- ఘాటు విమర్శలు చేసిన కూన శ్రీశైలం గౌడ్..
- ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా?
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు బాటసింగారంకు వెళ్లకుండా అడుగడుగునా పోలీసులు బీజేపీ నాయకులను, కార్యకర్తలను అడ్డుకున్నారు. తెల్లవారు జాము నుండే కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలోని బీజేపీ నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేసి సూరారం, జగద్గిరిగుట్ట, బాచుపల్లి, జీడిమెట్ల, దుండిగల్ పోలీస్ స్టేషన్ లకు తరలించగా, మరి కొంతమందిని గృహ నిర్బంధం చేసారు. కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ని ఆయన నివాసం వద్ద జీడీమెట్ల ఎస్సై ఆంజనేయులుతో పాటు నలుగురు పోలీసులు ఉదయం నుండే అరెస్ట్ చేసే ప్రయత్నం చేయగా, పోలీసుల కళ్ళు కప్పి ఆయన నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ సర్కారు అవినీతి, డొల్లతనం ఎక్కడ బయటపడుతుందో అనే భయంతోనే డబుల్ బెడ్రూం ఇళ్లను పరిశీలించడానికి వెళ్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అరెస్ట్ చేశారని మండిపడ్డారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తో పాటు బిజెపి నాయకులు, కార్యకర్తలను అక్రమ అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద కేంద్రం రాష్ట్రానికి లక్షన్నర ఇండ్లను మంజూరు చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను పక్కదారి పట్టించి పేద ప్రజలను నట్టేట ముంచిందని పేర్కొన్నారు. నిర్మించిన అరకొరా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు శిథిలావస్థకు చేరుకుంటున్నాయని అన్నారు. పోలీసులు బీఆర్ఎస్ పార్టీ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని, గులాబీ కండువాలు వేసుకోవడం ఒకటే తక్కువని ఎద్దేవా చేశారు. సొంత ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చేంతవరకు మా పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ప్రజలను మోసం చేయడం… అక్రమ అరెస్టులు చేసినంత ఈజీ కాదని,డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తానని చెప్పి మోసం చేస్తున్న కెసిఆర్ సర్కార్ కి ప్రజలే తగిన బుద్ధి చెప్తారని అన్నారు. అక్రమంగా అరెస్టు చేసిన బిజెపి నాయకులు, కార్యకర్తలు అందరినీ తక్షణమే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.