Saturday, July 27, 2024

మెరుపు వరదలతో పెను విషాదం..

తప్పక చదవండి
  • ప్రాణ నష్టంపై అధికారిక ప్రకటన చేసిన సిక్కిం ప్రభుత్వం..
  • 9 ఆర్మీ జవాన్లు సహా, 32 మృతదేహాల వెలికితీత..
  • ఆచూకీ తెలియని 100 మంది..
  • వరదల్లో తెలుగు నటి సరళ కుమారి ఆచూకీ గల్లంతు..

సిక్కిం: ఈనాశ్య రాష్ట్రం సిక్కింలో మెరుపు వరదలు తీవ్ర విషాదాన్ని నింపాయి. తీస్తా నది వరదల్లో గల్లంతైన వారిలో 9 మంది ఆర్మీ జవాన్లు సహా 32 మంది మృతదేహాలను వెలికితీశారు. వరదల్లో గల్లంతైన మరో 100 మంది ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. వీరి కోసం ముమ్మర సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు సిక్కిం ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. ఈశాన్య రాష్ట్రం సిక్కింను అక్టోబర్ 4న ఆకస్మిక వరదలు (క్లౌడ్ బరస్ట్) ముంచెత్తాయి. కుంభవృష్టికి లాచెన్‌ లోయలోని తీస్తా నది ఉప్పొంగడంతో వరదలు బీభత్సం సృష్టించాయి. వరదుల్లో చిక్కుకున్న పలువురిని భారత సైనిక సేనలు రక్షించాయి. ఉత్తర సిక్కింలోని లోనాక్‌ సరస్సు ప్రాంతంలో బుధవారం వేకువజామున కుంభవృష్టి కురిసింది. దీంతో తీస్తా నది నీటిమట్టం ఒక్కసారిగా పెరిగింది. అదే సమయంలో చుంగ్‌థాంగ్‌ డ్యామ్‌ నుంచి నీటిని విడుదల చేయడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. ఎటుచూసినా 20 అడుగుల మేర వరద పారింది. పెద్దపెద్ద భవనాలే పేకమేడల్లా కుప్పకూలాయి. ఆకస్మిక వరదలతో.. చాలా రహదారులు, వంతెనలు దెబ్బతిన్నాయి. అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అధికారిక సమాచారం మేరకు కుంభవృష్టి కారణంగా దాదాపు 41,870 మందిని నిరాశ్రయులను చేసింది.

కాగా వరదల్లో చిక్కుకున్న బాధితులను భారత సైనిక సేనలు పలుచోట్ల రక్షించాయి. ఉత్తర సిక్కింలోని చుంగ్‌తంగ్ ప్రాంతంలో 56 మందిని ఐటీబీపీ దళాలు కాపాడాయి. వీరిలో నలుగురు మహిళలు కూడా ఉన్నారు. కాగా సిక్కిం వరదల్లో నటి సరళ కుమారి ఆచూకీ గల్లంతైంది. దీంతో అమెరికాలో ఉంటున్న ఆమె కుమార్తె ఆవేదన వ్యక్తం చేశారు. తన తల్లి ఆచూకీ కనిపెట్టాలంటూ తెలంగాణ సర్కారుకు ఆమె విజ్ఞప్తి చేశారు.1983లో మిస్ ఆంధ్రప్రదేశ్‌గా ఎంపికైన సరళ కుమారి ఆ తర్వాత సినీ రంగంలోకి అడుగుపెట్టారు. దాన వీర శూరకర్ణ, సంఘర్షణ వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ ప్రాంతంలో నివాసం ఉంటున్న సరళ కుమారి.. అక్టోబరు 2న మిత్రులతో కలిసి సిక్కిం పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటన గురించి అమెరికాలో ఉంటున్న ఆమె కుమార్తెకు కూడా సమాచారం ఇచ్చారు. స్థానికంగా ఉన్న ఓ హోటల్లో వారు బస చేసినట్లు తెలిసింది. అయితే ఇటీవల సంభవించిన ఆకస్మిక వరదల తర్వాత సరళ కుమారి ఆచూకీ గల్లంతయింది. తల్లి నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఆమె కుమార్తె ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్టోబరు 3న చివరిసారిగా నేను అమ్మతో మాట్లాడాను. ఆ తర్వాత ఆమె నుంచి ఎలాంటి సమాచారం లేదు. వార్తల్లో వరదల గురించి తెలుసుకున్నా. ఆర్మీ హాట్‌లైన్‌ నంబర్లకు ప్రయత్నించినా అవి పనిచేయడం లేదు. దయచేసి మా అమ్మను కనిపెట్టండి అని తెలంగాణ ప్రభుత్వానికి ఆమె విజ్ఞప్తి చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు