- అట్టహాసంగా ప్రారంభించిన పథకం అధోగతి..!
- అభాసుపాలవుతున్న అద్భుత పథకం..
- దళితుల మధ్య వైషమ్యాలు పెంచుతున్న దళితబంధు..
- ఓట్లకోసం ఆడిన డ్రామా రివర్స్..
- ఏ ఒక్కరికో ఇద్దరికో ఇచ్చి మిగతావాళ్లకు మొండిచెయ్యి..
- దళితబంధు కోసం రోడ్లెక్కుతున్న దళిత కుటుంబాలు..
- ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉసూరుమంటున్న వైనం..
- ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ హీటేక్కిస్తున్న ఆందోళనలు..
- అసలే అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో ఇలాంటి పథకాలు
సాధ్యపడని విషయం ప్రభుత్వానికి తెలియదా..?
( తెలంగాణ రాష్ట్రంలో దళితబంధు పతాకంపై “బీవీఆర్ రావు అందిస్తున్న ప్రత్యేక కథనం )
దళితుల అభ్యున్నతి కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన దళితబంధు పధకం.. ఇప్పుడు దళితుల కుటుంబాల్లో అంతులేని వైషమ్యాలను సృష్టిస్తోంది.. పైగా ఈ పథకం ద్వారా స్థానిక లీడర్లు, ఎమ్మెల్యేలతో సహా లబ్ధిపొందారన్నది జగమెరిగిన సత్యమే.. ఈ విషయం ముఖ్యమంత్రి కూడా ప్రస్తావించి, అలాటివి సహించబోమని హెచ్చరించిన విషయం కూడా విదితమే.. అయినా దోచుకోవడం ఆగలేదు.. చివరికి ఆగమాగమైన చరిత్రను చూస్తున్నాం.. అసలు ప్రభుత్వం నడపడానికి నిధులు లేని తరుణంలో దళితబంధు లాంటి పథకం సాధ్యపడుతుందా అన్న ఆలోచన ప్రభుత్వానికి రాకపోవడం దురదృష్టం..
దళిత జనోద్ధరణే ధ్యేయంగా చెప్పుకుంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అట్టహాసంగా ప్రకటించిన దళితబంధు పథకం ఆదిలోనే అపహాస్యం పాలైంది.. ఆయన తమ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడెకరాల భూమి లాంటి వాగ్ధానాలు విమర్శలకు దారి తీయడంతో.. దళితబంధు పథకాన్ని తెరమీదకు తీసుకుని వచ్చారు.. తొమ్మిదేళ్లుగా లేనిది ఎన్నికలు దగ్గర పడేసరికి ఆగ మేఘాలమీద ఈ పథకాన్ని ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.. అయితే ఈ నిర్ణయం దళితుల్లో ఎంతో ఆశను రేకెత్తించింది.. తమ జీవితాలు ఈ విధంగానైనా బాగుపడతాయని అనుకున్నారు.. ఈ క్రమంలో వారు దళిత ముఖ్యమంత్రి, మూడెకరాల భూమి లాంటి విషయాలను దాదాపు మరచిపోయారనే చెప్పవచ్చు.. ఇంతవరకు బాగానే ఉంది. తన పాచిక పారిందని దొరవారు లోలోపల సంతోషపడ్డా.. ఆచరణకు అనువుగాని పథకం అని ఆయన ఆలోచించకపోవడం శోచనీయం.. రాష్ట్రం లోని ప్రతి దళిత కుటుంబానికీ దళితబంధు అందిస్తామని, ఇది దేశంలోనే చిరశ్మరణీయమైన పథకం అంటూ పలు సందర్భాల్లో ముఖ్యమంత్రితో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పడం చూసాం.. దళితబంధు పథకంలో భాగంగా పైలట్ ప్రాజెక్ట్ ను హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రారంభించాలని సీఎం కేసీఆర్ తలపెట్టినా.. కోర్టు కేసుల నేపథ్యంలో దత్తత గ్రామం వాసాలమర్రిలో అమలు చేశారు.. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక మార్గదర్శకాలు విడుదల చేసింది. జిల్లా, మండలం, గ్రామ స్థాయిల్లో కమిటీలను నియమించి ఈ పథకం అమలును చేపట్టింది..
దళితుల కోసం 2021 సంవత్సరం బడ్జెట్‌లో ‘సీఎం దళిత్ ఎంపవర్‌మెంట్ స్కీం’ పేరుతో వెయ్యి కోట్లు కేటాయించనున్నట్లు 2021, ఫిబ్రవరి 10న నల్లగొండ జిల్లా హాలియాలో జరిగిన బహిరంగసభలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రకటించారు. 2021లో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో దళిత ఎంపవర్‌మెంట్ స్కీం కోసం వెయ్యి కోట్లు ప్రవేశపెట్టారు. కాగా 2021, జూలై 18న సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో ‘దళిత సాధికారత అమలు పైలట్ ప్రాజెక్టు ఎంపిక అధికార యంత్రాంగం విధులు’ అనే అంశంమీద ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈ పథకానికి ‘తెలంగాణ దళితబంధు పథకం’ అనే పేరును కేసీఆర్ ఖరారు చేశారు కేఈఎం కేసీఆర్.. ఈ పథకం అమలు, పర్యవేక్షణ, నిర్వహణ, విజయం సాధించే దిశగా తీసుకోవాల్సిన కార్యాచరణపై 2021, జూలై 26న ప్రగతి భవన్ లో తొలి అవగాహన సదస్సును జరిగింది. కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో హుజూరాబాద్ నియోజకవర్గంలోని గ్రామానికి నలుగురు చొప్పున (ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు), ప్రతి మున్సిపాలిటీలోని ఒక్కో వార్డు నుంచి నలుగురు చొప్పున (ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు) మొత్తం 412 మంది దళిత పురుషులు మహిళలు, 15 మంది రిసోర్సు పర్సన్స్ ఈ అవగాహన సదస్సులో పాల్గొన్నారు.
2021, ఆగస్టు 4న యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కెసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రకటించాడు.. 2021 ఆగస్టు 16న కేసీఆర్ చేతుల మీదుగా లబ్దిదారునికి 10 లక్షల రూపాయల ఉచిత గ్రాంటు ఇవ్వబడింది. ప్రతి సంవత్సరం ఆగస్టు 16వ తేదీన దళితబంధు వేడుకలను ఘనంగా జరుతున్నారు. ప్రతి సంవత్సరం 2 లక్షల మందికి ఈ పథకాన్ని అమలు చేసేలా వార్షిక బడ్జెటులో 20 వేల కోట్లను కేటాయించడం జరిగింది.. అయితే ఆ తరువాత దళితబంధు కేటాయింపులను స్థానిక ఎమ్మెల్యేల పరిధిలోకి తీసుకుని వచ్చారు.. ఇక్కడే అసలు కథ మొదలైంది.. దళితబంధు పథకాన్ని కేవలం అధికార పార్టీకి చెందిన దళితులకే కేటాయించడం.. అందులో స్థానిక అధికార పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు లంచాలు తీసుకుంటున్నారనే విమర్శలు రాష్ట్ర వ్యాప్తంగా వెల్లువెత్తాయి.. దీనిపై ప్రతిపక్షాలైన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కూడా పలుమార్లు జరుగుతున్న అవకతవకలను ఎత్తిచూపడం కూడా జరిగింది.. అయినా సరే ఏ విమర్శలను పట్టించుకోకుండా అధికార ప్రభుత్వం మొండి వైఖరి అవలంభించడం చూస్తూనే ఉన్నాం.. ఇదంతా ఒక కథ అయితే.. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు మరో స్థాయికి చేరాయని చెప్పవచ్చు.. గ్రామంలో, మండలంలో, నియోజకవర్గాల స్థాయిలో ఏ ఒక్కరికో, ఇద్దరికో దళితబంధు అమలుచేసి, ఆశగా ఎదురు చూస్తున్న మిగతా దళిత సోదరుల కుటుంబాలకు మొండి చేయి చూపడంతో.. దళితుల్లో వారిలో వారికే శత్రుత్వం నెలకొంటోంది.. ఈ పరిణామం ఎంతవరకు దారితీస్తుంది అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది… ఏ కొద్ది మందికో అమలైన దళితబంధు పథకం అధికార పార్టీకి ఓట్లను తెచ్చిపెడుతుందా..? అంటే సమాధానం లేదు.. మిగతావారు అధికార పార్టీకి ఓట్లు వేస్తారా..? అన్నది కూడా అనుమానాస్పదమే.. ఈ పరిస్థితులు అధికార బీ.ఆర్.ఎస్. పార్టీకి తలనొప్పిని తెచ్చిపెడుతోంది అన్నది కూడా వాస్తవమే..
దళితబంధు కోసం రోడ్లెక్కి నిరసనలు తెలుపుతున్న సంఘటనలు రాష్ట్రవ్యాప్తంగా రోజు రోజుకీ పెరిగిపోతుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.. ఏరి కోరి తనకు తాను తెచ్చిపెట్టుకున్న సమస్యగా కేసీఆర్ కి పరిణమించింది అంటున్నారు విశ్లేషకులు.. సమస్య చిలికి చిలికి గాలివానగా మారకముందే ముఖ్యమంత్రి ఈ సమస్యకు పరిష్కారం కనుగొనగలడా..? అన్నది అంతుబట్టని విషయంగా మారింది.. దళితబంధు పథకాన్ని అడ్డుపెట్టుకుని లక్షల్లో సంపాదించిన అధికార పార్టీ నాయకులను కేసీఆర్ ఎలా కట్టడిచేయగలడు..? అన్నది ఆసక్తికరంగా మారింది.. దళితబంధు రేపిన చిచ్చు అధినేతకు మైనస్ గా మారుతోంది అన్నది రాజకీయ విశ్లేషకుల వాదన.. చూడాలి మరి ఎలాంటి పరిణామాలు చోటుచేసుకోనున్నాయో..?