- సంచలన నిర్ణయం ప్రకటించిన సుశీల్ కుమార్ షిండే..
- కుమార్తె ప్రణతి రాజకీయ అరంగేట్రం..
న్యూ ఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత సుశీల్ కుమార్ షిండే క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ 82 ఏళ్ల సుశీల్ కుమార్ షిండే రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించారు. అయితే క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నప్పటికీ పార్టీకి అవసరమైనప్పుడు అందుబాటులో ఉంటానని ఆయన తెలిపారు. కాగా షిండే రాజకీయ వారసురాలిగా ఇప్పటికే ఆయన కూతురు ప్రణితి షిండే ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు . రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో తన బదులు తన కూతురు ప్రణితి తన నియోజకవర్గమైన షోలాపూర్ నుంచి పోటీ చేస్తారని షిండే వెల్లడించారు. ఈ మేరకు ఓ జాతీయ ఛానెల్‌తో మాట్లాడిన షిండే రిటైర్మెంట్ విషయాన్ని ప్రకటించారు. “నేను క్రియాశీల రాజకీయాల నుంచి రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నాను. రాజకీయాల నుంచి తప్పుకున్నప్పటికీ పార్టీకి అవసరమైనప్పుడు అందుబాటులో ఉంటాను. రెండేళ్ళ క్రితమే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇందులో కొత్తేమీ లేదు.” అని ఆయన తెలిపారు. ఈ క్రమంలో తన కుమార్తె ప్రణితి షిండే తన స్థానంలో షోలాపూర్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. కాగా 42 ఏళ్ల ప్రణితి షిండే ఇప్పటికే షోలాపూర్ సిటీ సెంట్రల్ అసెంబ్లీ స్థానం నుంచి మూడుసార్లు శాసనసభ్యురాలుగా ఎన్నికయ్యారు. ‘‘నేను షోలాపూర్ నుంచి ఎన్నికల్లో పోటీ చేసేవాడిని. ఇప్పుడు నా కూతురు ఆ స్థానం నుంచి పోటీ చేయాలనేది నా కోరిక. ఇదే విషయాన్ని పార్టీకి తెలియజేశాను.’’ అని పేర్కొన్నారు. అయితే చివర్లో ఎవరు పోటీ చేయాలనేది ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయిస్తుందని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఫలానా స్థానం నుంచి పోటీ చేయాలని తమ కోరికను వ్యక్తం వ్యస్తున్నారని ఈ సందర్భంగా షిండే చెప్పుకొచ్చారు. కాగా సుశీల్ కుమార్ శంభాజీ షిండే 1941 సెప్టెంబర్ 4న మహారాష్ట్రలో జన్మించారు. రాజకీయాల్లో అనేక కీలక పదవులను చేపట్టారు. షోలాపూర్ లోక్‌సభ స్థానం నుంచి మూడు పర్యాయాలు ఎంపీగా ఎన్నికయ్యారు. జనవరి 2003 నుంచి నవంబర్ 2004 మధ్య మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2006 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. యూపీఏ రెండో సారి అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర మంత్రి వర్గంలో ఆయనకు చోటు దక్కింది. మన్మోహన్ సింగ్ హయాంలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రిగా పని చేశారు. 26/11 ముంబై దాడుల తర్వాత హోం మంత్రిగా పని చేసిన పి చిదంబరం ఆర్థిక మంత్రిత్వ శాఖకు మారారు. దీంతో ఆ పదవిని షిండే చేపట్టారు. 2012లో కేంద్ర హోంమంత్రిగా విధులు నిర్వర్తించారు. సుశీల్ కుమార్ షిండే 2014 వరకు ఈ పదవిలో కొనసాగారు.