Tuesday, May 21, 2024

పోస్టుల భర్తీపై ఏపీపీఎస్సీ ముందు జాగ్రత్త!

తప్పక చదవండి
  • పైసలిస్తేనే పరీక్షలు..
  • ఏపీ సర్కారుకు తేల్చి చెప్పిన పబ్లిక్ సర్వీస్ కమిషన్..

అమరావతి : ‘‘ముందు డబ్బు చేతిలో పెట్టండి తర్వాత ఏర్పాట్లు చేస్తాం’’- ఇదీ కొద్ది నెలల కిందట సీఎం జగన్‌ హాజరయ్యే సభ నిర్వహణకు ఈవెంట్‌ మేనేజర్లు పెట్టిన కండిషన్‌. పనిచేసిన తర్వాత డబ్బులు ఎప్పుడిస్తారోనన్న అనుమానం జగన్‌ హయాంలో బాగా పెరిగిపోయింది. అందుకే పెద్ద పెద్ద కాంట్రాక్టర్ల నుంచి చిన్నపాటి ఈవెంట్‌ మేనేజర్ల వరకు బిల్లుల విషయంలో ముందుగానే జాగ్రత్త పడుతున్నారు. ఇప్పుడు ఏపీపీఎస్సీ కూడా ఇదే బాటపట్టింది. పైసలిస్తేనే పరీక్షలు నిర్వహిస్తామని సర్కారుకు తేల్చి చెప్పింది. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి రాత పరీక్ష నిర్వహణ బాధ్యతలను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్సీ)కి అప్పగించారు. అయితే, ఈ పరీక్షలను నిర్వహించాలంటే ముందుగా నగదు తమ ఖాతాలో జమ చేయాలని ఏపీపీఎస్సీ నిబంధన విధించింది. ఈ మేరకు లెక్కలతో సహా ఉన్నత విద్యామండలికి లేఖ రాసింది. ఆయా పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్ధమైనా అసలు ఇంత వరకు యూనివర్సిటీలు సంబంధిత నోటిఫికేషన్లు జారీ చేయలేదు. గత రెండు నెలల నుంచి పదే పదే నోటిఫికేషన్ల జారీ ఆగిపోతోంది. ఇటీవల కూడా ఈ నెల 20న నోటిఫికేషన్లు ఇస్తామన్న ఉన్నత విద్యామండలి మరోసారి వాయిదా వేసింది. దీంతో ఇంత వరకూ నోటిఫికేషన్లపైనే స్పష్టత లేదు. మరోవైపు, ఏపీపీఎస్సీ పరీక్షల నిర్వహణకు నగదు జమ చేయాలంటూ లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. 18 యూనివర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, ఆర్జీయూకేటీల్లో అధ్యాపకుల పోస్టుల భర్తీ కోసం రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఈ బాధ్యతను ఏపీపీఎస్సీకి అప్పగించారు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, లెక్చరర్‌ పోస్టులు సుమారు 2వేల వరకు ఉంటాయని అంచనా వేశారు.

ఈ పోస్టులకు 35 వేల మంది అభ్యర్థులు పరీక్షలు రాసే అవకాశం ఉందని భావించి ఆ మేరకు నగదు చెల్లించాలని ఏపీపీఎస్సీ కోరింది. ఒక్కొక్క అభ్యర్థి పరీక్ష నిర్వహణకు రూ.1,500 ఖర్చు అవుతుందని, ఆ మేరకు రూ.5.25 కోట్లను వెంటనే ఏపీపీఎస్సీ ఖాతాలో జమచేయాలని కమిషన్‌ కార్యదర్శి కోరారు. అయితే, అసలు నోటిఫికేషన్లే ఇవ్వని పరీక్షలకు ఇంత హడావుడిగా నగదు బదిలీ ఏంటనే ప్రశ్నలు తెలెత్తుతున్నాయి. సాధారణంగా ఏపీపీఎస్సీ నిర్వహించే పోటీ పరీక్షలకు ప్రభుత్వం నిధులు ఇస్తుంది. ఆయా శాఖల్లో పోస్టులు భర్తీ చేసినందుకు ఆ శాఖలు నగదు ఇవ్వవు. కానీ, యూనివర్సిటీల్లో పోస్టులను వర్సిటీలే భర్తీ చేసుకుంటున్నాయి. ఏటా నిర్వహించే ఎంసెట్‌, ఈసెట్‌, ఐసెట్‌, ఎడ్‌సెట్‌ లాంటి అనేక సెట్లు యూనివర్సిటీలే నిర్వహిస్తున్నాయి. దీంతో ఏపీపీఎస్సీతో అవసరం లేకుండా పోయింది. కాగా, ఇప్పుడు యూనివర్సిటీలతో కాకుండా ఏపీపీఎస్సీ ద్వారా రాత పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికిగాను ఇటీవల ఏపీపీఎస్సీతో ఉన్నత విద్యామండలి ఒప్పందం చేసుకుంది. దాని ప్రకారం నగదు ఇవ్వాలని ఏపీపీఎస్సీ కోరుతోంది. అయితే, ముందు పరీక్షలు నిర్వహించి, ఎంతమంది రాశారో అంతమందికి తర్వాత నగదు అడగొచ్చు కదా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 35 వేల మంది కంటే తక్కువ మంది పరీక్షలు రాస్తే నిధుల వ్యత్యాసంపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఏపీపీఎస్సీ తన లేఖలో పేర్కొంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు