Wednesday, April 24, 2024

ఏపీలో మరో పెద్ద ప్రాజెక్ట్..

తప్పక చదవండి
  • మచిలీపట్నం పోర్టు పనులకు శంకుస్థాపన..
  • 24-30 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యం..
  • ఎగుమతులకు ఎంతో ఉపయోగం..
  • నాలుగేళ్లలో నాలుగు పోర్టులు..

అమరావతి, 23 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :
ష్ణాజిల్లా ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేసేలా మచిలీపట్నంలో పోర్టు నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. తొలిదశలో నాలుగు బెర్తులతో 30నెలల్లో నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. శంకుస్థాపనలో భాగంగా గంగమ్మకు సీఎం పూజలు నిర్వహించిన ఆయన….పోర్టు నిర్మాణంతో జిల్లా ముఖచిత్రం మారిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పోర్టు నిర్మాణ ప్రదేశంలో భూమి పూజచేసి పైలాన్‌ను ఆవిష్కరించారు.

35.12 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్థ్యంతో రెండు జనరల్‌ కార్గోకు, ఒకటి బొగ్గుకు, మరొకటి మల్టీపర్పస్‌ కంటైనర్‌తో ఎగుమతి, దిగుమతులకు ఉపయోగపడేలా మొత్తం నాలుగు బెర్తులతో మచిలీపట్నం పోర్టును 24-30 నెలల్లో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. పోర్టు పనులు పూర్తయిన తరువాత 25వేల మందికి ఉపాధి లభించనుందని తెలిపారు. వాణిజ్య కార్యకలాపాలు విస్తరించే కొద్దీ 16 బెర్తులతో 116 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్థ్యంతో పోర్టును విస్తరించేలా ప్రణాళిక రూపొందించినట్లు వివరించారు. మచిలీపట్నం పోర్టు ద్వారా రాష్ట్రంలోని గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు తెలంగాణలోని ఖమ్మం, కరీంనగర్, అదిలాబాద్, నల్గొండ, వరంగల్‌ జిల్లాలకు ఎరువులు, బొగ్గు, వంటనూనె, కంటైనర్ల దిగుమతులు, వ్యవసాయ ఉత్పత్తులు, సిమెంట్, సిమెంట్‌ క్లింకర్, గ్రానైట్, ముడి ఇనుము ఎగుమతులకు వేదికగా మారుతుందన్నారు.

- Advertisement -

పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 5వేల 156 కోట్ల రూపాయిల వ్యయంతో చేపట్టనున్న మచిలీపట్నం పోర్టుకు ఇప్పటికే భూసేకరణ చేసి, అన్ని అనుమతులు సాధించి, న్యాయ వివాదాలు పరిష్కరించి, టెండర్లు ఫైనలైజ్‌ చేసి, ఫైనాన్షియల్‌ క్లోజర్‌ పూర్తి చేసి పోర్టు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టినట్టు చెప్పారు. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ళలో కేవలం 6 పోర్టులు కడితే, ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో నవశకానికి నాంది పలుకుతూ అధికారంలోకి వచ్చిన కేవలం 4 ఏళ్ళలోపే 4 పోర్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్టు సిఎం వివరించారు. ఇప్పటికే రామాయపట్నంలో శరవేగంగా పనులు జరుగుతున్నాయని, మూలపేట పోర్టు పనులు కూడా ఇప్పటికే ప్రారంభించామని, కాకినాడ గేట్‌ వే పోర్టు పనులు చురుగ్గా సాగుతున్నాయని, బందరు ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ మచిలీపట్నం పోర్టు పనుల్ని ప్రారంభిస్తున్నట్లు వివరించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే పోర్టు నిర్మాణానికి 2020, ఫిబ్రవరి 4 న మచిలీపట్నం పోర్టు డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ పేరుతో ప్రత్యేక సంస్ధ ఏర్పాటు చేసి పోర్టు నిర్మాణానికి పరిపాలన అనుమతుల మంజూరు చేసినట్లు తెలిపారు. 2023, ఫిబ్రవరి 28న పర్యావరణ అనుమతులు, 2023 ఏప్రిల్‌13 న కాలుష్య నియంత్రణ మండలి అనుమతుల మంజూరు, 2023 మార్చి నెలలో 1,923 ఎకరాల భూసేకరణ పూర్తైనట్లు వివరించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు