Sunday, May 19, 2024

కార్మికుల వేజ్‌బోర్డు ఆదాయంతో భారీగా కోతలు

తప్పక చదవండి

భూపాలపల్లి : ప్రాణాలకు తెగించి 650 విూటర్ల లోతున భూమి పొరల్లోకి వెళ్లి బొగ్గును వెలికితీస్తూ దేశానికి వెలుగులు అందిస్తున్న బొగ్గుగని కార్మికుల బతుకులకు కేంద్రం భరోసా కరువయింది. సంపాదించిందంతా ఆదాయపు పన్ను కట్టడానికే పోతున్నది. సైన్యం, నౌకాదళం ఉద్యోగుల మాదిరిగా తమకు కూడా ఆదాయపు పన్నులో మినహాయింపు ఇవ్వాలని సింగరేణి కార్మికులు ఏండ్ల తరబడి చేస్తున్న డిమాండ్‌ బుట్టదాఖలైంది. ప్రాణాలకుతెగించి సింగరేణి కార్మికులు పడే శ్రమను అర్థం చేసుకున్న సీఎం కేసీఆర్‌ అధికారంలోకి రాగానే వారికి ఆదాయపు పన్నులో మినహాయింపు ఇవ్వాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. కానీ కేంద్రం ఇంతవరకు స్పందించలేదు. కార్మికులు ప్రతిఏటా ఇన్‌కం ట్యాక్స్‌ రూపంలో వేల రూపాయలు చెల్లిస్తున్నారు. తాజాగా 11వ వేజ్‌బోర్డుకు సంబంధించి 23 నెలల ఎరియర్స్‌ను సింగరేణి యాజమాన్యం కార్మికులకు చెల్లించింది. ఒక్కో కార్మికునికి రూ. 2 లక్షల నుండి రూ. 4 లక్షల వరకు వచ్చాయి. కాగా అందులో 20 నుంచి 30 శాతం ఆదాయపు పన్ను కోత పడిరది. ఇటు ఇచ్చినట్టే ఇచ్చి అటు ఆదాయ పన్ను రూపంలో లక్షల రూపాయలు కోత విధించారని కార్మికులు వాపోతున్నారు. బొగ్గుగని కార్మికులకు ఆదాయ పన్నును రద్దు చేసేలా జాతీయ కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తేవడంలేదని కార్మికవర్గం ప్రశ్నిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వంలా జాతీయ పార్టీలు ఆయా రాష్ట్రాల్లో ఎందుకు చేయడం లేదని నిలదీస్తున్నారు. సింగరేణిలో అండర్‌గ్రౌండ్‌లో పనిచేసే కార్మికులకు రూ.10 వేలు మాత్రమే ఆదాయ పన్నులో మినహాయింపు ఇస్తున్నారని, ఈ అలవెన్స్‌ను సైతం పెంచే విధంగా పోరాటం చేయలేని జాతీయ కార్మిక సంఘాలు మొత్తం ఆదాయపు పన్నును ఎలా రద్దు చేయిస్తాయని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. భూమి పొరల్లోకి వెళ్లి బొగ్గును వెలికితీసే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన వారెందరో ఉన్నారు. అలాంటి కార్మికుల నుంచి ఆదాయ పన్ను వసూలు చేయడం సరికాదు. సింగరేణి కార్మికులకు ఆదాయ పన్ను మినహాయింపు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో తీర్మానం చేయించి కేంద్రానికి పంపారు. అయినా కేంద్రం యథేచ్ఛగా కార్మికుల నుంచి ఆదాయ పన్ను ముక్కు పిండి వసూలు చేస్తున్నది. తెలంగాణలోని బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు, జాతీయ కార్మిక సంఘాల నేతలు మౌనం వీడాలి. ఆదాయ పన్ను రద్దుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు