Friday, November 1, 2024
spot_img

కందనూలులో యువ మంత్రం

తప్పక చదవండి
  • కూచుకుళ్ల రాజేష్‌ రెడ్డి వైపే యువత
  • యూత్ ఐకాన్ గా గుర్తింపు
  • విద్యావంతుడు, ప్రొఫెసర్‌గా సేవలు
  • డెంటల్‌ అసోసియేషన్‌ ఛైర్మన్‌గా రాణింపు
  • తండ్రి, ఎంఎల్‌సీ అడుగుజాడల్లో రాజకీయ ఓనమాలు
  • గడప గడపకు కాంగ్రెస్‌తో ప్రజలకు చేరువ
  • ఎమ్మెల్యే మర్రికి ఊహించని ప్రతిఘటన
  • తొలి ప్రయత్నంలోనే లక్ష్యానికి చేరువలో ..!

నాగర్‌కర్నూల్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్లు యువ మంత్రానికి జై కొడుతున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్‌ కూచుకుళ్ల రాజేష్‌ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారన్న చర్చ జరుగుతోంది. సౌమ్యుడు, నిజాయితీపరుడైన ఎమ్యెల్సీ కూచుకుళ్ల దామోదర్‌ రెడ్డి తనయుడిగా రాజకీయ ఓనమాలు నేర్చుకున్న ఆయన వైద్యునిగా సేవలు అందిస్తున్నారు. ప్రొఫెసర్‌గానూ దేశంలోని వివిధ కళాశాలల్లో వైద్యులకు పాఠాలు బోధిస్తున్న ఆయన తెలివిని గుర్తించి బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర డెంటల్ అసోసియేషన్ ఛైర్మన్ పదవి కల్పించింది. కాగా తండ్రి అడుగు జాడల్లో ప్రజా సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చారు. నాగర్‌కర్నూల్‌ మండలం తూడుకుర్తి గ్రామం నుంచి ప్రారంభమైన కూచుకుళ్ల రాజకీయ ప్రస్థానం రాష్ట్ర స్థాయిలోనూ గత నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతోంది. దామోదర్‌రెడ్డి సర్పంచ్‌ నుంచి ఎమ్యెల్సీ, జెడ్పీ ఛైర్మన్‌ వరకు ఉన్నత పదవులు చేపట్టారు. దివంగత వైఎస్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. అలాంటి దామోదర్‌ రెడ్డికి తనయుడైన రాజేష్‌ రెడ్డి తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీలో నిలబడ్డారు. తండ్రి కోసం తెరవెనక రాజకీయ అనుభవం గడించిన ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో తొలిసారి అదృష్టం పరీక్షించుకొంటున్నారు. తండ్రిలాగే ముఖవర్ఛస్సు, మాటల్లో మెత్తదనం, ఆప్యాయ పలకరింపు, చిరునవ్వు ప్రజలను ఆకట్టుకుంటోంది. ఎన్నో ఏండ్లుగా నాయకులకు పరిచితులుగా ఉన్నా ఏనాడూ అధికార దర్పాన్ని ప్రదర్శించలేదు. దీంతో రాజకీయాల్లోకి వచ్చిన కొద్ది నెలల వ్యవధిలోనే సీనియర్‌ నాయకులతో పాటుగా సామాన్యులు, ప్రజల మన్ననలు పొందారు. గడప గడపకు కాంగ్రెస్‌ పేరిట ఎన్నికలకు ముందే రాజకీయ అడుగులు వేసిన రాజేష్‌ రెడ్డి కేవలం రెండునెలల కాలంలోనే అనూహ్య ‘ప్రజామద్ధతు సంపాదించుకోవడం గమనార్హం. ముఖ్యంగా యువత రాజేష్‌ రెడ్డికి భారీగా మద్దతు తెలుపుతున్నారు. మైనార్టీలు, దళిత, గిరిజన యువత రాజేష్‌ రెడ్డి గెలుపు కోసం సోషల్‌ మీడియాలో ప్రత్యేక క్యాంపెయిన్‌ నిర్వహిస్తున్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, ఉపాధి కల్పించకపోవడంతో కసిమీదున్న యువత కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాజేష్‌కు సహజంగా మద్దతుగా నిలుస్తున్నారు. గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలోకి వెళ్తున్న ఆయనకు భారీ గజమాలలు, డప్పుల దరువులకు చిందులేస్తూ, రీల్స్‌ చేస్తూ సందడి చేస్తున్నారు. రాజేష్‌ రెడ్డికి వచ్చిన ఈ మద్దతు సీనియర్‌ నాయకులను సైతం ఆలోచింపజేస్తోంది. తొలి ప్రయత్నంలోనే లక్ష్యం గుమ్మాన్ని ముద్దాడుతాడేమోననే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌ రెడ్డికి రెండు నెలల క్రితం ఎదురేలేని పరిస్థితి ఉండేది. దీంతో ఆయన అనుచరులు ఎమ్మెల్యే మర్రి మూడోసారి గెలిచి మంత్రి కావడం ఖాయమని చెప్పుకొంటూ వస్తున్నారు. కాగా ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన కొద్ది కాలంలోనే రాజేష్‌ రెడ్డి తన వ్యక్తిత్వం, కాంగ్రెస్‌కు వస్తున్న ఆదరణ, తెరవెనక ఎంఎల్‌సీ, తండ్రి దామోదర్‌ రెడ్డి రాజకీయ చాణుక్యంతో ఎమ్మెల్యే మరికి ఊహించని ప్రతిఘటన ఇస్తుండటం విశేషం. దీంతో బీఆర్‌ఎస్‌కు ఓటమి తప్పదనే సర్వేలు, నియోజకవర్గంతో పాటుగా ఉమ్మడి జిల్లాలోనూ జోరందుకున్నాయి. ఈ క్రమంలో మూడు దశాబ్దాల తర్వాత కందనూలు గడ్డపై యువకుడైన రాజేష్‌ రెడ్డి ద్వారా కాంగ్రెస్‌ జెండా ఎగరడం ఖాయమనే అభిప్రాయం పార్టీలో, నియోజకవర్గ రాజకీయ నేతల్లో విస్తృతంగా సాగుతోంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు