Tuesday, May 7, 2024

పొట్టలో దూది మరిచిన వైద్యులు

తప్పక చదవండి

నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట దర్శన్‌ గడ్డ తండాకు చెందిన రోజా నిండు గర్భిణి.. ఈ నెల 15న అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. అదేరోజు రోజాకు వైద్యులు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశారు. అయితే, ఆపరేషన్ పూర్తయ్యాక కడుపులో దూది మర్చిపోయి కుట్లు వేశారు. దీంతో బాధితురాలు కడుపు నొప్పితో ఇబ్బంది పడగా.. ప్రసవం వల్ల కలిగిన నొప్పులని అంతా భావించారు. అయితే, డిశ్చార్జి అయి ఇంటికి చేరుకున్నాక కూడా నొప్పి తగ్గకపోగా రోజా తీవ్ర అస్వస్థతకు గురైంది.

దీంతో ఈ నెల 22న మరోమారు అచ్చంపేట ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అక్కడి వైద్యులు ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పారు. అక్కడి నుంచి ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లగా.. రోజా పరిస్థితి విషమంగా ఉందని, హైదరాబాద్ కు తీసుకెళ్లాలని ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు సూచించారు. దీంతో హైదరాబాద్ కు తీసుకొచ్చి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి రోజా చనిపోయింది. కడుపులోని దూది వల్లే రోజా మరణించినట్లు వైద్యులు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని అచ్చంపేటకు తరలించిన రోజా కుటుంబ సభ్యులు.. ప్రభుత్వ ఆసుపత్రి ముందు డెడ్ బాడీతో ఆందోళనకు దిగారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు