- కల్లూరికి టికెట్ ఇవ్వాలని కోరుతున్న ఆలేరు కాంగ్రెస్ శ్రేణులు..
హైదరాబాద్ :
ఆలేరు నియోజకవర్గం కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున కల్లూరికి మద్దతు పలుకుతున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో కల్లూరి కార్యకర్తలకు అండగా ఉంటూ.. పార్లమెంటు, మున్సిపల్, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయం కోసం ఆర్థికంగా, హార్దికంగా సహకరించి పార్టీ బలోపేతం కోసం కృషి చేసిన కల్లూరికే టికెట్ ఇవ్వాలని ఈ సందర్భంగా అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా కల్లూరి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఆలేరు ప్రజలకు సేవ చేయడానికి తాను కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించారు.. తన కష్టార్జితం డబ్బులతోనే గాంధీభవన్ లో రూ. 50,000 పెట్టి దరఖాస్తు కొనుగోలు చేసి, అభ్యర్థిత్వం కోసం దరఖాస్తు సమర్పించినట్లు వెల్లడించారు. తన జీవితం శ్వేత పత్రం లాంటిదని వివరించారు. ఆలేరు నియోజకవర్గంలో తాను ఇప్పటివరకు ఎవరి భూములు గుంజుకోలేదని, అక్రమ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయలేదని, సెటిల్మెంట్లు తనకు తెలియదని, తాను చేసిన వ్యాపారంలో వచ్చిన డబ్బులతో కుటుంబ అవసరాలకు సరిపోగా మిగతా డబ్బులను ఆలేరు ప్రజల అవసరాల కోసం వెచ్చించినట్లు చెప్పారు. ఎన్నికల వేళ ఆలేరు ప్రజలు ఎవరిని ఎన్నుకోవాలో ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ప్రజల కోసం నిస్వార్ధంగా సేవ చేసే నాయకులు కావాలా? మాయ మాటలు చెప్పి ఓట్లు పొంది అధికారంలోకి వచ్చాక ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి నాయకులు కావాలా..? తేల్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నేను రాజకీయాలకు వచ్చింది సేవ చేయడానికి మాత్రమే అని నొక్కి వక్కాణించారు..