేగ, పెట్టమర, రసంగి, పచ్చకాకి రకాలను మాత్రమే ఇక్కడ పెంచుతున్నారు. రంగు, రకం, బరువును బట్టి ధర పలుకుతుంది. వీటి పెంపకానికి పెట్టుబడి భారీగానే ఉంటుంది. రాగులు, సద్దలు, బాదం పలుకులు, కోడి గుడ్లు ఇలా మొత్తం ఒక్కో కోడికి ఏడాదికి రూ.రెండు వేలకు పైగానే ఖర్చు పెడతామని పెంపంకందారులు చెబుతున్నారు. ఇలా బలవర్ధకమైన ఆహారంతో ఏడాదిలో 3 నుంచి 4 కిలోల బరువు వచ్చేలా చూస్తారు. బరువు ఇంతకు తక్కువైనా, ఎక్కువైనా అవి పందేలకు పనికిరావు. కొన్ని కోళ్లు పెరిగిన తర్వాత రోగాల బారిన పడి చనిపోతాయి. కోళ్ల పెంపకం ఇక్కడి వారికి ఉపాధిగా మారింది. చెరుకు కొట్టే పనులకు ఆంధ్రా ప్రాంతానికి వెళ్లిన ఇక్కడి కూలీలు పందెం కోళ్లను గ్రామానికి తెచ్చుకున్నారు. వలసకు వెళ్లగా ఇంటి వద్ద ఉన్న వారు ఈ కోళ్ల పెంపకాన్ని వ్యాపకంగా చేసుకొని దీనిని వ్యాపారంగా చేసుకుని డబ్బులు సంపాదించుకుంటారు. సంక్రాంతి సందర్భంగా ఏటా ఈ గ్రామం నుంచి పెద్ద సంఖ్యలో పందెం కోళ్లు ఆంధ్రా ప్రాంతానికి తరలుతాయి. ఒక్క పండుగ రోజుల్లోనే కాకుండా ఇతర పండుగలు, సాధారణ రోజుల్లోనూ ఆంధ్రా నుంచే పందెం రాయుళ్లు వచ్చి ఇక్కడి కోళ్లను కొనుగోలు చేస్తారు. ఒక్కో పందెం కోడి పెట్ట ఏడాదికి నాలుగు ఈతలలో అనేక గుడ్లు పెట్టినా.. అందులో 20 నుంచి 30 గుడ్లు పిల్లలుగా మారుతున్నాయి. వాటిని తిరిగి పొదిగిస్తున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు