Friday, May 3, 2024

ఖైరతాబాద్ లో ‘దానం’కు చుక్కెదురు..

తప్పక చదవండి
  • మళ్ళీ కాంగ్రేసు గూటికే చేరాలని తహ తహలాడుతున్న దానం.
  • ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం, పలువురు సీనియర్లతో భేటీ..
  • స్వంత పార్టీలోనే దానంకు అసమ్మతి సెగ..
  • ఆయనకు వ్యతిరేకంగా ఊపందుకున్న కార్యక్రమాలు..
  • కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగుతుందని ప్రచారం జరుగుతున్న ప్రజానేత
    పీ. జనార్దన్ రెడ్డి కూతురు విజయా రెడ్డిని ఎదుర్కొనే శక్తి దానంకి ఉందా..?
  • దిక్కుతోచని స్థితిలో దానం .. ఏ పార్టీ నుంచి పోటీకి దిగుతారని సందిగ్దత..
  • టికెట్ మన్నే గోవర్ధన్ రెడ్డ్డికే నంటూ నియోజకవర్గంలో టాక్..

నాటకీయ పరిణామాల నేపథ్యంలో తెరాసలో చేరిన దానం నాగేందర్ ఆ పార్టీ శ్రేణులతో ఇముడలేకపోతున్నారు. దీంతో మళ్ళీ ఆయన కాంగ్రేసు గూటికి చేరాలనుకుని తనకున్న పాత స్నేహాలను అడ్డుపెట్టుకుని విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. పిజేఆర్‌ ప్రధాన అనుచరుడిగా తన రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టిన దానం అనతికాలంలోనే రాజకీయంగా శక్తిగా ఎదిగి రెండుసార్లు ఆసిఫ్‌నగర్‌ నుంచి గెలుపొందారు . 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ దానం నాగేందర్‌కు టిక్కెట్‌ నిరాకరించడంతో ఆఖరి నిమిషం వరకు వేచి చూసిన దానం, రాత్రికి రాత్రి కాంగ్రెస్‌ కండువా విడిచేసి తెలుగుదేశం పార్టీ కండువ కప్పుకున్నారు. తనకు టికెట్ నిరాకరించిన ఆసిఫ్‌ నగర్‌ నుంచి టిడిపి బీఫామ్‌ తెచ్చుకుని పోటీ చేసి గెలుపొందిన దానం అనూహ్యంగా టీడీపీ ఓడిపోవడంతో తిరిగి కాంగ్రెస్‌ గూటిలోకి చేరిపోయారు. ఇప్పుడు కూడా బి.ఆర్.ఎస్. అధిష్టానం టికెట్ నిరాకరిస్తే దానం కాంగ్రేసు కండువా కప్పుకుంటారా..? లేక టీడీపీ గూటికే చేరిపోతారా..? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది.

దానం రాజకీయ జీవితమంతా జంపింగ్‌ల మయమే :
దానం నాగేందర్ విభిన్నమైన రాజకీయ చతురత కలిగిన నాయకుడు.. తన రాజకీయం జీవితాన్ని నిలబెట్టుకోవడానికి ఏ పార్టీ నుంచయినా టికెట్ తెచ్చుకుని పోటీ చేయగలిగే సమర్ధుడు . ఏ ఎండకాగొడుగు పట్టడం దానంకు కొత్తేమి కాదు.. ఆయన రాజకీయ జీవితమంతా జంపింగ్‌ల మయమే. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో ఆయనకే తెలియని అయోమయ పరిస్థితి. దానం నాగేందర్‌ బి.ఆర్.ఎస్.లో అతి కష్టం మీద కొనసాగుతున్నాడని అతని సన్నిహితులు పదే పదే చెబుతున్న మాట. అనూహ్యంగా 2014 ఎన్నికల్లో ఓడిపోయిన దానం, నాటకీయ పరిణామాల నేపథ్యంలో బి.ఆర్.ఎస్.లో చేరారు. బి.ఆర్.ఎస్.లో చేరిన తరువాత ఆ పార్టీ శ్రేణులతో దానం కలిసిపోలేకపోయారు. నియోజకవర్గంలో నిత్యం ఆయనపై వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి.. పైపచ్చు ఆయనపై పేరుకుపోయిన అవినీతి మరకలు ఆయనను ఉక్కిరిబిక్కరి చేస్తున్నాయి. దీనికి తోడు నాయకులను, కార్యకర్తలను పట్టించుకోడని దానం నాగేందర్ ఫై స్వంత పార్టీ నేతలే అసమ్మతి గళాన్నివినిపించడం దానంను కారులో కుదురుగా కోర్చోనివ్వడంలేదని తెలుస్తోంది. కరోనా కష్ట కాలంలో కూడా దానం ప్రజలకు ముఖం చాటేశాడని నియోజకవర్గంలో ప్రచారం ఉంది. నియోజకవర్గంలో అభివృద్ధిని దానం పూర్తిగా విస్మరించాడని బారాస కార్యకర్తలే బహిరంగ విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బి.ఆర్.ఎస్. అధిష్టానం దానంకు టికెట్ నిరాకరించవచ్చనే ప్రచారం జరుగుతుంది. ఒకవేళ దానంకు నిరాకరిస్తే ఇటీవల ప్రజలకు చేరువయిన మన్నే గోవర్ధన్ రెడ్డ్డికేనంటూ నియోజకవర్గంలో టాక్ నడుస్తోంది. నిజానికి దానంకు నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆయనకు టికెట్ ఇస్తే ఓడిపోవడం పక్కా అని బి.ఆర్.ఎస్. నాయకులే చెప్పడం గమనార్హం. దానంకు టికెట్ ఇవ్వొద్దని ఓ వర్గం పనిగట్టుకుని అధిష్టానం వద్ద ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టింది. ఇక ఆయనపై వినిపిస్తున్న అవినీతి ఆరోపణలు, కార్యకర్తలకు ఆయనకు పొసగలేని తనం ఆయన రాజకీయ భవిషత్తుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు కనబడుతున్నాయి.

- Advertisement -

మోసం చేయడం దానంకి కొత్తేమీ కాదు :
అక్కున చేర్చుకొని, రాత్రికి రాత్రి పార్టీలో చేరిన వ్యక్తికి టిక్కెట్టు ఇచ్చిన చంద్రబాబును, ఆ పార్టీని దానం దారుణంగా మోసం చేశాడు. అలాంటి వ్యక్తి మళ్లీ కాంగ్రెస్‌లోకి వస్తానంటే రేవంత్‌ రెడ్డి ఆహ్వానిస్తాడా..? అన్నది సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోయింది. దానం ఎలాగైనా కాంగ్రెస్‌లో చేరేందుకు చేయాల్సినన్ని ప్రయత్నాలన్నీ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ లోని సీనియర్లతో కూడా రేవంత్‌కు దానం తన ఉద్దేశ్యాన్ని చెప్పినట్లు తెలుస్తోంది. దానం ఎత్తుగడను గ్రహించిన రేవంత్ ఎలాగైనా దానంకు చెక్ పెట్టాలన్న ఆలోచనలో ప్రజాసేవకు అంకితమైన పిజేఆర్‌ కుటుంబాన్ని మళ్లీ క్రియాశీలకం చేయాలనుకున్నారు. కార్పోరేటర్‌ విజయారెడ్డిని కాంగ్రెస్‌లోకి తెచ్చి, ఖైతరాబాద్‌ టిక్కెట్‌ నీకే అని అభయమిచ్చాడు. దీంతో దానం ఆశలను ఆదిలోచే రేవంత్‌ తుంచేశాడు.

కాగా ఖైరతాబాద్ నియోజకవర్గంలో స్వర్గీయ పీజేఆర్ కి ఆయన కుటుంబానికి ప్రజల్లో తరగని అభిమానం వుంది.. పిలిస్తే పలికే ప్రజానేతగా ఆయనకు పేరుంది.. ఆయన వారసత్వాన్ని వంటబట్టించుకున్న ఆయన కుమార్తె కార్పొరేటర్ విజయారెడ్డి నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సంక్షేమం కోసం పనిచేస్తుండటం కలిసివచ్చే అంశం.. పేదల పక్షపాతిగా పేరుపొందిన సర్గీయ పీజేఆర్ పేరు చాలు ఆమె గెలుపుకు నల్లేరుమీద నడకే అన్న అభిప్రాయం అందరితోనే ఉంది.. ఇది కూడా దానంకి మైనస్ అవుతుంది అన్నది రాజకీయ విశ్లేషకుల వాదన.. నిజంగా దానం పీజేఆర్ కూతురు విజయారెడ్డిని ఎదుర్కొని నిలబడగలదా అన్నది ప్రశ్నార్థకమే..

ఈ విషయం ఆనోట, ఈ నోట కారు బి.ఆర్.ఎస్. పెద్దల చెవిన పడిందట .. బి.ఆర్.ఎస్. లోనూ దానం విషయంలో పార్టీ పునః పరిశీలన చేయాలన్నంత దాకా వచ్చింది. దాంతో అన్ని వైపులా దారులు మూసుకుపోయిన దానం నాగేందర్‌ కు ఎటూ పాలుపోని స్ధితిలోకి నేట్టేసినట్లైంది.

టికెట్ మన్నే గోవర్ధన్ రెడ్డ్డి కంటూ ప్రచారం :
పూర్తిగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న దానం ఎలాగయిన ఈ సారి ఖైరతాబాద్ టికెట్ దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు. అయితే నియోజకవర్గంలో పేరుకుపోయిన అసమ్మతి, పలు అవినీతి ఆరోపణలు దానం రాజకీయ జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపనున్నాయి. అయితే గతంలో పోటీ చేసి ఓడిన మన్నే గోవర్ధన్ రెడ్డి బి.ఆర్.ఎస్. టికెట్ ఆశిస్తున్నావారిలో ఉన్నారు. అయితే అధిష్టానం అతనికే మొగ్గు చూపే అవకాశాలు ఉన్నట్లు నియోజకవర్గంలో ప్రచారం జరుగుతుంది. నాయకులను, కార్యకర్తలను కలుపుకుని పోతున్న మన్నే గోవర్ధన్ రెడ్డ్డి కి ఖైరతాబాద్ నియోజకవర్గంలో మంచి పేరుంది. నియోజకవర్గంలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ఆయన పాలుపంచుకుంటూ ప్రజలు మధ్యన తిరుగుతున్నారని అధిష్టానం దృష్టిలో ఆయనకు సాఫ్ట్ కార్నర్ ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనకు బి.ఆర్.ఎస్. అధిష్టానం టికెట్ ఇవ్వడం ఖాయమన్న ప్రచారం జరుగుతుంది. ఆయన తన గెలుపుకోసం నాయకులను, కార్యకర్తలను కలుపుకుని నియోజకవర్గంలోని పలు బస్తీలలో తిరుగుతూ ప్రజలు మద్దత్తు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయనకు టికెట్ ఇస్తే గెలుపు సునాయాసమని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు