Monday, May 6, 2024

రాజస్థాన్‌లో దొరికిన ఫోన్ భాగాలు, నిందితుల దుస్తులు

తప్పక చదవండి
  • నిన్న ఆరో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
  • ఏడు రోజుల పోలీసు కస్టడీకి అప్పగించిన కోర్టు
  • నిందితులకు పాస్‌లు ఇచ్చిన బీజేపీ ఎంపీ ప్రతాప్‌సింహను విచారించనున్న అధికారులు
  • మీడియా దృష్టిని ఆకర్షించేందుకు తొలుత నిప్పు పెట్టుకోవాలని భావించిన నిందితులు
  • ఆపై ఆ ప్లాన్‌ను పక్కనపెట్టి పొగ డబ్బాలతో చాంబర్‌లోకి
  • చాలా సీరియస్ ఇష్యూ అన్న ప్రధాని… దీనిపై రాజకీయం చేయొద్దంటూ ప్రతిపక్షాలకు హితవు

పార్లమెంటు భద్రత ఉల్లంఘన ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఆరుగురు నిందితులు అరెస్టయ్యారు. నిందితులకు విజిటర్ పాస్‌లు ఇచ్చిన బీజేపీ ఎంపీ ప్రతాప్‌సింహను విచారించాలని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ భావిస్తోంది. ఈ కేసులో ఆరో నిందితుడైన మహేశ్ కుమావత్‌ను ఢిల్లీ పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు. ఈ మొత్తం ఘటనలో అతడి పాత్ర ఉన్నట్టు నిర్ధారించుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపారు. ఇంటరాగేషన్ కోసం కోర్టు అతడిని ఏడు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. పార్లమెంటు భద్రతా ఉల్లంఘన నిందితులకు సంబంధించిన కాలిపోయిన మొబైల్ ఫోన్లు, దుస్తులు, బూట్లను శనివారం పోలీసులు రాజస్థాన్‌లో గుర్తించారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి లలిత్ ఝా నిందితులందరి ఫోన్లు తీసుకుని తొలుత వాటిని పగలగొట్టాడు. ఆ తర్వాత కాల్చివేశాడు. మీడియా దృష్టిని ఆకర్షించేందుకు నిందితులు తమనుతాము గాయపరుచుకోకుండా జాగ్రత్త పడుతూ తమ శరీరాలపై అగ్ని నిరోధక జెల్‌ను పూసుకుని నిప్పంటించుకోవడం, లేదంటే కరపత్రాలను విసరడం వంటివి చేయాలనుకున్నారు. అయితే, ఆ తర్వాత వారు ఆ ఆలోచనను విరమించుకుని పొగ డబ్బాలతో లోక్‌సభ చాంబర్‌లోకి దూకాలని నిర్ణయానికి వచ్చి అదే అమలు చేసినట్టు విచారణాధికారులు తెలిపారు.

చాలా సీరియస్ ఇష్యూ అన్న ప్రధాని…

- Advertisement -

పార్లమెంట్ లో భద్రతా ఉల్లంఘనపై ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా స్పందించారు. ఇది చాలా సీరియస్ ఇష్యూ అని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ఈ ఘటనను అందరూ ఖండించాలని, దీనిపై రాజకీయం చేయొద్దని ప్రతిపక్షాలకు ఆయన హితవు పలికారు. బుధవారం లోక్ సభ విజిటర్స్ గ్యాలరీ నుంచి ఇద్దరు యువకులు సభలోకి దూకి, స్మోక్ క్యాన్లతో గందరగోళం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రధాని మోదీ స్పందిస్తూ.. సభలో భద్రతా లోపంపై సీరియస్ గా వ్యవహరించాలని కేబినెట్ మినిస్టర్లను ఆదేశించినట్లు తెలిపారు. ఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నట్లు మోదీ వివరించారు. మరోసారి ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని సెక్యూరిటీ సిబ్బందికి సూచించామన్నారు. మరోవైపు, పార్లమెంట్ లోపలా బయటా అలజడి సృష్టించిన ఈ కేసులో మొత్తం ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. కోర్టులో ప్రవేశపెట్టి కస్టడీకి తీసుకున్నారు. వీరిలో స్మోక్ అటాక్ సూత్రధారి లలిత్ ఝాను ప్రశ్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ స్పెషల్ సెల్ దర్యాప్తు జరుపుతోంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు