Saturday, July 27, 2024

లీకుల వీరుడు వీరారెడ్డి..

తప్పక చదవండి
  • ఒప్పొందాలకు తూట్లుపొడిచిన జీ.వీ.పీ.ఆర్.ఈ.ఎల్. సంస్థ..
  • మిషన్ భగీరథ ప్రాజెక్టులో గొలుసుకట్టు విధానానికి తెరలేపిన వైనం..
  • నిషేధంలో వున్న సబ్ కాంట్రాక్ట్ పద్దతితో ప్రభుత్వాన్ని మోసం చేసిన ఘనాపాటి..
  • నాశిరకం పనులతో లీకేజీలతో విలువైన మంచినీటిని మట్టిపాలు చేస్తున్న దుర్మార్గం..
  • హైడ్రో టెస్టులు నిర్వహించకుండా లంచాలతో జేబులు నింపుకున్న కొందరు ప్రభుత్వ అధికారులు..
  • ప్రభుత్వం ముందుచూపుతో ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ ప్రాజెక్ట్ కళ్ళు పొడిచేసిన దౌర్భాగ్యం..
  • ప్రజల గొంతు తడపాల్సిన ప్రాజెక్టు తో వారి గొంతు ఎండబెడుతున్న జీ.వీ.పీ.ఆర్.ఈ.ఎల్. సంస్థ..
  • తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తున్న సామాజిక కార్యకర్తలు..

ఒక్క చుక్కనీరు వృధా అయినా కొన్ని లక్షల గొంతులు ఎండిపోతాయి.. స్వచ్ఛమైన మంచినీరు అందించాలనే మహత్తర ఆశయంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ ప్రాజెక్టు కొందరు అవినీతిపరులైన ప్రభుత్వాధికారుల నిర్లక్ష్య వైఖరి, కాంట్రాక్టు చేపట్టిన సంస్థ ధనదాహంతో నీరుగారిపోతోంది..

నాశిరకం పనులతో ప్రజలకోసం సరఫరా అవుతున్న మంచినీరు లీకేజీలతో నేలపాలు అవుతున్నాయి.. కానీ నిబంధనలకు విరుద్ధంగా పనులు చేపట్టిన సంస్థ యాజమాన్యం మాత్రం కోట్ల రూపాయలు అక్రమంగా కూడబెట్టింది.. వారికి సహకరించిన అధికారులు సైతం తమ జేబులను నింపుకున్నారు.. ప్రభుత్వ ఆశయం ఎంత గొప్పదైనా అవినీతికి అలవాటుపడ్డ అధికారులు, కాంట్రాక్టర్లు తప్పుదోవ వాడుతుంటే ఆ ఆశయం బుగ్గిపాలు అవుతుంది.. జీ.వీ.పీ.ఆర్.ఈ.ఎల్. సంస్థ చేసిన నిర్వాకంతో దాదాపు 1450 కోట్ల రూపాయల ప్రజల సొమ్ము వృధా అయిపోవడం శోచనీయం.. అభివృద్ధి ఫలాలకు పథకాల వృక్షాలు ప్రభుత్వం నాటుతుంటే.. మొక్క స్థాయిలోనే ఆ వృక్షాలను అమానుషంగా నరికేస్తున్న ఇలాంటి వారిని ఎలా శిక్షించాలో ప్రభుత్వమే ఆలోచించాలి..

- Advertisement -

హైదరాబాద్: నల్గొండ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల ప్రజల గొంతు తడపడం కోసం స్వచ్ఛమైన మంచినీటిని అందించేందుకు తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టు నిర్వహణ కోసం.. జీ.వీ.పీ.ఆర్.ఈ.ఎల్. సంస్థ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరిగిన మిషన్ భగీరథ ప్రాజెక్ట్ ఒప్పందానికి తూట్లు పొడిచింది జీ.వీ.పీ.ఆర్.ఈ.ఎల్. సంస్థ.. కాగా మనదేశంలో గొలుసు కట్టు విధానాన్ని వ్యతిరేకించి, మల్టీ లెవెల్ మార్కెటింగ్ ను నిషేధించడం జరిగింది. కానీ జీవీపీఆర్ఈఎల్ సంస్థ, ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం సబ్ కాంట్రాక్టు ఇవ్వకూడదు.. కానీ నియమ, నిబంధనలు ఉల్లంఘించి సబ్ కాంట్రాక్టర్లకు వర్క ఆర్డర్ ఇస్తూ.. వారినుండి సెక్యూరిటీ డిపాజిట్ సైతం వసూలు చేయడం జరిగింది.

జీవీపీఆర్ఈఎల్ సంస్థకు మిషన్ భగీరథ లాంటి ఇంటింటికి మంచినీరు అందించే ప్రాజెక్ట్ నిర్వహణ పనుల అనుభవం లేకున్నా, కొందరు అధికారులు స్వార్థ ప్రయోజనాల కోసం వారికి తెలంగాణ రాష్ట్ర మహోన్నతమైన మిషన్ భగీరథ ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ అప్పగించడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఈ సంస్థకు ప్రాజెక్టుకు సంబంధించి యంత్ర సామాగ్రి, స్కిల్డ్, అన్ స్కిల్డ్ లేబర్ లేక పోయినా సుమారు 1450 కోట్ల మిషన్ భగీరథ ప్రాజెక్టును అప్ప చెప్పారంటే అధికారుల చిత్తశుద్ధి ఎంతవరకు ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు సంస్థలు ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం పూర్తిస్థాయిలో పనులు చేయడం జరిగింది. కానీ జీవీపీఆర్ఈఎల్ సంస్థ వారు చేసుకున్న ఒప్పందం ప్రకారం కాల వ్యవధిలో పని చేయకుండా ప్రాజెక్టును కాలయాపన చేయడం జరిగింది. ఇదే విషయమై అనేకసార్లు కొంతమంది అధికారులు వారితో లాలూచీపడి నాసిరకం పనులు చేస్తున్న సంస్థకు సహకరిస్తూ ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం ఇవ్వడం శోచనీయం.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, జీవీపీఆర్ఈఎల్ మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం మిషన్ భగీరథ ప్రాజెక్ట్ పూర్తి అయిన అనంతరం 10 సంవత్సరాల వరకు మరమ్మత్తులు, నిర్వహణ.. (ఆపరేషన్, మెయింటెనెన్స్) సంస్థనే చేయాలి.. కానీ నిబంధన ఉల్లంఘిస్తూ సరైన మరమ్మతులు కానీ, మెయింటినెన్స్ కానీ లేకపోవడం బాధాకరం. ఇంత జరుగుతున్నా పర్యవేక్షించాల్సిన అధికారులు ప్రేక్షక పాత్రలో ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది.. మెయింటెనెన్స్, నిర్వహణ విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు గత ఐదు నెలల నుండి జీ.వీ.పీ.ఆర్.ఈ.ఎల్. సంస్థ జీతాలు చెల్లించకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనం. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ లో ఉద్యోగస్తులకు జీతాలు చెల్లించకుంటే, వారి విధి నిర్వహణ నిర్లక్ష్యంగా ఉండి ప్రజలకు నాణ్యత మైన మంచినీళ్లు అందగలవా..? వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ లో ఉద్యోగస్తులకు త్వరితగతిన జీతాలు అందించి సక్రమంగా మరమ్మతులు, నిర్వహణ లోపం రాకుండా చూడాలని అధికారులు సంస్థను హెచ్చరించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది..

జీ.వీ.పీ.ఆర్.ఈ.ఎల్. సంస్థ నిర్లక్ష్యంతో వెలుగుచూసిన లీకేజీల వ్యవహారం :

