- ప్రజల సొమ్మును పందికొక్కుల్ల మేసిన బీఆర్‌ఎస్ నేతలు
- నెలరోజులైనా కాకముందే మాపై విమర్శలా…
- కాళేశ్వరంపై విచారణ అనగానే వణుకు
- అక్రమాల్లో ఎవరి వాటా ఎంతో తేలుతుంది
- మంచిని జీర్ణించుకోలేకే కేటీఆర్ చిల్లర మాటలు
- తొమ్మదిన్నరేళ్లు తెలంగాణను అడ్డంగా దోచుకున్నారు
- బీఆర్‌ఎస్‌పై మంత్రి కొండా సురేఖ ఘాటు విమర్శలు
వరంగల్ : తెలంగాణలో గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటూ నిర్మించిన ప్రాజెక్టు కాళేశ్వరంలో లోపాలపై న్యాయ విచారణ అనగానే మాజీ సీఎం కేసీఆర్ ఆయన తనయుడు, కేటీఆర్‌లో వణుకు మొదలైందని అటవీ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం తొమ్మిదిన్నర ఏండ్లలో అమలు చేయలేని కనీస అవసరాలను నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుంటే జీర్ణించుకోలేక కేటీఆర్ చిల్లర మాటలు మాట్లాడుతున్నారని మంత్రి కొండా సురేఖ అన్నారు. కాళేశ్వరంపై న్యాయ విచారణ అనగానే.. బీఆర్‌ఎస్ అగ్రనేతల్లో, మాజీ మంత్రుల్లో వణుకు మొదలైందన్నారు. అందులో ఎవరెవరి వాటా ఎంత? ప్రజాధనం ఎంత దుర్వినియోగమైందో కక్కించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇంకా నెల కూడా కాలేదు.. కనీసం 100 రోజులు సమయం ఇవ్వకుండా అప్పుడే 100 రోజుల్లో ప్రభుత్వం పడిపోతదని మంత్రి కేటీఆర్, బీఆర్‌ఎస్ నేతలు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. కేటీఆర్ ఏమి మాట్లాడుతున్నారో కొంచెం ఆలోచించి మాట్లాడితే బాగుంటదని మంత్రి సురేఖ హితవు పలికారు. తొమ్మిదిన్నర సంవత్సరాల కాలం పాటు ప్రజల సొమ్ముని దోచుకుని, అడ్డంగా బలిసి.. తెలంగాణ ప్రజల గురించి మాట్లాడే నైతిక హక్కును బీఆర్‌ఎస్ నేతలు కోల్పోయాని చెప్పారు. ఉద్యమకారులను అన్యాయంగా బయటకు పంపింది ఎవరు, ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నది బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాదా అని కేటీఆర్‌ను ప్రశ్నించారు. మహిళలపై దాడులు జరిగినప్పుడు గానీ, కొండగట్టు వద్ద జరిగిన ఘోర ప్రమాదం లో 63 మంది చనిపోతే స్పందించని నేతలకు ఇప్పుడు నోరు లేస్తుంది ఎందుకంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులకు మూడెకరాల భూమి ఏమైంది.. తెలంగాణకు దళితుడిని తొలి ముఖ్యమంత్రి చేస్తామని చెప్పిందెవరు ? రైతుల రుణమాఫీ ఇస్తామని ఎగ్గొట్టింది ఎవరో చెప్పాలని నిలదీసారు. తొమ్మిది న్నరేండ్ల పాలనలో రాష్ట్రంలో విధ్వంసం జరిగింది. బీఆర్‌ఎస్ అహంకారంతో పరిపాలన అస్తవ్యస్త మైందన్నారు. అధికారం కోల్పోగానే ఇప్పుడు ప్రజలపై ప్రేమ, అనురాగాలు పుట్టుకొచ్చాయా. ప్రజల కోసం తొలిరోజు నుంచే పనిచేస్తున్న తమ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించడం సిగ్గుచేటని మంత్రి కొండా సురేఖ అన్నారు. అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే ఇచ్చిన అభయహస్తం గ్యారంటీ హామీలను అమలు చేస్తున్నాం. ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మీ కుటుంబంలోని మహిళలనో, మీ పార్టీ మహిళా లీడర్లనో ఒక్కసారి ఆర్టీసీ బస్సులో ఒక్కసారి ప్రయాణం చేయాలని చెప్పండి. మా హామీలు అమలవుతున్నాయో లేదో తెలుస్తుంది. ప్రజలను లైన్లలో నిలబెట్టి.. ప్రతిరోజు ప్రజలను గోస పెడుతున్నమని మాట్లాడటం కేటీఆర్ అహంకారానికి నిదర్శనం. గడీలు, ఫామ్ హౌజ్లో ఉన్న కేసీఆర్, కేటీఆర్‌కు ప్రజల బాధలు ఇప్పుడు కనిపిస్తున్నాయా అని మంత్రి కొండా సురేఖ ప్రశ్నించారు. వరంగల్ లో సెంట్రల్ జైల్ ను కూల్చి, హాస్పిటల్ ఎందుకు కట్టారు. హాస్పిటల్ మంచి వాతావరణంలో కట్టాలని సూచిస్తే తప్పుగా ప్రచారం చేశారు. ఆందోళనలు, ధర్నాలపై సైతం నిషేధం విధించి.. ధర్నా చౌక్‌ను ఎత్తేసిన ఘనత కేసీఆర్, కేటీఆర్ కు దక్కుతుందని ఎద్దేవా చేశారు. తాము అధికారంలోకి రాగానే ప్రగతిభవన్ ఇనుప బారికేడ్లు తొలగించి ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ప్రజావాణి చేపట్టామన్నారు. శ్వేతపత్రాలతో ఎవరు భయపడుతున్నారు..? తెలంగాణను అప్పులపాలు చేసింది ఎవరు? కాంగ్రెస్ వస్తే పరిశ్రమలు పోతాయి.. కరెంటు పోతుందని మీరు చేసిన విష ప్రచారం ప్రజలు ఇంకా మరిచిపోలేదు అన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్ తోడు దొంగలు అని, అందుకే ఎన్నికల ప్రచారంలో బీజేపీని కేసీఆర్ విమర్శించలేదన్నారు. లిక్కర్ స్కామ్ ఎటు పోయింది? ఎవరు ఎవరితో అంట కాగారు? ప్రధాని మోడీని ఒక్క మాట అనేందుకు కేసీఆర్ భయపడ్డారు! ల్యాండ్ క్రూజర్ వెహికల్స్ 22 కొనుగోలు చేసి విజయవాడలో పెట్టింది నిజం కాదా? వీవీఐపీల భద్రత కోసం వాహనాలు కొనుగోలు చేయాలని కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకుంటే ప్రజలకు ఎందుకు చెప్పలేదు అని ఆమె ప్రశ్నించారు. బిఆర్‌ఎస్ అక్రమాలను వదిలేది లేదని హెచ్చరించారు.