Wednesday, April 17, 2024

యదేచ్ఛగా విద్యుత్ చౌర్యం.!

తప్పక చదవండి
  • భూమి ఒకరిది.. విద్యుత్ కనెక్షన్ మరొకరిది…
  • కట్టంగూరు మండలం, ఈదులూరు గ్రామంలో ట్రాన్స్ కో అధికారుల ఘనకార్యం..
  • ఆధారాలతో ఫిర్యాదు చేసినా, పట్టించుకోని ట్రాన్స్ కో అధికారులు
  • భూమి ఎవరిదో తేల్చమని కోరిన ట్రాన్స్ కో.. భూమి సర్వే చేసి, రిపోర్టు తొక్కిపట్టిన తహశీల్దార్.!
  • ఈ నకిలీ విద్యుత్ కనెక్షన్ దందా వెనుక అధికార పార్టీ ఎమ్మెల్యే పి.ఏ హస్తం.!

నల్గొండ క్రైమ్ బ్యూరో : నల్లగొండ జిల్లా, కట్టంగూరు మండలానికి చెందిన ఈదులూరు గ్రామంలోని భూమి సర్వే నెంబర్ 902 లో పూర్తి విస్తీర్ణం 16 ఎకరాలు ఉండగా ఇందులో 2.12 గు.భూమికి స్థానిక గ్రామస్తులైన దాసరి యాదగిరి, శ్రీనివాస్ ఇరువురు అన్నదమ్ములు సదరు భూమి యాజమాన్య హక్కు కలిగి ఉన్నారు (పాసు పుస్తకం నెంబర్.టి28120032020). అయితే వీరి భూమికి పక్కనే ఆనుకొని ఉన్న భూమి సర్వే నెంబర్ 146, 900 లలో కలుపుకొని నాగులపాటి అంజమ్మ అనే మహిళ పేరున 5.37 గు.ల భూమి ఉన్నది. ఈ భూమిలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కొరకు ట్రాన్స్ కో డిపార్ట్మెంట్ వారకి డిసెంబర్ 2022 సంవత్సరంలో దరఖాస్తు చేస్తూ, సదరు కనెక్షన్ కోసం రూ.5,787 డి.డి (138686) చెల్లించినారు.

అధికారికంగా విద్యుత్తు అధికారుల నుండి కనెక్షన్ అనుమతులు పొందకుండానే సొంతంగా వీరే బీబీనగర్ ప్రాంతం నుండి విద్యుత్ స్తంభాలు తెచ్చుకొన్న నాగులపాటి అంజమ్మ తన భూమిని వదిలి, మా భూమిలోకి చొరబడి (సర్వే.నెం.902) అక్రమంగా విద్యుత్ కనెక్షన్లు తగిలించి, ఏకంగా రెండు మోటార్లు బిగించి, బహిరంగంగా విద్యుత్ చౌర్యానికి పాల్పడటమే కాకుండా తమపై దౌర్జన్యానికి దిగుతున్నారని దాసరి యాదగిరి ట్రాన్స్ కో అధికారులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.

- Advertisement -

ఎమ్మెల్యే పి.ఏకు భయపడుతున్న అధికారులు..
ఈ యొక్క నకిలీ విద్యుత్ కనెక్షన్ వెనకాల స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యేకు చెందిన ఒక పి.ఏ హస్తము ఉన్నందున తాము ఏమీ చర్యలు తీసుకోలేకపోతున్నామని ట్రాన్స్ కో అధికారులు చేతులు ఎత్తేశారని తెలుస్తోంది. విద్యుత్ చౌర్యం, నకిలీ కనెక్షన్ల విషయంలో కఠినమైన చట్టాలు ఉన్నాయని తెలిసి కూడా అధికారులు ఎమ్మెల్యే పి. ఏ ఒత్తిడికి తలొగ్గి చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని తెలియవచ్చింది. జిల్లా ట్రాన్స్ కో అధికార యంత్రాంగం సంబంధిత భూ యజమానుల వివరాలు ఇవ్వాలని కట్టంగూర్ తహశీల్దార్ కార్యాలయాన్ని కోరగా, విచారణ జరిపిన తహశీల్దార్ కార్యాలయం వారు ఎమ్మెల్యే పి.ఏ వత్తిడి మేరకే సదరు నివేదికను ట్రాన్స్ కో ఉన్నతాధికారులకు పంపకుండా, తొక్కి పెట్టినట్లు తెలిసింది.

అక్రమాలకు అడ్డా.. కట్టంగూరు తహశీల్దార్ కార్యాలయం.!
అక్రమాలకు పెట్టింది పేరు కట్టంగూరు తాహశీల్దారు కార్యాలయం. బ్రతికున్న వారిని చనిపోయినట్లుగా డెత్ సర్టిఫికెట్లు ఇవ్వడంలో వీరికి వీరే సాటి. స్థానిక గార్ల బావిగుడెం గ్రామానికి చెందిన మల్లమ్మ అనే ఒక మహిళ బ్రతికుండగానే ఆమె చనిపోయినట్లు ఆమె పేరున డెత్ సర్టిఫికెట్ మంజూరు చేసిన విషయం ప్రపంచం మొత్తానికి తెలిసిందే. అక్రమ వ్యవహారాలలో ఉన్న ఉత్సాహం సక్రమ పనులపై ఉండకపోవడం విచారకరం.

ఒక ఎమ్మెల్యే పి.ఏ అధికారులను ఇంతగా ప్రభావితం చేస్తున్నారు.. ఈ అక్రమ విద్యుత్ కనెక్షన్ విషయంలో అధికారులు తక్షణమే స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు