Friday, July 19, 2024

అమోయ్ రూ. 25వేల కోట్ల భూ మాయ..!

తప్పక చదవండి
 • రంగారెడ్డి జిల్లాలో రూ.వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములకు పట్టాలు
 • కీలక సూత్రాధారిగా పాత కలెక్టర్ డి. అమోయ్ కుమార్
 • కోర్టులు, వివాదాలను లెక్క చేయని వైనం
 • ప్రభుత్వ, భూదాన్ ల్యాండ్స్ మాయం
 • సప్లిమెంటరీ సెత్వార్ల తయారీకి సహకారం
 • బీఆర్ఎస్ ముఖ్యనేతలకు ఆయాచిత లబ్ధి
 • దగ్గరుండి దొంగలకు సద్దికట్టిన కలెక్టర్ డి. అమోయ్
 • సంపూర్ణ సహకారమందించిన సీసీఎల్ఏ
 • అమయ్ అవినీతిలో పాలు పంచుకున్న అప్పటి తహశీల్దార్ వంశీమోహన్, ఏడీ శ్రీనివాసులు
 • రంగారెడ్డి జిల్లాల భూములపై కొత్త సర్కార్ నజర్..పెడితే అవినీతి తిమింగలాల బండారం బయటపడే ఛాన్స్ .

హైదరాబాద్ : యధారాజా తధా ప్రజా అంటారు పెద్దలు. ఇది మన ఐఎఎస్ డి. అమోయ్ కుమార్ అక్షరాల పాటించేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలే గంజ దొంగ పనులు చేయగా.. వారికి జీ హుజురు అంటూ అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా పనిచేసిన అమోయ్ ప్రభుత్వ భూములు, భూదాన్ భూములకు పట్టాలిచ్చి పక్కాగా దొంగలకు సద్దికట్టేశారు. నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గన్నట్లు ఈయనకు ఇద్దరు అవినీతి సబార్డినేట్ అధికారులు తోడయ్యారు. అమోయ్ కుమార్ కు అప్పటి రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం తహశీల్దార్ వంశీమోహన్, ఏడీ శ్రీనివాసులు తమ సంపూర్ణ సహకారమందించారు. వెరసి రంగారెడ్డి జిల్లాలో అక్రమంగా రూ.వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములకు పట్టాలొచ్చేశాయి. వాటికి అప్పటి బీఆర్ఎస్ సర్కార్ లోని పెద్దలు, వారి బినామీలు యాజమానులయ్యారు.

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి, గండిపేట్, శంకరపల్లి, మహేశ్వరం మండలాల్లో ఈ అవినీతి భూ స్కాం జరగడం గమనార్హం. హైదరాబాద్, దానికి అనుకొని ఉండే ఈ మండలాల్లోని భూములను అప్పటి కలెక్టర్ అమోయ్ కుమార్, ఆయన తాబేదార్ ఆఫీసర్లు కలిసి దొంగ పట్టాలివ్వడం శోచనీయం. అమోయ్ నిర్వాహకం వల్ల సుమారు రూ.25 నుంచి రూ.30 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు బీఆర్ఎస్ పెద్దలు, వారి బినామీల పాలయ్యాయి. ఈ విషయంలో అమోయ్ కుమార్ సుప్రీం, హైకోర్టు ఆదేశాలను సైతం బేఖాతర్ చేయకపోవడం విస్మయం కల్గిస్తోంది. అంతేకాక సప్లిమెంటరీ సెత్వార్లను తయారీ చేయించి అత్యంత విలువైన ల్యాండ్స్ అన్యక్రాంతం అయ్యేలా సహకరించడం చిత్రంగా ఉంది.

- Advertisement -

అమోయ్ కుమార్ లీలలు..!

 1. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గుట్టల బేగంపేట్ గ్రామం సర్వే నెంబర్ 63లో ప్రభుత్వానికి 42 ఎకరాల సర్కార్ భూమి ఉండేది. ఈ ప్రాంతంలో ఎకర భూమి విలువ సుమారు రూ.50 కోట్లు ఉంటుంది. అంటే ఈ మొత్తం భూమి విలువ బహిరంగ మార్కెట్లో సుమారు రూ.2,100 కోట్లు ఉంటుంది. సెత్వార్ రికార్డులను పరిశీలిస్తే ఇప్పటికీ ఈ భూమి సర్కార్ ల్యాండ్ గానే రికార్డ్ లకు నమోదై ఉంది. దీనిపై ప్రస్తుతం ఓ ప్రైవేట్ కంపెనీ తరపున కోర్టులో కేసు నడుస్తోంది. అయితే ఈ పంచాదీ కోర్టులో ఉండగానే అప్పటి కలెక్టర్ అమయ్ గతేడాది 2022 డిసెంబర్ లో దీనికి పట్టాలిచ్చేశారు.

2.అలాగే శేరిలింగంపల్లి మండలం గోపన్ పల్లిలోని సర్వే నెంబర్ 124/10,11లలో ప్రభుత్వానికి 50 ఎకరాల ల్యాండ్ ఉంది. దీని విలువ బహిరంగ మార్కెట్లో ఎకరం రూ.40 కోట్ల చొప్పున పలుకుతుంది. ఈ లెక్కన ల్యాండ్ విలువ ఓపెన్ మార్కెట్ లో సుమారు రూ.2 వేల కోట్ల వరకూ ఉంటుంది. అయితే ఇంతటి విలువైన భూమికి తమకు ఎన్వోసీ ఇవ్వాలని గతంలో సిరిస్ అనే కంపెనీ సీసీఎల్ఏకు దరఖాస్తు పెట్టుకోగా.. అప్పట్లో ఆ కంపెనీ అప్లికేషన్ ను రిజెక్ట్ చేయబడింది. కానీ, మన అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ దీన్ని పట్టా భూమిగా మార్చేసి.. వారికి ఆయాచిత లబ్ధి చేకూర్చడం గమనార్హం.

3.రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం శేరిలింగంపల్లి గ్రామం సర్వే నెంబర్ 90, 91 టు 102లోని 110 ఎకరాల భూమిని 1964-65లో అప్పటి ప్రభుత్వం అలూమిని కంపెనీకి కేటాయించింది. ఈ భూమి ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ఎకర రూ.50 కోట్లు పలుకుతోంది. దీనిపై ప్రభుత్వం-అలూమిని కంపెనీ మరియు అబుబకర్ అనే వ్యక్తుల మధ్య సుప్రీంకోర్టులో కేసు కూడా నడుస్తోంది. ఈ వ్యవహారాన్ని పరిష్కారించాలని సుప్రీం కోర్టు ఓ కమిషన్ ఏర్పాటు చేసి..దాని బాధ్యతలను జస్టిస్ నర్సింహారెడ్డికి అప్పగిస్తూ..రిపోర్టు సబ్మిట్ చేయాలని ఆదేశించింది. అయితే కొన్ని అనివార్య కారణాల రీత్యా ఇప్పటి వరకూ ఈకేసులో జస్టిస్ నర్సింహారెడ్డి సుప్రీంకు నివేదికను అందజేయలేదు. అయితే ఈ పంచాదీ సుప్రీంలో పెండింగ్ లో ఉండగానే..ఈ వ్యవహారంలో కలెక్టర్ అమోయ్ కుమార్, తహశీల్దార్ వంశీ, ఏడీ శ్రీనివాస్ లు వేలు పెట్టి ఓ పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం గమనార్హం.

 1. మాదాపూర్ గ్రామం, శేరిలింగంపల్లి మండలం రంగారెడ్డి జిల్లా సర్వే నెంబర్ 68లో సుమారు 5ఎకరాల ప్రభుత్వ భూమిని పట్టగా మార్చారు. దీని విలువ బహిరంగ మార్కెట్ లో సుమారు ఎకరానికి రూ. 60 కోట్లు, మొత్తం భూమి విలువ రూ. 300 కోట్లు. ఇంత విలువైన భూమిని బాధత్యగల కలెక్టర్ అమోయ్ కుమార్ శేరిలింగంపల్లి తహశీల్దార్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు స్వార్థ ప్రయోజనాల కోసం ప్రభుత్వ భూమిని దారాదత్తం చేశారు.
 2. ఇక శేరిలింగంపల్లి మండలం హాఫీజ్ పేట్ గ్రామంలోని సర్వే నెంబర్ 80 ప్రభుత్వానికి సంబంధించింది. ప్రస్తుతం ఈ భూమిపై కోర్టులో కేసు నడుస్తోంది. అయితే ఈ భూమితో పాటు కొండాపూర్ గ్రామ శివారులోని సర్వే నెంబర్ 87, 88ల్లోని భూమి కలుపుకొని పట్టాలు మంజూరు కావడం విస్మయం కల్గించే వ్యవహారం మారింది. ఈ భూమి విలువ బహిరంగ మార్కెట్లో ఎకర రూ.50 కోట్ల చొప్పున మొత్తం రూ.500 కోట్లు పలుకుతోంది. అయితే ఇంత విలువైన భూమికి అమయ్ కుమార్, ఆయన తాబేదారు ఆఫీసర్లు పట్టాలిచ్చేయడం విశేషం.

6.శంకరపల్లి మండలం మోకిలా-కొండాపూర్ గ్రామాల మధ్య 150 ఎకరాల భూమి చాన్నాళ్లుగా వివాదాస్పదంగా ఉంది. ఈ భూమి ఏ గ్రామ పరిధిలోకి వస్తుందనే అంశంపై క్లారిటీ లేదు. వాస్తవానికి సర్వే నెంబర్స్ లేని భూములను బిల్లా దాఖల ల్యాండ్స్ అని పిలుస్తుంటారు. వీటిపై హక్కు రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుంది. కానీ,ఈ విషయాన్ని అస్సలు పట్టించుకోకుండా పాత కలెక్టర్ అమయ్ కుమార్ దీన్ని ఓ ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టారు. ఈ భూమికి 555 అనే సర్వే నెంబర్ ను క్రియేట్ చేసి ప్రైవేట్ వ్యక్తులు ప్లాట్లు చేసుకునేందుకు అనుమతించడం గమనార్హం.

 1. శంకరంపల్లి మండలం వట్టినాగులపల్లి గ్రామం సర్వే నెంబర్స్ 186,187లలో 20 ఎకరాల భూదాన్ భూములుండేవి. ఈ భూమి బహిరంగ మార్కెట్లో సుమారు ఎకరాకు రూ.30 కోట్ల వరకూ పలుకుతోంది. అయితే ఇంతటి విలువైన ల్యాండ్ ను అమయ్ కుమార్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, సుధీర్ రెడ్డి, మైనంపల్లి హన్మంతరావు, హరీశ్ అనుయాయులకు కట్టబెట్టడడం విస్మయం కల్గిస్తోంది. ఫలితంగా అప్పటి కలెక్టర్ అమయ్ నిర్ణయం వల్ల సుమారు రూ.600 కోట్ల స్కాం జరిగినట్లు అర్థమవుతోంది.
 2. గండిపేట్ మండలం ఖానాపూర్ గ్రామంలోని 150 ఎకరాల బిల్లా దాఖల భూమి ఉంది. దీని విలువ బహిరంగ మార్కెట్లో రూ.6,000 కోట్లుంటుంది. కానీ,ఇంతటి విలువైన ల్యాండ్ కు 65 అనే సర్వే నెంబర్ ను క్రియేట్ చేసి ప్రతాప్ జంగలే మరియు ఇతరులకు పట్టా చేయడం గమ్మత్తుగా ఉంది. వాస్తవానికి సర్వే నక్ష ప్రకారం 65 సర్వే నెంబర్ అదే గ్రామంలోని ఓ కుంటకు సంబంధించింది.
 3. శేరిలింగంపల్లి మండలం మియాపూర్ గ్రామం సర్వే నెంబర్ 69లో 27 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీని విలువ బహిరంగ మార్కెట్లో ఎకరా రూ.50 కోట్లు పలుకుతోంది. అంటే ఓపెన్ మార్కెట్ లో దీని వాల్యూ రూ.1,350 కోట్లన్న మాట. అయితే ఇంతటి విలువైన సర్కారీ భూమిలో బిల్డింగ్స్ కట్టుకునేందుకు అప్పటి కలెక్టర్ అమయ్ కుమార్ అనుమతులు ఇవ్వడం విస్మయం కల్గిస్తోంది. దీనికి జీహెచ్ఎంసీ అధికారులు,అప్పటి శేరిలింగంపల్లి తహశీల్దార్,సర్వే అధికారులు జీహుజురు అనడం విడ్డూరంగా ఉంది.

10.రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలిలోని సర్వే నెంబర్స్ 38-54 వరకు గల ల్యాండ్స్ సీలింగ్ సర్ ప్లస్ భూములు. మొత్తం 76 ఎకరాల వరకు ఉంటుంది. ఈ భూమి బహిరంగ మార్కెట్లో ఎకరం రూ.50 కోట్ల చొప్పున 3,800 వరకు ఉంటుంది. అయితేే ఇంతటి విలువైన ప్రభుత్వ భూమిలో ఇప్పటికే ఫినిక్స్,అయోధ్యరామిరెడ్డి,శిల్పానాగిరెడ్డి,మినాక్షి సంస్థలు,వ్యక్తులు తిష్ట వేయడం గమనార్హం.

11.మరోవైపు శేరిలింగంపల్లి మండలం గోపన్ పల్లి గ్రామం సర్వే నెంబర్స్ 36,37 పూర్తిగా ప్రభుత్వానికి సంబంధించినవే. ఈ రెండు సర్వే నెంబర్స్ లో కలిపి సుమారు 600 ఎకరాలుంటుంది. ఈ భూమిలో నర్సింగరావు మరియు అతని బ్రదర్స్ కు రెవెన్యూ అధికారులు 90 ఎకరాల భూమిని స్వాధీనంలోకి తీసుకునేందుకు అప్పగించడం గమ్మత్తుగా ఉంది. అలాగే సర్వే నెంబర్ 36లో మరికొంత ల్యాండ్ ను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయడం విస్మయం కల్గిస్తోంది.

 1. మహేశ్వరం మండలం మహేశ్వరం-తుమ్మలూరు గ్రామాల మధ్య ప్రభుత్వానికి 70 ఎకరాల భూమి ఉంది. దీని విలువ బహిరంగ మార్కెట్లో రూ.210 కోట్ల వరకూ ఉంటుంది. దీన్ని మన పాత కలెక్టర్ అమయ్ కుమార్ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అనుయాయులకు కట్టబెట్టే యత్నం చేయడం గమనార్హం. మొత్తంగా అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా పని చేసిన అమయ్ కుమార్,ఆయన తాబేదారు ఆఫీసర్లు కలిసి సుమారు రూ.25 నుంచి రూ. 30 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను బీఆర్ఎస్ పెద్దల అండతో పరాధీనం చేసేయడం గమనార్హం. అందువల్ల అమోయ్ కుమార్ టైంలో జరిగిన అవినీతిపై కొత్త ప్రభుత్వం నజర్ పెడితే గత సర్కార్ లోని అనేక తిమింగలాల బండారం బయటపడే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

అమోయ్ కుమార్ మరిన్ని అవినీతి బాగోతాలు మరో కథనంలో అందించనుంది ఆదాబ్ హైదరాబాద్.. మా అక్షరం అవినీతిపై అస్త్రం.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు