Tuesday, May 7, 2024

సివిల్‌ కానిస్టేబుల్‌ నియామకాలకు బ్రేక్‌

తప్పక చదవండి
  • 4 ప్రశ్నలను తొలగించి మరోసారి మూల్యాంకనం చేయాలని డిమాండ్‌

హైదరాబాద్‌: తెలంగాణలో సివిల్‌ కానిస్టేబుల్‌ నియామకాలకు హైకోర్టు తాత్కాలిక బ్రేక్‌ వేసింది. ఇటీవల నిర్వహించిన పరీక్షలో 4 ప్రశ్నలను తొలగించి.. మరోసారి మూల్యాంకనం చేయాలని పోలీస్‌ నియామక మండలిని ఆదేశించింది. ఉన్నత న్యాయస్థానం తీర్పుతో నియామక ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ప్రశ్నలను తెలుగులో అనువాదం చేయకపోవడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. సివిల్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాల కోసం నిర్వహించిన రాత పరీక్షల్లో ఇచ్చిన ప్రశ్నల్లో.. తెలుగులోకి అనువాదం చేయకపోవడం వల్ల నష్టపోయామని హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఆంగ్లంలో ఇచ్చిన ఐచ్చికాలు వాడుకలో ఉన్నవేనని పోలీస్‌ నియామక మండలి వాదించింది. ఆంగ్ల పదాలను తెలుగులో అనువాదం చేసే అవకాశం ఉన్నా.. పరిగణలోకి తీసుకోకపోవడాన్ని కోర్టు తప్పు పట్టింది. 4 ప్రశ్నలను తొలగించి.. ఆ తర్వాత మూల్యాంకనం చేయాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పుతో నియామక ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో మొత్తం 4,965 సివిల్‌ కానిస్టేబుల్‌ పోస్టులను భర్తీ చేసేందుకు పోలీస్‌ నియామక మండలి గతేడాది ఏప్రిల్‌ 25న నోటిఫికేషన్‌ జారీ చేసింది. అనంతరం నిర్వహించిన రాత పరీక్షలకు దాదాపు 5 లక్షల మంది హాజరయ్యారు. ఈ పరీక్ష ప్రశ్నాపత్రంలో 4 ప్రశ్నలను తెలుగులోకి అనువాదం చేయకపోవడంతో పాటు మరికొన్ని తప్పుగా ఉన్నాయని పలువురు అభ్యర్థులు ఆరోపించారు. వాటిని తొలగించాలంటూ నియామక మండలికి వినతి పత్రం సమర్పించినా పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. వేర్వేరుగా 6 పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్‌ పి.మాధవీ దేవి సోమవారం విచారణ చేపట్టారు. ప్రశ్నపత్రంలో 4 ప్రశ్నలకు తెలుగులో అనువాదం చేసే అవకాశం ఉన్నప్పటికీ.. అలా చేయలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు చిల్లా రమేశ్‌ తదితరులు వాదనలు వినిపించారు. అభ్యర్థులకు ఇంగ్లీష్‌ అర్థం కాకపోవడంతో ఆ క్వశ్చన్స్‌ను వదిలేసే పరిస్థితి ఎదురైందని కోర్టుకు తెలిపారు. దీంతోపాటు మరికొన్ని ప్రశ్నలూ తప్పుగా వచ్చాయని చెప్పారు. ఓ ప్రశ్నలో పారాదీప్‌ పోర్టు అథారిటీకి బదులు ప్రదీప్‌ పోర్టు అథారిటీ అని ఇచ్చారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని, వారు అధ్యయనం చేసి దానిపై తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా నియామకాలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఆ 4 ప్రశ్నలకు ఇచ్చిన ఐచ్ఛికాలు వాడుకలో ఉన్న ఆంగ్ల పదాలేనని ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. అందరూ వాటినే ప్రముఖంగా వాడుతున్నారని చెప్పారు. ఒక అక్షరం అచ్చు తప్పు పడిరదని, అయితే అది పెద్ద తప్పేమీ కాదని సమర్థించుకున్నారు. ఇరు పక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి జస్టిస్‌ పి.మాధవీ దేవి.. ప్రశ్నపత్రంలోని 57, 122, 130, 144 ప్రశ్నలను తొలగించాలని ఆదేశించారు. ప్రశ్నపత్రం రూపొందించడంలో నియామక మండలి సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడాన్ని న్యాయమూర్తి తీవ్రంగా తప్పుబట్టారు. ఈ క్రమంలోనే తెలుగు అనువాదం లేని 122, 130, 144 ప్రశ్నలు, తప్పుగా ఉన్న 57వ ప్రశ్నను తొలగించాలంటూ పోలీస్‌ నియామక మండలిని ఆదేశించారు. ఈ మేరకు పిటిషన్లను అనుమతిస్తూ తీర్పు వెలువరించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు