- ఫిబ్రవరి 1న ముగియనున్న సర్పంచుల పదవీకాలం
- ప్రత్యేక అధికారుల పాలనలోకి పంచాయతీలు
- పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల నియామకానికి రంగం సిద్ధం
- రాష్ట్రంలో మొత్తం 12,777 గ్రామ పంచాయతీలు
- ప్రభుత్వం సూచన మేరకు కలెక్టర్లు జాబితా
హైదరాబాద్ : రాష్ట్రంలో వచ్చే నెలలో సర్పంచుల పదవీకాలం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో పంచాయతీల్లో ప్రత్యేక అధికారులను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం జాబితా సిద్ధం చేయాలని కలెక్టర్లను ఆదేశించగా వారు నివేదికను ప్రభుత్వానికి పంపారు.పూర్తి వివరాల్లోకి వెళితే తెలంగాణలో వచ్చే నెల 1వ తేదీన సర్పంచుల పదవీకాలం ముగియనుంది. ఇప్పటి వరకూ గ్రామపంచాయతీల్లో ఎన్నికలపై ఎటువంటి క్లారీటి రాలేదు. మరోవైపు సర్పంచ్ ఎన్నికల నిర్వహణ ఇప్పట్లో సాధ్యం కాదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక అధికారుల పాలనలోకి పంచాయతీలు వెళ్లనున్నాయి. ఇందుకు సంబంధించి ప్రభుత్వం అధికారుల జాబితాలను రూపొందించాలని కలెక్టర్లను ఆదేశించింది. దీంతో పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల నియామకానికి రంగం సిద్ధమైంది. రాష్ట్రంలో మొత్తం 12,777 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటికి అవసరమైన మేరకు నియామకాలు జరగాలన్న ప్రభుత్వం సూచన మేరకు నిర్ణీత నమూనాలో కలెక్టర్లు జాబితాలను రూపొందించారు. ప్రతి అధికారి హోదా, ఏ గ్రామానికి ప్రత్యేకాధికారిగా ఉంటారు మొబైల్ నంబరు, వారు నిర్వహించే శాఖ తదితర సమాచారాన్ని క్రోడీకరించారు. 12,000ల మందికి పైగా అధికారులు, సిబ్బంది అవసరం ఉన్నందున ప్రస్తుతం దీర్ఘకాలిక సెలవులో ఉన్న వారిని వెంటనే విధుల్లో చేరాలని కలెక్టర్లు సమాచారం అందించారు. ప్రత్యేకాధికారుల నియామకానికి సంబంధించి ఈ నెల 29న సర్కార్ ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలిసింది. వచ్చే నెల 1న సర్పంచుల పదవీకాలం ముగుస్తున్నందున అంతకంటే ముందే ప్రత్యేకాధికారులు గ్రామాలను సందర్శించి రికార్డులను స్వాధీనం చేసుకోవాలని, ఆయా పంచాయతీలపై అవగాహన పెంచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించనుంది.
ప్రత్యేకాధికారుల జాబితాలో ఉండే అధికారులు..
తహసీల్దార్లు, ఎంపీడీవోలు, గ్రామీణ నీటి సరఫరా శాఖ (మిషన్ భగీరథ) సహాయ ఇంజినీర్లు, సమగ్ర శిశు అభివృద్ధి సేవాసంస్థ (ఐసీడీఎస్) సూపర్‌వైజర్లు, మండల పంచాయతీ అధికారులు, పంచాయతీరాజ్ సహాయ ఇంజినీర్లు, మండల విద్యాధికారులు, వ్యవసాయాధికారులు, పశువైద్యాధికారులు, మండల పరిషత్ సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, వ్యవసాయ విస్తరణాధికారులు, ఆరోగ్య శాఖ సూపర్‌వైజర్లు, ఉద్యాన అధికారులు, ఉప తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, టైపిస్టులు, గెజిటెడ్ హెడ్మాస్టర్లు, హెడ్మాస్టర్లు, స్కూలు అసిస్టెంట్లు ప్రత్యేకాధికారుల జాబితాలో ఉంటారు.
మరోవైపు తమ పదవీకాలాన్ని పొడిగించాలని తెలంగాణ సర్పంచుల సంఘం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరింది. పంచాయతీల ఎన్నికలు జరిగే వరకు అవకాశమివ్వాలని విజ్ఞప్తి చేసింది. ప్రత్యేకాధికారులను నియమించినా తాము విధులకు హాజరయ్యేలా అవకాశం కల్పించాలని తెలిపింది. ఈ మేరకు సర్పంచుల సంఘం నాయకులు సీఎంను కలిసి వినతిపత్రం అందజేశారు.