  1. కాల్వపల్లి గుట్ట 400 డయా డీఐ పైప్ లీకేజీ ప్రతి గంటకూ సుమారు 600 లీటర్ల నీరు వృధా అవుతోంది.. ఒక్క రోజుకు 14400 లీటర్లు.. నెలరోజులకు 4,30,000 లీటర్ల నీరు వృధాగా పోతోంది..
  2. కాల్వపల్లి గుట్ట పేడస్ట్రాల్ వేయకుండా వదిలివేశారు, స్టీల్ మాత్రమే కట్టి కాంక్రీట్ వేయలేదు.. ఎయిర్ వాల్స్ కి జాలీతో బందోబస్తు లేదు.. దీనితో ఎక్కువుగా ఎయిర్ వాల్స్ లీక్ అవుతున్నాయి..
  3. కొన్ని ఎయిర్ వాల్స్ మీద జాలీ లేకపోవడం వలన దానిమీద వున్న బెండ్ దొంగతనానికి గురి అవుతున్నాయి..
  4. కాల్వపల్లి గుట్టమీద ఉన్న డీఐ, ఎం.ఎస్. పైపుల మధ్య మెయింటనెన్స్ లేకపోవడం వలన భారీ వృక్షాలు మొలిచాయి..
  5. అనంతపురం ఎదురుగా ఉన్న కోళ్లఫారం కూడలి యందు వేసిన అండర్ గ్రౌండ్ పైపులు లీకేజీ అవుతున్నాయి..
  6. రామ్ నగర్ బంధం నిర్వహణా లోపం వలన స్టీల్ బ్రిడ్జ్ తుప్పుపట్టి పోయింది..
  7. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ లో ఉన్న ఫిల్టర్ ట్యాంక్స్ నిర్వహణ సరిగా లేకపోవడం వలన అడుగు పాచీ పేరుకుపోయింది.. వేస్ట్ వాటర్ ను పంట కాల్వలకు తరలించడం వలన కాల్వలో బురద పేరుకుపోయిది.. ఆ కాల్వ మరమత్తు చేసే పరిస్థితి ఏర్పడింది..
  8. దామెరచర్ల సబ్ స్టేషన్ పక్కన రైల్వే ట్రాక్ టన్నల్ కాంక్రీట్ పనులు చేపట్టలేదు.. పొరబాటున వరదవచ్చి, టన్నల్ ద్వారా రైల్వే ట్రాక్ కొట్టుకుని పోయినట్లయితే భారీ ఎత్తున ప్రమాదం జరుగవచ్చు..
  9. బాతులపాలెం వద్ద నాశిరకం, సెకెండ్ హ్యాండ్ ఎం.ఎస్. పైపు వాడారు.. దీనికి అధికారులు పర్మిషన్ ఇవ్వడం జరిగింది.. సుమారు 1450 కోట్ల రూపాయల విలువగలిగిన మిషన్ భగీరథ పనులకు ఇలాంటి సెకెండ్ హ్యాండ్ పైపులు వాడటం ఎంతవరకు సబబు..

ఇన్ని తప్పుల తడకలతో జరిగిన నాశిరకం పనులకు అధికారులు అనుమతులు ఇవ్వడం వెనుక.. ఎంతటి అవినీతి దాగివుందో..? తెలిసిపోతోంది.. లంచాలకు కక్కుర్తి పడ్డ అధికారులు హైడ్రో టెస్ట్ నిర్వహించకపోవడం వలనే ఈ తప్పిదాలు జరిగాయని నిపుణులు పేర్కొంటున్నారు.. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం జీ.వీ.పీ.ఆర్.ఈ.ఎల్. చైర్మన్ జీ.ఎస్.పీ. వీరారెడ్డి, హోల్ టైం టైం డైరెక్టర్ శివశంకర్ రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ శేఖర్ రెడ్డి, ప్రాజెక్టు పర్యవేక్షకురాలు సునీతా రెడ్డిలపై సమగ్ర విచారణ చేపట్టి, కఠిన చర్యలు తీసుకోవాలని, నాశిరకం పనులు చేసి ప్రభుత్వాన్ని మోసం చేసి పూర్తి బిల్లులు పొందిన జీ.వీ.పీ.ఆర్.ఈ.ఎల్. సంస్థనుండి రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం ప్రభుత్వం శాంక్షన్ చేసిన సొమ్మును అణాపైసాతో సహా తిరిగి రాబట్టాలని.. వారిపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని, ఈ సంస్థ భవిష్యత్తులో ఎలాంటి కాంట్రాక్టులు చేయకుండా బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని సామాజిక వేత్తలు కోరుతున్నారు.. అదే విధంగా వీరికి సహకరించిన ప్రభుత్వ అధికారులను కూడా విచారించి, వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుని ప్రభుత్వ ఆశయాన్ని సజీవంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.. ఇంతటి భారీ అవినీతి తతంగం జరగడానికి ఏఏ అధికారులు సహకరించారు..? ఎవరెవరికి ఎంతెంత మేర సొమ్ములు ముట్టాయి..? అసలు ఈ ప్రాజెక్టు వెనుక దాగిఉన్న వాస్తవాలను మరో కథనం ద్వారా వెలుగులోకి తీసుకుని రానుంది.. ‘ ఆదాబ్ హైదరాబాద్ ‘.. ‘ మా అక్షరం అవినీతిపై అస్త్రం ‘..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు