Wednesday, April 24, 2024

అవినీతి వసూళ్ళలో ఇన్ స్టాల్ మెంట్ స్కీం.. !

తప్పక చదవండి
  • గొర్రెల యూనిట్ల కేటాయింపులో లబ్ధిదారులను బకరాలను చేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్
  • బరితెగించిన అధికారి బాబు బేరి..
  • కరప్షన్ లో ఈయనకు ఈయనే సరి..
  • డైరెక్టర్ కి చెల్లించాలంటూ వసూలు..
  • అంత స్థోమత లేదన్నా వదలని పిశాచం..
  • లబోదిబోమంటున్న బాధితుడు గంటా నాగిరెడ్డి..
  • నాగిరెడ్డి నుండి రూ. 40 లక్షలు కాజేసిన బాబు బేరి..
  • పశు, వైద్య మరియు పశుసంవర్ధక శాఖలో జరిగిన అవినీతి
  • కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్రంగా విచారించాలంటున్న రైతులు

ఏదైనా ప్రభుత్వ స్కీం వస్తుందంటే ఆశపడతారు.. అదే విధంగా గొర్రెల పెంపకం లాభసాటిగా ఉంటుందని ఆ వ్యాపారం వేపు మొగ్గు చూపాడు ఒక ఆశావాహుడు.. గుంటూరు జిల్లా, మాచర్ల మండలం, జమలమడక గ్రామానికి చెందిన రైతు.. అప్పట్లో తెలంగాణ ప్రాంతంలోని నాలుగు జిల్లాల్లో గొర్రెల యూనిట్ కోసం దరఖాస్తు చేసుకుంటే.. సదరు కార్యాలయంలో విధులు వెలగబెట్టే అసిస్టెంట్ డైరెక్టర్ ఈ వ్యక్తికి 5వేల గొర్రెల యూనిట్లు కేటాయిస్తానని మాయమాటలతో, బలవంతంగా ఒప్పించి.. దాదాపు రూ. 40 లక్షలు దొబ్బేశాడు.. ఆ కథా కమామీషు ఒక సారి చూద్దాం..

హైదరాబాద్ : ఎవరికైనా పెడతానంటే ఆశ కలుగుతుంది.. అలాగే కొడతామంటే భయం కలుగుతుంది.. అదే జరిగింది ఒక గొర్రెల అమ్మకదారుని జీవితంలో.. 2018లో గుంటూరు జిల్లాకు చెందిన గంటా నాగిరెడ్డి అనే అమ్మకదారుని.. గద్వాల్, నాగర్ కర్నూల్, సంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు గొర్రెల యూనిట్లు సప్లయ్ చేయడం జరిగింది. ఈ వ్యాపారం లాభసాటిగా ఉన్నందున మరిన్ని యూనిట్లు పొందాలన్న ఆలోచనతో పశు, వైద్య మరియు పశుసంవర్ధక శాఖ కేంద్ర కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా విధులు వెలగబెడుతున్న బాబు బేరి అనే ఒక ఉన్మాది.. గొర్రెల యూనిట్లు శాంక్షన్ కావాలంటే తన పరిమిషన్ అవసరమని.. అవన్నీ తానే చూసుకుంటానని నమ్మబలికి ఒక యాభై లక్షల రూపాయలు సర్దుబాటు చేయగలిగితే 5000 యూనిట్లు కేటాయిస్తానని చెప్పడంతో.. అవాక్కయిన నాగిరెడ్డి తాను నిరుపేదనని, అంత సొమ్ము చెల్లించలేనని వాపోయాడు.. దానికి మన బూబు బేరి ఒక మహత్తరమైన పథకం వేసి.. పూర్తి సొమ్ము ఒకేసారి చెల్లించవలసిన అవసరం లేదు.. విడతల వారీగా చెల్లించమని ఒక సలహాని బలవంతంగా నాగిరెడ్డి నెత్తిన రుద్దాడు.. ఎటూ పాలుపోని ఆ వ్యక్తి ఆలోచించి తన జీవితంతో పాటు తన కుటుంబం కూడా బాగుపడుతుంది అని కష్టమైనా తన మనసుకు సర్ది చెప్పుకుని.. అప్పో సొప్పో చేసి, తల తాకట్టు పెట్టి సదరు బాబు బేరి సెలవిచ్చినట్లుగా 2019 జనవరి 05వ తేదీన డైరెక్టర్ కు ఇవ్వాలని రూ. 10 లక్షలు, 2019 జనవరి 15వ తేదీన బాబు బేరి కారులో రూ. 10 లక్షలు, 2019 ఫిబ్రవరి లో ఎమ్యెల్యే క్వాటర్స్ లో రాజయ్య కు ఇవ్వాలని రూ. 2లక్షలు, అదే నెలలో మరల రాజయ్య యాదవ్ కు ఇవ్వాలని రూ. 3 లక్షలు, అదే నెలలో వరంగల్ జిల్లా జె.డి. ప్రవీణ్ కి యూనిట్ల నిమిత్తం రూ. 5 లక్షలు ఇమ్మన్నారు. మరల అదే నెలలో బాబు బేరికి కారులో రూ. 10 లక్షలు చెల్లించినట్లు మంత్రి శ్రీనివాస్ యాదవ్ కు ఇచ్చిన పిర్యాదులో పేర్కొన్నారు. కానీ బాబు భేరీ ఎలాంటి యూనిట్లను కేటాయించలేదు.. అంతే కాకుండా సదరు బాబు భేరీతో తాను సంభాషించిన కాల్ డేటా అంతా ఉందని.. ఆ వివరాలను బాధితుడు.. ఆదాబ్ హైదరాబాద్ కి తెలిపాడు.. మరియు ఆ వివరాలను అప్పగించడం జరిగింది..

- Advertisement -

కాగా 20 మార్చి 2019 నాడు సదరు కేటుగాడైన బాబు బేరి.. వరంగల్ జిల్లాకు సంబంధించిన 54 యూనిట్లకు చెందిన రైతులను, బాధితుడైన గంటా నాగిరెడ్డి వద్దకు పంపించాడు.. దాంతో నాగిరెడ్డి 54 యూనిట్లను సరఫరా చేసి, సంబంధించిన బ్యాంక్ అకౌంట్లను డా. ఓధర్మా నాయక్ కు పంపించాడు.. కానీ నాగిరెడ్డికి 48 యూనిట్లకు సంబంధించిన పైకం వేసి.. మిగిలిన 8 యూనిట్లకు సంబంధించిన డబ్బులు పంపలేదని బాధితుడు వాపోయాడు.. కాగా గొర్రెలు ఇచ్చిన రైతులు తనపై వత్తిడి తేవడంతో తనకు మిగిలిన ఒక్క ఎకరం పొలాన్ని వారికి రాసివ్వడం జరిగిందని నాగిరెడ్డి కన్నీటి పర్యంతం అయ్యాడు.. ఈ విధంగా తాను అప్పులు చేస్తూ సదరు బాబు బేరి అడిగినప్పుడల్లా చెల్లించానని, యూనిట్లు వస్తాయనే ఆశతోనే తాను ఈ సాహసం చేసానని తెలిపాడు.. ఇక చివరికి అప్పుల వాళ్ళ బాధ భరించలేక.. తనకున్న యావదాస్థి 3 ఎకరాలు అమ్మేసి.. దాంతో వీలైనన్ని అప్పులు తీర్చివేసి, మిగతా అప్పులు తీర్చలేక.. ఊర్లో ముఖం చూపించలేక.. కుటుంబాన్ని అనాధలుగా వదిలేసి.. ఎవరికీ కనిపించని చోట దాక్కొని చావలేక బ్రతుకుతున్నాని ఆయన తెలిపారు..

కనుక తనను తన కుటుంబాన్ని రక్షించే దిశగా అప్పటి సంబంధిత శాఖ అయిన, పశు సంవర్ధక శాఖ మంత్రి.. తలసాని శ్రీనివాస్ యాదవ్ ని వేడుకుంటూ తనకు జరిగిన అన్యాయాన్ని.. సదరు దుర్మార్గుడైన అసిస్టెంట్ డైరెక్టర్ బాబు బేరి చేసిన ద్రోహాన్ని తెలియజేస్తూ 28 జూన్ 2021 నాడు బాధితుడు గంటా నాగిరెడ్డి ఒక వినతి పత్రాన్ని సమర్పించాడు.. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయిన ఆ బాధితుడికి న్యాయం జరగలేదు.. తనకు తన కుటుంబానికి ఇక ఆత్మహత్యే శరణ్యం అంటూ వాపోతున్నాడు బాధితుడు..

ఈ విదంగా బాబు బేరి పశు, వైద్య మరియు పశుసంవర్ధక శాఖ కేంద్ర కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తూ అక్రమాలకు తెరలేపాడు. తనకు నచ్చిన వారికీ, తనకు ముడుపులు చెలించిన మధ్యవర్తులకు యూనిట్లు కేటాయించాలని జిల్లా అధికారులకు మాజీ డైరెక్టర్ వంగాల లక్ష్మా రెడ్డి ద్వారా ఒత్తిడి చేయించి, యూనిట్లను కేటాయించి, అక్రమ సంపాదనకు తెగబడ్డారు. మాజీ డైరెక్టర్ వంగాల లక్ష్మా రెడ్డి ఆధ్వర్యంలో సుమారు రూ. 3 లక్షల 66వేల గొర్రెల యూనిట్లను రైతులకు అందజేసినట్లు తెలుస్తుంది.
ఈ కేటాయింపులలో అదికంగా రిసైల్కింగ్, కొంతమంది రైతులకు 21 గొర్రెలు ఇచ్చే చోట 16 గొర్రెలని ఇచ్చి, పూర్తిగా గొర్రెలను సరఫరా చేసినట్లు తప్పుడు రికార్డ్స్ నమోదు చేసి ప్రభుత్వ సొమ్మును కాజేశారు. అంతే కాకుండా ప్రభుతం నిర్ణయించిన యూనిట్ల విలువకు రైతు చెల్లించాల్సిన దానికంటే అధిక మొత్తంలో రైతుకు ఎదురు చెలించి పూర్తిగా గొర్రెల యూనిట్లను సప్లయ్ చేసినట్లు రికార్డు లు సృష్టించి ప్రభుత్వ సొమ్మును మాయం చేశారు. ఈ విదంగా అనేక కోణాలలో బాబు బేరి, వంగాల లక్ష్మారెడ్డి అవినీతికి పాల్పడ్డారు. నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ గొర్రెల పంపకం స్కీమ్ లో జరిగిన అవినీతి బాగోతంపై సమగ్రంగా విచారిస్తే భారీ కుంభకోణం, తెరవెనుక ఉన్న అధికారులు, నాయకుల చిట్టా బట్టబయలవుతుంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు