Sunday, December 10, 2023

తెలంగాణలో ఎకరం అమ్మితే.. ఏపీలో 50 ఎకరాలు..

తప్పక చదవండి

హైదరాబాద్‌ నిర్మాణానికి తానే ముగ్గుపోసానని చెప్పుకునే చంద్రబాబునాయుడు.. పదే పదే తనను తాను ప్రపంచ నిర్మాతగా ప్రకటించుకునే చంద్రబాబునాయుడు.. అత్యధిక కాలం పరిపాలించిన ముఖ్యమంత్రిగా చెప్పుకొనే చంద్రబాబునాయుడు.. రాష్ట్రపతి, ప్రధానులను తానే నియమించానని చెప్పుకునే చంద్రబాబునాయుడు.. ఇన్నాళ్లకు ఆయన నోటివెంట ఒక నిక్కమైన, నిజమైన మాటొకటి వచ్చింది. ‘ఒకప్పుడు ఆంధ్రాలో ఒక ఎకరం అమ్మితే తెలంగాణలో నాలుగెకరాలు కొనేవాళ్లు. ఇప్పుడు తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రాలో యాభై ఎకరాలు, వందెకరాలు కొనే పరిస్థితి వచ్చింది’ అని బాబు వ్యాఖ్యానించారు. సోమవారం తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో టీడీపీ అధినేత రెండు రాష్ర్టాల్లో భూముల విలువను పోల్చుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పైకి చూస్తే చంద్రబాబు వ్యాఖ్య ప్రశంసలా కనిపిస్తుంది కానీ, కాదు. తెలంగాణవాళ్లకు బతకడం, బట్టకట్టడం, వరి అన్నం తినడం నేర్పామంటూ పలు సందర్భాల్లో అహంకారం చూపిన నోరు కదా అది. ఆధిపత్య అహంకారాన్ని అణువణువునా నింపుకొన్న బాబు తన స్వభావానికి భిన్నంగా ఎక్కడైనా, ఎప్పుడైనా తెలంగాణను ప్రశంసిస్తడా? ఆయన జీవితకాలంలో ఆ పనిచేస్తడా? అందునా కేసీఆర్‌ను పొరపాటునైనా బాబు ప్రశంసిస్తడా? అదే ఆలోచించాల్సిన విషయం. అర్థం, అవగతం చేసుకోవాల్సిన విషయం. మరి చంద్రబాబు ఈ మాటలు ఎందుకు అన్నారు? వీటి లోతేమిటి? లోగుట్టేమిటి? అంతరార్థమేమిటి? అసలు సంగతేమిటి? తెలంగాణ అంటే బాబుకు మొదటినుంచీ అవమానం. బాబు అంటేనే తెలంగాణకు మొదటినుంచీ అనుమానం. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో నలిగిన తెలంగాణకు సమైక్యపాలకుల నల్లికుట్ల వ్యవహారాలు, నక్కజిత్తుల పన్నాగాలు, నంగి మాటలు బాగా ఎరుక. రాష్ట్ర ఏర్పాటును బలంగా వ్యతిరేకించిన చంద్రబాబు..

ప్రపంచంలోనే ఎక్కడాలేని ‘రెండుకండ్ల సిద్ధాంతం’ చివరిదాక వల్లెవేసిన ఉదంతాన్ని తెలంగాణ సమాజం ఎప్పటికీ మరిచిపోలేదు. తెలంగాణ ఏర్పాటును చివరి నిమిషం దాకా అడ్డుకున్న చంద్రబాబు స్వరం అనూహ్యంగా ఎందుకు మారింది? అవకాశం చిక్కినప్పుడల్లా తెలంగాణపై విషం చిమ్మే చంద్రబాబు ఇప్పుడు అనివార్యంగా ఇక్కడి అభివృద్ధిని ఎందుకు కొనియాడుతున్నారు? బాబు మాటల్లోని మర్మమేమిటి? తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే ఏపీలో యాభై, వందెకరాలు కొనుక్కోవచ్చునంటూ టీడీపీ అధినేత చెప్పిన మాట ముమ్మాటికీ నిజం. అయితే ఆయన తెలంగాణను మనస్ఫూర్తిగా పొగుడుతున్నడా? లేక తెలంగాణ అభివృద్ధి మీదికి ఇతరులను రెచ్చగొడుతున్నడా? ఒకవేళ రెచ్చగొట్టడమే అయితే.. ఎవరిని ఎవరి మీదికి ప్రయోగించాలని చంద్రబాబు చూస్తున్నారు? తన వ్యాఖ్యల ద్వారా మానిన గాయాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు చంద్రబాబు. తద్వారా తన కుట్రపూరిత స్వభావాన్ని మరోమారు బయటపెట్టుకున్నారు. సహోదరుల్లా బతుకుతున్న వాళ్ల మధ్య, ఇరు రాష్ర్టాల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టాడానికి తొలి పాచిక విసిరిండు. తంపులు పెట్టి.. మళ్లీ తెలంగాణలో అడుగుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సందుదొరికితే దూరిపోవాలని చూస్తున్నారు. ఆ దిశగానే భూముల విలువపై బాబు ఒక విషపు పాచిక విసిరారు. ఆయన పాచికలు ఇక పారవన్న సంగతి అందరికీ తెలిసిందే. మరి 2020 విజన్‌ కలిగిన, ప్రపంచంలోనే సాటిలేని పరిపాలకుడైన చంద్రబాబు నాయుడు, తాను సుదీర్ఘకాలం సమైక్య రాష్ర్టాన్ని పరిపాలించానని చెప్పుకునే చంద్రబాబు మరి తన పాలనలో తెలంగాణ ప్రాంతాన్ని ఈ తరహాలో ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారు? తన ఏలుబడిలో తెలంగాణ పతారను పెంచి, ఇక్కడి భూమి విలువను ఎందుకు పెంచలేకపోయారు? ఈ గడ్డను మట్టిగడ్డగానే ఎందుకు ఉంచారు? బంగారు తునకగా మార్చే పని మనస్ఫూర్తిగా తన ఏలుబడిలో ఏనాడూ ఎందుకు చేయలేదు? ఇప్పుడు మరో ముసుగులో ఆయన తెలంగాణకు వచ్చే ప్రయత్నం చేస్తున్నడు. ఆయనను రానిచ్చామా.. అంతే సంగతి! తెలంగాణ మళ్లీ వెనక్కి నడిచి చంద్రబాబు కాలానికి వెళ్తుంది. బాబుకాలం కానికాలం. కష్టకాలం. కరువుకాటకం. చంద్రబాబు చెప్పినట్టుగానే.. ‘ఎకరం భూమి పొరుగు రాష్ర్టాల్లో 50వ వంతు ధరకూడా పలుకని’.. దుర్భిక్షపు, దౌర్భాగ్యపు కాలం! దశాబ్ది సంబురాల తెలంగాణకు అవసరమా ఆ దరిద్రం?

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు