Sunday, April 28, 2024

బీఆర్‌ఎస్‌ను దెబ్బకొట్టబోతున్న టీఆర్‌ఎస్‌

తప్పక చదవండి
  • తెలంగాణ రాజ్య సమితి పేరుతో పోటికి సై
  • టీఆర్‌ఎస్‌కు గ్యాస్‌ సిలిండర్‌ గుర్తు
  • బహుజనులకు రాజ్యాధికారంమే నినాదం..
  • అధికార పార్టీ గుండెలో చెలరేగుతున్న భయం..
  • ప్రజలను ఏవిధంగా చైతన్యం చేయాలన్నదే సవాల్‌
  • పుట్టిముంచనున్న మారిన పేరు బీఆర్‌ఎస్‌
  • తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త చర్చ..

హైదరాబాద్‌ : ఏ గ్యాస్‌ సిలిండర్‌ను బూచిగా చూపి బీఆర్‌ఎస్‌. నాయకులు ధర్నాలు, నిరసనలు చేపట్టి కేంద్ర ప్రభుత్వంపై తమ అక్కసును వెళ్ళగక్కారో..? అదే సిలిండర్‌ గుర్తు వారి కొంప ముంచనుందా..? అవును మీరు చదువుతున్నది అక్షరాలా నిజం.. కేంద్ర ఎన్నికల సంఘం టీఆర్‌ఎస్‌ పార్టీకి గ్యాస్‌ సిలిండర్‌ ను ఎన్నికల గుర్తుగా కేటాయించింది.. ఏమిటి మళ్ళీ కన్ఫ్యూజ్‌ అయ్యారా.. ? అవునండీ టీఆర్‌ఎస్‌ పార్టీకి గ్యాస్‌ సిలిండర్‌ గుర్తు వచ్చింది.. దీనిని అధికారికంగా కూడా నిర్ధారించింది కేంద్ర ఎన్నికల సంఘం.. కాకపోతే ఇందులో చిన్న మెలిక ఉంది.. దాదాపు 13 ఏళ్లుగా తెలంగాణ ప్రజల మనస్సులో, ఆలోచనల్లో నాటుకు పోయిన పేరు టీఆర్‌ఎస్‌ తెలంగాణ రాష్ట్ర సమితి.. కానీ ఇప్పుడు మాట్లాడుకుంటున్నది తెలంగాణ రాజ్య సమితి అనే ఒక కొత్త రాజకీయ పార్టీ గురించి.. కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ పేరును మార్చి, బీఆర్‌ఎస్‌గా ప్రకటించినప్పుడే.. తెలంగాణ అన్న పదానికి కేసీఆర్‌ తిలోదకాలు ఇచ్చాడని ప్రతిపక్షాలతో సహా తెలంగాణ ప్రజలు కూడా విమర్శలు గుప్పించారు.. ఈ తరుణంలోనే తెలంగాణ రాజ్య సమితి అనే పార్టీ వెలుగులోకి వచ్చింది.. కాగా షార్ట్‌ కట్‌లో ఈ పార్టీని కూడా టీఆర్‌ఎస్‌ అని పిలుస్తుండటం గమనార్హం.. అయితే కేసీఆర్‌ టి.ఆర్‌.ఎస్‌. అన్న పదం అంత సుళువుగా ప్రజల జ్ఞాపకాల్లోంచి తుడిచిపెట్టుకుపోవడం కష్టతరమే.. బీఆర్‌ఎస్‌ పదానికి అలవాటుపడటం కూడా అంత ఈజీ కాదు.. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు తెరమీదకు వచ్చిన టీఆర్‌ఎస్‌ (తెలంగాణ రాజ్య సమితి) అన్నది, రాష్ట్ర ప్రజల మెదళ్లలోకి వేగంగా విస్తరించే అవకాశం ఉంది.. రాజకీయాలపట్ల అవగాహన ఉన్నవాళ్లకు ఇది కొత్త పార్టీ అని తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు.. కానీ టి.ఆర్‌.ఎస్‌. అనే పదాన్ని నరనరాల జీర్ణించుకున్న సామాన్యులకు.. ఇప్పటి వరకు టీఆర్‌ఎస్‌, బీఆర్‌ఎస్‌గా మారిందన్న విషయమే తెలియదు.. ఇప్పుడు కొత్తగా వచ్చిన టీఆర్‌ఎస్‌ పార్టీయే పాత టీఆర్‌ఎస్‌ పార్టీ అని భావించే ప్రమాదం ఉంది.. కారు గుర్తు వుంది కాబట్టి కొంతలో కొంత ప్రమాదం తప్పే అవకాశముంది.. కానీ ఎక్కువ శాతం మంది తప్పని సరిగా పొరబాటు పడే అవకాశం ఉంది.. అంటే పూర్తిగా బీఆర్‌ఎస్‌కు ఇప్పటికిప్పుడు వచ్చే సమస్య పెద్దది కాకపోయినా.. కొంతమేర బీఆర్‌ఎస్‌ ఓటు బ్యాంకు చీలే అవకాశం మాత్రం తప్పనిసరిగా ఉంటుంది అన్నది విశ్లేషకుల వాదన..

అసలు ఎక్కడిది ఈ కొత్త టీఆర్‌ఎస్‌ పార్టీ..?
దీనికి కర్త కర్మ క్రియ ఎవరు..?
తెలంగాణ రాష్ట్రం సిద్ధిపేట జిల్లా, పొన్నాల గ్రామానికి చెందిన ఉద్యమకారుడు తుపాకుల బాల రంగం అనే వ్యక్తి, ఖమ్మం, నల్లగొండ, కరీం నగర్‌, రంగారెడ్డి, మెదక్‌ జిల్లాలకు చెందిన ఉద్యమకారులు, బీఆర్‌ఎస్‌ పార్టీపై వ్యతిరేకతను పెంచుకున్న మిగతా ఉద్యమకారులతో కలిసి తెలంగాణ రాజ్య సమితి అనే కొత్త పార్టీని స్థాపించారు.. ఈ పార్టీని ఎన్నికల సంఘంలో కూడా రిజిస్టర్‌ చేసుకున్నారు.. కాగా ఎన్నికల సంఘం కూడా ఈ పార్టీని గుర్తించి, ఎన్నికల్లో పోటీ చేసేందుకు గ్యాస్‌ సిలిండర్‌ గుర్తును కూడా కేటాయిస్తూ అనుమతులు జారీ చేసింది.. కాగా తాము తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తానని తుపాకుల బాల రంగం ఎన్నికల సంఘానికి తెలియజేశారు.. ఈయన విజ్ఞప్తిని పరిశీలించిన ఎన్నికల సంఘం.. కొన్ని షరతులు విధిస్తూ.. గుర్తును కేటాయించింది.. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీచేసే ప్రతి అభ్యర్ధికి సిలిండర్‌ గుర్తు కేటాయించాలని సూచించింది.. కాగా ఎన్నికల నిబంధనల ప్రకారం రాష్ట్రంలో కనీసం 5 చోట్ల పోటీచేయాలని నిబంధనను కూడా విధించింది.. ఒక ఎక్కడైనా ఆ పార్టీ పోటీ చేయకపోతే ఇతరులకు ఆ గుర్తును కేటాయించే అవకాశం ఉంటుందని ఎన్నికల సంఘం పేర్కొంది..

- Advertisement -

తెలంగాణ రాజ్య సమితి అధినేత నేపథ్యం ఏమిటి..?
తెలంగాణ రాజ్య సమితి వ్యవస్థాపకులు తుపాకుల బాలరంగం అనే వ్యక్తి స్వస్థలం సిద్ధిపేట జిల్లా పొన్నాల గ్రామం.. ఈయన 1983 నుంచి కేసీఆర్‌ కి సహచరుడిగా ఉన్నారు.. 1987, 1995లో పొన్నాల గ్రామ సర్పంచ్‌ గా పనిచేశారు.. 2006లో సిద్ధిపేట మండల జెడ్‌.పీ.టి.సి. సభ్యుడిగా.. 2019 నుంచి 2021 వరకు ఉపాధిహామీ పథకం రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడిగా తన సేవలను అందించారు.. అయితే తెలంగాణ రాజ్య సమితి అనే పేరుతో ఈసీలో రిజిస్టర్‌ చేసుకున్న బాలరంగం సికింద్రాబాద్‌లోని ఓల్డ్‌ ఆల్వాల్‌ లోని తన ఇంటి చిరునామాను పార్టీ కార్యాలయం చిరునామాగా పేర్కొన్నారు.. అయితే కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ బీఆర్‌ఎస్‌గా మారిన నేపథ్యంలో.. టీఆర్‌ఎస్‌ పేరుతో మరో పేరు రిజిస్టర్‌ కావడం.. ఆ పార్టీకి ఈసీ గ్యాస్‌ సిలిండర్‌ గుర్తును కేటాయించడంతో ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ పాఠీకి ఎలాంటి నష్టం జరుగనుంది అన్నది ఆసక్తికరంగా మారింది.. కాగా కొత్తగా ఏర్పడ్డ టీఆర్‌ఎస్‌ పార్టీ వ్యవస్థాపకుడు తుపాకుల బాలరంగం మాట్లాడుతూ.. ఎన్నో ఏండ్లుగా బహుజనులకు అన్యాయం జరుగుతోందని.. వారికి రాజ్యాధికారం దక్కకపోవడం శోచనీయమని, కనీసం ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డ తర్వాతైనా తమకు న్యాయం జరుగుతుందేమో అన్న ఆశ కూడా అడియాస అయిపోయిందని.. కనుకే బహుజన రాజ్యాధికారాన్ని సాకారం చేసుకోవడానికే టి.ఆర్‌.ఎస్‌. పార్టీని స్థాపించినట్లు తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు