- కుటిల రాజనీతి వ్యవహారంలో అందెవేసిన కేసీఆర్
మెదడులో పురుడుపోసుకున్న సరికొత్త ఎత్తుగడ.. - ప్రతిపక్షాలకు ఊపిరి ఆడకుండా చేయడమే ఆయన వ్యూహమా..?
- రాష్ట్రంలో వ్యతిరేక పవనాలు వీస్తున్న క్రమంలో సరికొత్త డ్రామా..
- ప్రస్తుత శాసన సభ్యులంతా నిఖార్సైన వాళ్ళే అన్న సందేశాన్ని పంపించడమే ధ్యేయమా..?
- అందరినీ కలిసి కట్టుగా ఉంచడానికి కేసీఆర్ ప్రయోగించిన వ్యూహం..
- అందుతున్న రిపోర్టుల ఆధారంగా మైనంపల్లి లాగానే మరికొందరి
బండారం బయటపడుతుందనే ఆఘమేఘాల మీద లిస్ట్ ప్రకటన.. - ఊహకందని కేసీఆర్ కుయుక్తులపై టి.ఆర్.ఎస్. కో ఫౌండర్
ఫరత్ ఇబ్రహీం అందిస్తున్న ప్రత్యేక కథనం..
పట్టు జారిపోకూడదు.. గట్టు దాటిపోకూడదు.. ఇదే కేసీఆర్ ఆలోచన.. అందుకే ఎన్నికలకు కొన్ని నెలలు సమయం ఉన్నా.. తమ పార్టీ అభ్యర్థులను ఆఘమేఘాల మీద ప్రకటించేశారు.. అయితే ఈ ప్రకటన వెనుక ఒక పెద్ద కుట్ర దాగివుంది అని ఆయన అంటున్నారు.. ప్రత్యర్థులకు ముక్కుతాడు వెయ్యడంలో తనను మించిన ఘనాపాటి ఎవరూ లేరన్నది కేసీఆర్ అభిప్రాయం.. పాదరసంలా జారిపోయే కేసీఆర్ ఆలోచనలు ఎవరికీ అంతుబట్టవా..? క్షణానికో పన్నాగం, నిమిషానికో రాజకీయ వ్యూహం రచించడంలో తనకు తానే సాటి అనుకుంటారు కేసీఆర్.. ఇప్పుడు కూడా బీ.ఆర్.ఎస్. పార్టీ అభ్యర్థుల ప్రకటన కూడా అలాంటిదే అంటున్నారు టి.ఆర్.ఎస్. కో ఫౌండర్ ఫరత్ ఇబ్రహీం..
హైదరాబాద్ :
పురుషులందు పుణ్యపురుషులు వేరయా.. అని వేమన సెలవిచ్చినట్లు.. రాజకీయ నాయకుల్లో కేసీఆర్ వేరయా అని చెప్పుకోవాల్సి వస్తోంది.. ఎందుకంటే కేసీఆర్ ఆడే రాజకీయ చదరంగంలో ఆయన వేసే ఎత్తులు ప్రత్యర్థులను చిత్తు చేస్తూ ఉంటాయి.. ఇప్పుడు కూడా అదే మైండ్ గేమ్ ప్లే చేశారు కేసీఆర్.. రాబోయే తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీనుంచి అభ్యర్థులను ఊహకు అందని విధంగా ప్రకటించేశారు.. ఈ ప్రకటనలో ఒక డ్రామా దాగుందని తేల్చి చెప్పారు కో ఫౌండర్.. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో బీ.ఆర్.ఎస్. పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని అన్ని సర్వేలు తేల్చి చెప్పడంతో గులాబీ బాస్ డైలమాలో పడిపోయారు.. అంతే కాకుండా ప్రత్యర్థి పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లు దూసుకుపోతూ.. బీ.ఆర్.ఎస్. పార్టీ నాయకులను తమ పార్టీలోకి లాగేసుకుంటుండంతో.. తమ నాయకులు ఎక్కడ చేజారిపోతారో..? అన్న భయం కేసీఆర్ లో చోటుచేసుకుంది.. ఈ విపత్కర పరిస్థితులకు అడ్డుకట్ట వేయడానికి ఆయన తన మేధస్సుకు పదును పెట్టారు.. అందుకే తమ పార్టీ నాయకుల ముందర కాళ్లకు బంధం వేయడానికి.. వారి పేర్లను ప్రకటించారు.. ఈ దెబ్బతో వారంతా ఇతర పార్టీల వైపు వెళ్లాలనే ఆలోచన విరమించుకుని తమ, తమ గెలుపుకోసం తలమునకలై పోతారు.. అధినేత తమ మీద నమ్మకం ఉంచి తమకు తిరిగి అవకాశం ఇచ్చారనే అపోహతో ముందుకు సాగే ప్రయత్నం చేస్తారు.. అంతే కాకుండా కేసీఆర్ తమ అభ్యర్థులను ప్రకటించేశారు కనుక ప్రత్యర్థి పార్టీల అధిష్టానాలు కూడా వారి వైపు చూడకుండా కట్టడి చేయడంలో కేసీఆర్ కృతక్యుత్యులు అయ్యారన్నది ఇక్కడ చెప్పుకోవాల్సిన ముఖ్యమైన అంశం.. సో ఇక తమ పార్టీ అభ్యర్థులు, నాయకులు గట్టు దాటి పొరనేది కేసీఆర్ కుయుక్తులకు నిదర్శనం..
అయితే తమ పేర్లను అధినేత ప్రకటించడంతో సంబరపడి పోతున్న నాయకులు కేసీఆర్ ఆడుతున్న నాటకాలను గ్రహించకపోవడం గమనార్హం.. కేసీఆర్ కేవలం ఒక తెల్లకాగితంపై టైపు చేసి అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.. పేపర్లనే మీడియాకు విడుదల చేశారు.. అంటే ఇదంతా ఉత్తుత్తదే అన్నది ప్రస్ఫుటం అవుతోంది.. కేవలం తమ నాయకులు జంప్ జిలానీలు కాకుండా ఉండడానికే ఈ ఎత్తుగడ అంటున్నారు కో ఫౌండర్.. కనీసం ఎన్నికల వరకైనా వారిని కాపాడుకోవడానికే ఈ తతంగం నడిపారన్నది కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తోంది.. ఎందుకంటే అధికారికంగా మార్పులు, చేర్పులు చేసే అవకాశం వుంది.. ఇప్పుడు ప్రకటించిన అభ్యర్థుల్లో ఎవరికైతే ఎన్నికలకు ముందు కేసీఆర్ బీ ఫారం ఇస్తారో వారే బరిలో ఉంటారు.. ఇది వాస్తవం.. తన ప్రకటనతో విపక్ష పార్టీలకు కూడా తాను చెక్ పెట్టగలిగాను అని కేసీఆర్ భావిస్తున్నారు.. కనుక ఇప్పుడు అభ్యర్థులుగా ప్రకటించిన వారికి కూడా ఎలాంటి గ్యారెంటీ లేదన్నది అభ్యర్థులు గ్రహిస్తే మంచిది.. అయితే ఎంతో తెలివిగా కొందరు అభ్యర్థులను తొలగించి, వారి స్థానంలో కొత్తవారికి అవకాశం ఇవ్వడం.. నాలు స్థానాలు పెండింగ్ లో పెట్టడం చేత కేసీఆర్ తాను ప్రకటించిన లిస్టు పర్ఫెక్ట్ అనే భ్రమను అందరిలోనూ కలిగించగలిగారు.. తమ పాలనకు ప్రజలందరూ సపోర్ట్ చేస్తున్నారనే భావన కూడా రేకెత్తించారు కేసీఆర్.. కానీ తెరవెనుక ఆయన ఆడుతున్న డ్రామాలు అన్నీ ఇన్నీ కావన్నది యదార్ధం.. ఈ అభ్యర్థుల ప్రకటన ప్రక్రియతో విపక్షాలను ముప్పుతిప్పలు పెట్టగలిగాను అన్న ఆశాభావంతో కేసీఆర్ భ్రమపడుతున్నారని ఆయన అంటున్నారు.. అయితే కేసీఆర్ కళ్లకు కట్టిన ఆ పొరలు తొలగిపోక తప్పవని.. రేపు తెలంగాణ ప్రజలు ఇచ్చే తీర్పుకు ఆయన కళ్ళు బైర్లు కమ్మకపోవని ఆయన హెచ్చరిస్తున్నారు.. వాస్తవాలు ప్రజలు గ్రహించలేరని కేసీఆర్ అనుకోవడం ఆయన వెర్రితనానికి నిదర్శనమని ఆయన అంటున్నారు.. కేసీఆర్ డ్రామాలను గ్రహించి ఇప్పటికైనా బీ.ఆర్.ఎస్. నాయకులు వాస్తవంలోకి రావాలని హితవు పలుకుతున్నారు టి.ఆర్.ఎస్. కో ఫౌండర్ ఫరత్ ఇబ్రహీం..
అయితే తెలంగాణ రాష్ట్రంలో అధికార ఎమ్మెల్యేలు కొందరు అక్రమాస్తులు కూడబెట్టారని, క్రిమినల్ యాక్టివిటీస్ తో సంపాదించిన అక్రమార్జనను ఏఏ రాష్ట్రాల్లో, ఏఏ దేశాల్లో పెట్టుబడి పెట్టారో.. అన్న వ్యవహారాలపై ఒక కన్నేసి పెట్టారు ఇంటలిజెన్స్, ఇన్కమ్ టాక్స్, ఈడీ, సీబీఐ అధికారులు. ఎమ్మెల్యే మైనంపల్లి లాగానే.. ఇంటలిజెన్స్ అధికారుల రిపోర్టుల ఆధారంగా మరింత కాలయాపన చేస్తే ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మాదిరిగానే మిగతా నాయకుల బండారాలు కూడా బయటపడి వారు కూడా చేజారి పోతారేమే అన్న సంశయంతో కేసీఆర్ భయపడిపోయి అభ్యర్థుల జాబితాను ముందుగానే విడుదల చేశారన్నది రాజకీయ విశ్లేషకుల వాదన..